Tirumala: తిరుమలలో యువకుడి హల్‌చల్
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:56 PM
బాలికతో తన ప్రేమ విఫలమైందంటూ హల్‌చల్ చేసిన ఒక హాకర్‌ను తిరుమల నుంచి బహిష్కరిస్తున్నట్టు జిల్లా పోలీసులు ప్రకటించారు.
తిరుమల, డిసెంబరు11(ఆంధ్రజ్యోతి): బాలికతో తన ప్రేమ విఫలమైందంటూ హల్‌చల్ చేసిన ఒక హాకర్‌ను తిరుమల నుంచి బహిష్కరిస్తున్నట్టు జిల్లా పోలీసులు ప్రకటించారు. గురువారం తిరుమలలో తనను చావనివ్వాలంటూ పెద్దగా అరుస్తూ బటన్ కట్టర్‌తో చేయి కోసుంటూ రక్తగాయాలతో అందరినీ భయబ్రాంతులకు గురిచేసిన శ్రీనివాస్ అనే 20 ఏళ్ల యువకుడిపై కేసు నమోదు చేయడంతో పాటు రౌడీషీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఆ కుటుంబాన్ని తిరుమలకు రానియ్యకుండా చేస్తామంటూ ప్రకటనలో స్పష్టం చేశారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన ప్రకారం.. తెలంగాణలోని నల్గొండకు చెందిన నాగేష్ కుమారుడు శ్రీనివాస్(20) తిరుమలలో భక్తులకు నామాలు పెడుతూ డబ్బులు తీసుకుంటున్నాడు. వీరు 20 ఏళ్లుగా తిరుపతిలో ఉంటున్నారు. గురువారం సాయంత్రం మద్యం తాగి తిరుమలలోని డీఎంబీ రోడ్డులో చేయి కోసుకుని బీభత్సం సృష్టించాడు. సమాచారం తెలిసి విజిలెన్స్ సిబ్బంది చేరుకుని ఆపే ప్రయత్నం చేశారు. ‘దగ్గరికి వస్తే గొంతు కోసుకుంటా’ అంటూ బెదిరించాడు. కొంతసమయానికి పోలీసులు కూడా అక్కడికి చేరుకుని శ్రీనివా్‌సకు నచ్చచెప్పి చాకును స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ ప్రేమించానని చెబుతున్న అమ్మాయి వయసు 15 ఏళ్లని తెలియడంతో పోలీసులు ఇతడిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. కాగా, గత నెల 27వ తేదీన కూడా ఇదే తరహాలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి తిరుమలలో చాకుతో కడుపు, గొంతు కోసుకుని యాత్రికులను హడలెత్తించిన విషయం తెలిసిందే.