Share News

Subsidy: మామిడి రైతులకు త్వరలోనే రూ.160 కోట్ల సబ్సిడీ జమ

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:54 AM

మామిడి రైతుల బ్యాంకు ఖాతాలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 20-25 తేదీల మధ్య రూ.160 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

Subsidy: మామిడి రైతులకు త్వరలోనే రూ.160 కోట్ల సబ్సిడీ జమ
సుమిత్‌కుమార్‌

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతుల బ్యాంకు ఖాతాలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 20-25 తేదీల మధ్య రూ.160 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత మామిడి సీజన్‌లో 37 వేల మంది రైతుల నుంచి వివిధ మార్గాల ద్వారా 4.10 మెట్రిక్‌ టన్నుల తోతాపురి మామిడి కాయల కొనుగోళ్లు జరిగాయన్నారు.గుజ్జు పరిశ్రమల తరపున 2.35 టన్నులు, ర్యాంపుల తరపున 1.65 టన్నుల కాయలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఉద్యానశాఖ ద్వారా గత ఏడాది నుంచి రూ.20 కోట్లు పంటల అభివృద్ధికి ఖర్చు చేయగా, అందులో రూ.10 కోట్లు మామిడి పంట ఉత్పత్తికే ఖర్చుచేశామన్నారు. కవర్లు, కొత్త మొక్కలు, మౌలిక సదుపాయాలు, శిక్షణ తదితర కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని ఖర్చుచేశామని చెప్పారు. మామిడి పంట ఉత్పత్తిలో భాగంగా 10,500 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్‌ కోసం రూ.100 కోట్ల విలువైన ఉపకరణాలు అందించామని వివరించారు. ఇటీవల కొందరు రైతులు రాజకీయ పార్టీల ముసుగులో తామేదో చేస్తామని మామిడి రైతులను మభ్యపెడుతున్నారని, వాటిని నమ్మకండని చెప్పారు. మ్యాంగో వెల్ఫేర్‌ అసోసియేషన్‌గా కొందరు ప్రకటించుకున్నారని, అది గుర్తింపు లేని సంఘం అని వివరించారు. జిల్లాలో రెండు ఫ్యాక్టరీలు మామిడి రైతులకు పాక్షికంగానే చెల్లింపులు చేసినట్లు గుర్తించామని, ఆ ఫ్యాక్టరీల యాజమాన్యాలపై త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. తోతాపురి మామిడి రకం ఉత్పత్తి చిత్తూరులో బాగుందంటూ గుజ్జు ఫ్యాక్టరీని చిత్తూరులో కూడా ఏర్పాటు చేసేందుకు ఓ కంపెనీ ముందుకొచ్చిందని తెలిపారు.

Updated Date - Sep 12 , 2025 | 01:55 AM