SC Commission: పోలీసుల నిర్లక్ష్యం
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:14 AM
రాతియుగాన్ని తలపించేలా కొందరు కలిసి దళిత యువకుడైన పవన్‌పై విచక్షణారహితంగా దాడి చేయడం దురదృష్టకరమని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎ్‌స.జవహర్ అన్నారు.
తిరుపతి(వైద్యం), ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రాతియుగాన్ని తలపించేలా కొందరు కలిసి దళిత యువకుడైన పవన్‌పై విచక్షణారహితంగా దాడి చేయడం దురదృష్టకరమని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎ్‌స.జవహర్ అన్నారు. దీనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి తిరుపతిలోని రుయాస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌కుమార్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. దాడికి గల కారణాలను, నిందితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అట్రాసిటీ చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రాయితీలను అందిస్తామన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్‌కుమార్‌పై 25 మందికి పైగా దాడికి పాల్పడగా, వీరిలో 16 మందిని గుర్తించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారన్నారు. వీరిలో కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారన్నారు. తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి ఘటన జరగడం బాధాకరమన్నారు. ఇప్పటికే ఎస్పీతో మాట్లాడి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. కర్రలు, లాఠీలతోనే కాకుండా బూటు కాలుతో తన్నిన గాయాలు ఇంకా ఉన్నాయన్నారు. ఎవరి అండతో దాడికి పాల్పడ్డారనేది బయటకు వస్తాయన్నారు. అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన నిందితులపై చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. ఇంకా అట్రాసిటీ చట్టాలను ఉల్లంఘిస్తూ దళితులపై దాడులకు తెగబడుతున్న వారికి గుణపాఠం చెప్పేలా చట్టాలను కఠినంగా అమలు చేస్తామన్నారు. పవన్‌కుమార్‌పై దాడి వీడియో బయటకు వచ్చిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే అదేరోజు పవన్‌కుమార్‌ను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. బాధితుడిని బెదిరించి మరో వీడియో తీసే అవకాశం ఉండేది కాదన్నారు.
ఈ విషయంలో పోలీసుల నిర్లక్ష్యంగా కూడా కనిపిస్తోందని ఆరోపించారు. బాధితుడిని దాచిపెట్టిన ఇంటిని కూడా వేలం వేసి ఆ నగదును బాధితుడికి ఇచ్చేలా విధంగా చర్యలు చేపడతామన్నారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, మాజీ మంత్రి పరసారత్నం, నేతలు సూరజ్, శ్రీధర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.