Red Sanders Smuggling: కింగ్ పిన్స్‌కు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎర్రచందనం అక్రమ రవాణా చేశారో..
ABN , Publish Date - Nov 15 , 2025 | 08:13 PM
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్సుకు జీవం పోసినట్లు పవన్ తెలిపారు. ఎర్రచందనం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతం వాటి వనాల అభివృద్ధి, సంరక్షణకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.
అమరావతి: వైసీపీ గత ప్రభుత్వంలో అటవీ సంపదనూ వదల్లేదని, లక్షలాది ఎర్రచందనం (Red Sandalwood Smuggling) చెట్లను నరికేశారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. అమూల్యమైన అటవీ సంపదను భావితరాలకు అందించాలని.. అందుకే ఎర్రచందనం రక్షణకు సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు ఉప ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా అటవీ సంపద అక్రమ రవాణా నిరోధానికి డ్రోన్లతో పహారా కాస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్సుకు జీవం పోసినట్లు పవన్ తెలిపారు. ఎర్రచందనం ద్వారా వచ్చే ఆదాయంలో నిర్దేశిత శాతం వాటి వనాల అభివృద్ధి, సంరక్షణకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు పోలీసు-అటవీ శాఖల సమన్వయం ప్రధానమని పవన్ కల్యాణ్ అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇంకా మాట్లాడుతూ.. 'ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపద. పర్యావరణపరంగానూ, ఆధ్యాత్మికంగానూ, ఆర్థికంగానూ దీనికి ఉన్న ప్రాధాన్యం అపారమైంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలి. దాని విక్రయాల ద్వారా సమకూరే ఆదాయంలో కొంత భాగం ఎర్రచందనం విత్తనాలు జల్లడం, వనాల అభివృద్ధి, సంరక్షణకు కేటాయించే ఆలోచన చేస్తున్నాం.
శేషాచలం అడవుల నుంచి ఒక్క ఎర్రచందనం దుంగా అక్రమంగా బయటకు వెళ్లకూడదు. అలా జరగాలంటే ఓ పటిష్టమైన ప్రణాళికను రూపొందించాలి. వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తే అక్రమార్కుల ఆటకట్టించడం అసాధ్యం కాదు. ఎర్రచందనం అక్రమ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న కింగ్ పిన్స్‌ను చట్టం ముందు నిలిపేందుకు ప్రత్యేక బృందాలను పోలీసు- అటవీ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలి. చెట్లను నరకడానికి వస్తున్న కూలీలు, మేస్త్రీలు, సూపర్ వైజర్లు, గోదాము కీపర్లు వంటి కిందిస్థాయి వారిని గుర్తించాలి. వారికి అటవీ చట్టంపై అవగాహన కల్పించి ఇతర ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
CII Summit 2025: సీఐఐ సమ్మిట్-2025 సూపర్ హిట్: సీఎం చంద్రబాబు..
AP Heavy Rain Alert: మరో అల్పపీడనం.. మళ్లీ భారీ వర్షాలు..