SP: తిరుపతి ఎస్పీగా మళ్ళీ హర్షవర్ధన రాజు
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:50 AM
తిరుపతి ఎస్పీగా మళ్లీ హర్షవర్ధన రాజును నియమిస్తూ డీజీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తిరుపతి(నేరవిభాగం), జనవరి 20(ఆంధ్రజ్యోతి): తిరుపతి ఎస్పీగా మళ్లీ హర్షవర్ధన రాజును నియమిస్తూ డీజీపీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతేడాది మే 19న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు రెండు నెలల పాటు పనిచేసిన ఈయన జిల్లాలో శాంతి భద్రతలను అదుపు చేయడంలో సఫలీకృతులయ్యారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగించే విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల కమిషన్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. కౌంటింగ్ అనంతరం కూచువారిపల్లి, రామిరెడ్డిపల్లి, చంద్రగిరి, రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో మళ్లీ రాజకీయ ఘర్షణలు జరగకుండా జాగ్త్రతలు తీసుకున్నారు. పోలీసు అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసుకుని సంక్షేమం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి పెద్దపీట వేశారు. పీజీఆర్‌ఎ్‌సలో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారు. తిరుపతిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న తరుణంలో ప్రభుత్వం ఆయన్ను కడప ఎస్పీగా బదిలీ చేసింది. అక్కడ కొద్ది నెలల పాటు పనిచేసి వీఆర్‌కు బదిలీ అయ్యారు. ఆయన పనితీరును గుర్తించిన ప్రభుత్వం మళ్లీ తిరుపతి జిల్లాకు ఎస్పీగా నియమించింది. ఈయన రెండు రోజుల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, ప్రజలు, పోలీసులు, మీడియా సహకారంతో పోలీసు శాఖ పరంగా నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తానని చెప్పారు. గతంలో సిద్ధం చేసిన దాదాపు 10 ప్రతిపాదనలను దశల వారీగా అమలు చేస్తానన్నారు. తిరుపతిలో కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని స్మార్ట్ సిటీ నిధుల కింద సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తానని హర్షవర్ధనరాజు తెలిపారు.
‘ఎర్రచందనం’ టాస్క్‌ఫోర్సుకు సుబ్బరాయుడు
తిరుపతి ఎర్రచందనం టాస్క్‌ఫోర్సు ఎస్పీగా సుబ్బరాయుడిని నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన గతేడాది జూలై 15న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అవినీతి, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఈయన హయాంలో దాదాపు 10 మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయడం, వారికి మెమోలు జారీ చేశారు. శాంతి భద్రతల అదుపునకు, గంజాయిని అరికట్టేందుకు విశేష కృషి చేశారు. చోరీకి గురైన సెల్‌ఫోన్లను భారీ ఎత్తున రికవరీ చేయడంలో రాష్ట్రంలోనే తిరుపతిని నెంబర్ వన్ స్థానంలో నిలిపారు. పోలీసు, ప్రజల మధ్య సమన్వయం కోసం కృషి చేశారు. ఎర్రచందనం టాస్క్‌ఫోర్సు ఇన్‌చార్జిగా.. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ఇటీవల టీటీడీ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీ చేసే ప్రక్రియలో జరిగిన తొక్కిసలాట, తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం, మరో 40 మంది గాయపడడంతో సీరియ్‌సగా తీసుకున్న ప్రభుత్వం సీవీఎస్వోతో పాటు అప్పటి ఎస్పీ సుబ్బరాయుడినీ జనవరి 11న బదిలీ చేసింది. 10 రోజులుగా ఎక్కడా పోస్టింగ్ లేకుండా ఉన్న సుబ్బరాయుడిని తిరుపతి ఎర్రచందనం టాస్క్‌ఫోర్సు ఎస్పీగా నియమించింది.