Ditwa: తిరుపతి జిల్లాకు నేడు భారీ వర్ష సూచన
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:18 AM
గత ఆరు గంటల్లో ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరప్రాంతాల్లో 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదిలిన దిత్వా.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.
అప్రమత్తమైన యంత్రాంగం
విద్యా సంస్థలకు సెలవు
బీచ్‌లు, జలపాతాలు, నదులవైపు రాకపోకల నిషేధం
పీజీఆర్‌ఎస్ రద్దు
తిరుపతి(కలెక్టరేట్)/సూళ్లూరుపేట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): గత ఆరు గంటల్లో ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరప్రాంతాల్లో 5 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం వైపు కదిలిన దిత్వా.. తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఆదివారం సాయంత్రానికి కడలూరుకు తూర్పున 90 కిలోమీటర్లు, కరైకల్‌కు ఈశాన్యంగా 130, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 90, వేదరన్నియంకి ఈశాన్యంగా 180, చెన్నైకి దక్షిణ- ఆగ్నేయంగా 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఉత్తర తమిళనాడు- పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు కదిలి.. సోమవారం ఉదయానికి క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సోమవారం భారీ వర్షంతోపాటు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా కోట, వాకాడు, చిల్లకూరు, తడ, సూళ్లూరుపేట, గూడూరు తీర ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలపై కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులతో సమీక్షించారు. తీర ప్రాంతాలతో పాటు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించారు. అవసరాన్ని బట్టి పునరావాస కేంద్రాలకు నిరాశ్రయులను తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. తహసీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ 0877-2236007 నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, అధికారుల సెలవులు రద్దుచేసి విధుల్లో చేరి 24 గంటలు అందుబాటులో ఉండాలను కలెక్టర్ ఆదేశించారు. ముందుజాగ్రత్త చర్యగా సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే, కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండలస్థాయిల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఇక, కోట, వాకాడు, చిల్లకూరు వద్ద సముద్ర అలలు ఎగసి పడుతున్నాయి. సూళ్లూరుపేటలో పులికాట్ సరస్సు సుముద్రాన్ని తలపించేలా నీటి అలలు ఉధ్రుతంగా ఉన్నాయి. జిల్లాలోని జలపాతాలు, నదులు, బీచ్‌ల వద్దకు సందర్శకులు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. వాగులు, చెరువులను అధికారులు ఆదివారం పరిశీలించారు.
వర్షపాతం ఇలా..
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నమోదైన వర్షపాతం.. వెంకటగిరిలో 25.2 మి.మీ., చిట్టమూరు 25, పెళ్లకూరు 23.6, తొట్టంబేడు 22.4, దొరవారిసత్రం 20.6, వాకాడు 20 మి.మీ. చొప్పున నమోదైంది. దాదాపు 17 మండలాల్లో వర్షపాతమే నమోదు కాలేదు.
‘అల’కల్లోలం
కోట, ఆంధ్రజ్యోతి: కోట మండలంలోని శ్రీనివాససత్రం, గోవిందపల్లిపాళెం, యమదిన్నెపాళెం గ్రామాల్లో సముద్రం ‘అల’కల్లోలంగా మారింది. శ్రీనివాసత్రం వద్ద భారీ అలలతో 30 అడుగుల ముందుకు సముద్రం వచ్చినట్లు మెరైన్, కోట పోలీసులు తెలిపారు. రెండో రోజూ మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లకుండా తమ బోట్లను ఒడ్డునే ఉంచారు. అలలు ముందుకు వచ్చితాకడంతో బోట్లు ఎక్కడ సముద్రంలోకి కొట్టుకుపోతాయోనని మత్స్యకారులు ఆందోళన చెందారు. శ్రీనివాససత్రం, గోవిందపల్లిపాళెం, యమదిన్నెపాళెం వద్ద సముద్ర తీరానికి సందర్శకులు వెళ్లకుండా మెరైన్ పోలీసులు ఆంక్షలు విధించారు.
విమానాలు ఆలస్యం
రేణిగుంట, ఆంధ్రజ్యోతి: తుఫాను కారణంగా ఆదివారం పలు విమానాలు ఆలస్యంగా వచ్చాయి. రేణిగుంట విమానాశ్రయానికి నిత్యం 16 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఆదివారం ఉదయం 7.15కు హైదరాబాద్ నుంచి రావాల్సిన ఎయిర్ అలయన్స్ విమానం 8.25కు చేరుకుంది. మధ్యాహ్నం 12.35కు రావాల్సిన ఇండిగో ఎయిర్ బస్ 25 నిమిషాలు.. సాయంత్రం 5.20కు ముంబై నుంచి రావాల్సిన ఇండిగో విమానం 6.20కి.. అలాగే పలు విమానాలు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లాకు రెడ్ అలర్ట్
చిత్తూరు సెంట్రల్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): దిత్వా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాన్ ప్రస్తుతం కారైక్కల్‌కి 100కి.మీ, పుదుచ్చేరికి 110కి.మీ, చెన్నైకి 180కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ మరో 24 గంటలపాటు ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా తుఫాన్ కదిలే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రానున్న ఐదు రోజుల్లో వాతావరణం ఇలా..
జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణం ఎలా ఉండనుందో వాతావరణ శాఖ తెలిపింది. బంగారుపాళ్యం, చిత్తూరు, జీడీ నెల్లూరు, ఐరాల, కార్వేటినగరం, నగరి, నిండ్ర, పెనుమూరు, పూతలపట్టు, శాంతిపురం, తవణంపల్లె, వెదురుకుప్పం, విజయపురం, యాదమరి మండలాల్లో 64.6 నుంచి 115.7 మి.మీ వర్షపాతం నమోదు కానుంది. బైరెడ్డిపల్లె, చౌడేపల్లె, గంగవరం, గుడుపల్లె, గుడిపాల, కుప్పం, పలమనేరు, పాలసముద్రం, పెద్దపంజాణి, పులిచెర్ల, పుంగనూరు, రామకుప్పం, రొంపిచెర్ల, శాంతిపురం, సదుం, సోమల, వి.కోట మండలాల్లో 15.7 నుంచి 64.6 మి.మీ వర్షం నమోదు కానుంది.
రానున్న 24 గంటల్లో వర్షపాతమిలా..
నిండ్రలో అత్యధికంగా 25.84 మి.మీ వర్షపాతం నమోదు కానుంది. నగరిలో 22.73, కార్వేటినగరంలో 19.22, విజయపురంలో 12.34, వెదురుకుప్పంలో 9.22, రొంపిచెర్లలో 8.88, పులిచెర్లలో 5.56, శాంతిపురంలో 3.85, సదుంలో 3.49, చౌడేపల్లెలో 3.13 మి.మీ వర్షపాతం నమోదు కానుండగా, మిగిలిన మండలాల్లో అంతకన్నా తక్కువ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.