Krishna water: వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:40 AM
వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలను తీసుకువస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు.
కుప్పం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది చిత్తూరుకు కృష్ణా జలాలను తీసుకువస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. కుప్పం దాకా ప్రస్తుతం హంద్రీ-నీవా కాలువను తీసుకు వచ్చామని, వచ్చే ఏడాది ఇదేరకంగా చిత్తూరుకు కాలువలను నిర్మిస్తామని, అందుకోసం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.కుప్పంలో కృష్ణా జలాలకు హారతి ఇచ్చిన ఆయన గంగమ్మకు నమస్కరించి, పసుపు కుంకుమ, పూలతో పూజించారు. అనంతరం హంద్రీ-నీవా కుప్పం ఉప కాలువ నిర్మాణం పూర్తయిందన్న గుర్తుగా కాలువ ఒడ్డున నిర్మించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అక్కడే జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన హంద్రీ-నీవా కాలువ నిర్మాణానికి సంబంధించిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం పరమసముద్రం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన సభావేదికకు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.కుప్పంనుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా తనను గెలిపించిన జనం అభిమానం నిలబెట్టుకోవడానికి కృతజ్ఞతాపూర్వకంగా హంద్రీ-నీవా కాలువ నిర్మాణం పూర్తి చేసి కృష్ణా జలాలను మీ ముంగిటిదాకా తీసుకువచ్చానని చెప్పారు.ప్రస్తుతం తరలివస్తున్న కృష్ణా జలాలతో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110చెరువులు నింపుతామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని 520 చెరువులకు నీళ్లిస్తామని, గొలుసుకట్టు చెరువులు ఉన్నాయని, లేనిచోట చెక్ డ్యాముల ద్వారా నీటిని నిలువ ఉంచుతామన్నారు. పాలారు నదిమీద చెక్ డ్యాములు మరమ్మతులు చేయడమే కాక, కొత్త చెక్ డ్యాములు నిర్మిస్తామని, అన్ని చెరువులకు అంచనాలు తయారు చేసి పూడికతీత, మరమ్మతు పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ పనులన్నీ ఏడాదిలో పూర్తయ్యేలా ప్రణాళిక రచిస్తున్నామన్నారు. అయితే వరి వేసి నష్టపోవద్దని, వాణిజ్య పంటలు సాగు చేసి లాభాలు గడించాలని పిలుపునిచ్చారు.
మెగా డీఎస్సీలో నెగ్గి కుప్పంలో ఏకంగా 52 మంది టీచర్లు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. దీనివల్ల ఇక్కడి పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడకుండా చదువులు చక్కగా సాగుతాయని చెప్పారు. కుప్పంలో కడా ద్వారా 12 ప్రాజెక్టులు వచ్చాయని, వీటి ద్వారా ప్రత్యక్ష్యంగా 15600 మందికి, పరోక్షంగా 26,500 మందికి ఉద్యోగ, ఉపాఽధి అకాశాలు లభించాయన్నారు. ప్రత్యేకంగా నిర్మించనున్న అంతర్రాష్ట్ర రహదారుల ద్వారా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రధాన నగగరాలకు మరింత దగ్గరి మార్గాలు ఏర్పడుతాయని చెప్పారు. డిసెంబరులో విమానాశ్రయ నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. తాను ఎన్నోసార్లు చెప్పినట్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ప్రాజెక్టులన్నింటినీ ముందుగా కుప్పానికి తీసుకు వచ్చి కుప్పం నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా చేస్తానని చంద్రబాబు తెలిపారు.