Share News

Investments: జిల్లాకు రూ.1882.65 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:11 AM

రానున్న రెండు మూడేళ్ల వ్యవధిలో రూ.1882.65 కోట్ల పెట్టుబడులతో ఫార్మా, ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమలతో పాటు రెండు స్టార్‌ హోటళ్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 3728 మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Investments: జిల్లాకు రూ.1882.65 కోట్ల పెట్టుబడులు

తిరుపతి, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రానున్న రెండు మూడేళ్ల వ్యవధిలో రూ.1882.65 కోట్ల పెట్టుబడులతో ఫార్మా, ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమలతో పాటు రెండు స్టార్‌ హోటళ్లు జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 3728 మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమలు, హోటళ్ల నిర్మాణానికి గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.

పీసీబీ తయారీ క్లస్టర్‌గా నాయుడుపేట

నాయుడుపేట సెజ్‌లో సిప్సా టెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రూ.1140 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ ద్వారా 1251 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ పరిశ్రమ మొదటి దశ వచ్చే ఏడాది ఫిబ్రవరికి.. రెండో దశ 2028 జనవరికి ప్రారంభం కానున్నాయి. నాయుడుపేట సెజ్‌లో ప్రభుత్వం మొదటి దశలో 20, రెండో దశలో పది చొప్పున మొత్తం 30 ఎకరాలు కేటాయించేందుకు అంగీకరించింది. ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమలో ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు తయారు కానున్నాయి. అందులో హైస్పీడ్‌ ఆర్‌ఎఫ్‌ పీసీబీలు, ఫ్లెక్సిబుల్‌ పీసీబీలు, మల్టీ లేయర్‌ పీసీబీలు వంటి రకాలు తయారు కానున్నాయి. ఈ బోర్డులను సుజుకి, టాటా, టొయోటా, హీరో, మహీంద్ర, వందే భారత్‌ తదితర ఆటో మొబైల్‌ సంస్థలు కొనుగోలు చేసి వాహనాలకు వినియోగిస్తాయి. ఏపీ ఎలకా్ట్రనిక్స్‌ పాలసీ కింద అన్ని రకాల రాయితీలూ కలిపి రూ. 721.75 కోట్ల మేరకు ప్రభుత్వం ప్రయోజనాలు కల్పించేందుకు అంగీకరించింది. ఈ పరిశ్రమ ద్వారా నాయుడుపేటను పీసీబీ తయారీ క్లస్టర్‌గా అభివృద్ధి చెందనుంది.

రేణిగుంటలో మల్లాది డ్రగ్స్‌ విస్తరణ

రేణిగుంట మండలంలో ప్రస్తుతం నడుస్తున్న మల్లాది డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ విస్తరణ ప్రణాళికలో భాగంగా అదనపు ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి కోరింది. రూ.343 కోట్ల పెట్టుబడితో చేపట్టే విస్తరణ ద్వారా 355 ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతిపాదించింది. ఔషధ రంగాన్ని, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ముందుగా దరఖాస్తు చేసుకున్న పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను మల్లాది డ్రగ్స్‌కు మంజూరు చేసింది. మొత్తం పెట్టుబడిలో 30 శాతం సబ్సిడీని ప్రకటించింది.


తిరుపతికి ఒబెరాయ్‌, నాందీ స్టార్‌ హోటళ్లు

తిరుపతికి మరో రెండు స్టార్‌ హోటళ్లు రానున్నాయి. గత ప్రభుత్వంలో తిరుపతిలో 5 స్టార్‌ విల్లాస్‌ లగ్జరీ రిసార్టు నిర్మాణానికి ముందుకొచ్చిన ఒబెరాయ్‌ సంస్థ తీరా ముంతాజ్‌ హోటల్స్‌ అన్న పేరిట బోర్డు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. హిందూ సంఘాలతో పాటు టీటీడీ ప్రస్తుత పాలకవర్గం కూడా అభ్యంతరం తెలపడంతో అలిపిరి సమీపంలో ఒబెరాయ్‌కు జరిపిన భూముల కేటాయింపును ప్రభుత్వం రద్దు చేసిన సంగతీ విదితమే. పేరు విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో ఒబెరాయ్‌ సంస్థ మెస్సర్స్‌ స్వర హోటల్స్‌ పేరిట పేరు మార్చి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టింది. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఇదివరకూ కేటాయించి రద్దు చేసిన భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట 20 ఎకరాలు కేటాయించేందుకు అనుమతించింది. దీంతో రూ.250 కోట్ల పెట్టుబడితో వంద లగ్జరీ విల్లాలను నిర్మించేందుకు ఒబెరాయ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ 5 స్టార్‌ లగ్జరీ విల్లాస్‌ పూర్తయితే 1500 మందికి ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు తిరుపతికి ఆతిథ్య రంగంలో ప్రతిష్ట పెరిగి అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య పెరగనుంది. అలాగే తిరుపతి అక్కారాంపల్లిలో 88 సెంట్ల సొంత స్థలంలో 4 స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు మంత్రివర్గం నాందీ హోటల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ సంస్థ హిల్టన్‌ గార్డెన్‌ బ్రాండ్‌ పేరిట రూ. 149.65 కోట్లతో స్టార్‌ హోటల్‌ నిర్మించనుంది. దీనివల్ల 222 మందికి ప్రత్యక్షంగానూ, 400 మందికి పరోక్షంగానూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 2027 డిసెంబరు కల్లా ప్రాజెక్టు పూర్తి చేయాల్సి వుండగా మంత్రివర్గం రూ.10 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేసింది.

Updated Date - Dec 12 , 2025 | 12:11 AM