Vekatagiri: పోలేరమ్మ జాతర ముగిసిన వేడుక
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:07 AM
వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర జనసంద్రాన్ని తలపించింది. గురువారం ఉదయం 4 గంటలకే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.
పొలోమంటూ పోలేరమ్మ జాతరకు
వెంకటగిరి/వెంకటగిరిటౌన్, సెప్టెంబరు 11: వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతర జనసంద్రాన్ని తలపించింది. గురువారం ఉదయం 4 గంటలకే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. బుధవారం రాత్రి చాకలింటి నుంచి ఊరేగింపుగా వచ్చిన అమ్మవారిని.. గురువారం వేకువజామున ఆలయం వద్ద వేపమండలతో వేసిన పందిరిలో కొలువు దీర్చారు. అప్పట్నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. వేయికళ్ల దుత్తల్లో బియ్యపు పిండితో చేసిన ప్రమిదలలో నూనె దీపాలు వెలిగించి భక్తులు నెత్తిన పెట్టుకు వచ్చి నాలుగు కూడల్లో బద్దలు కొట్టారు. మడిచీరలపై ఆసాదుల తప్పెట్ల నడుమ మరికొందరు. నవధాన్య మొలకలను అమ్మవారికి సమర్పించారు. రాజాల ప్యాలస్ నుంచి ఆభరణాలైన బంగారు శూలం, సరుడును రాజా అనుచరుల ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకరించి తీసుకెళ్లారు. నగరి సారెలైన సరవళ్లను రాజా అనుచరులు అమ్మవారికి 12గంటలకు సమర్పించారు. దీంతో వెట్టివారు కుండలో వెలిగించిన గండర దీపాన్ని అమ్మవారికి చూపించి దీపం ఆరకుండా ఊరి పొలిమేరల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అమ్మవారి బలి దున్నపోతును బలిచ్చి ఆ రక్తంతో పొలికుండల్లోని అన్నంతో కలిపి ఊరి పొలిమేరల్లో పొలి..పొలి అని అరుస్తూ చల్లారు. అనంతరం దీపాన్ని విరూప మండపానికి తీసుకెళ్లారు. దున్నపోతు రక్తంతో తడిచిన కత్తిని అమ్మవారికి చూపాక.. రాజాల ప్యాలె్‌సలో పూలతో అలంకరించిన ట్రక్కులో అమ్మవారి ప్రతిమను సాయంత్రం 4 గంటలకు భక్త జనసందోహం నడుమ ఊరేగించారు. శివాలయం వద్దకు ఊరేగింపు చేరుకోగా, అమ్మవారికి అలంకరించిన ఆభరణాలను తీసేశారు.
అనంతరం కైవల్యానది మీదుగా మల్లయ్య తోట వద్ద ఏర్పాటు చేసిన విరూప మండపానికి అమ్మవారు చేరుకోగా, 7.35 గంటలకు ప్రతిమను విరూపం చేసే కార్యక్రమం ముగిసింది. అప్పటి వరకు గండర దీపం ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అమ్మవారి ప్రతిమ మట్టిని ఇంట ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, తింటే రోగాలు దూరమవుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకని మట్టి కోసం భక్తులు పోటీపడటంతో విరూప మండపం వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది.