Share News

Crime: గ్యాంగ్‌ రేప్‌ కలకలం

ABN , Publish Date - Oct 01 , 2025 | 01:40 AM

ఆలస్యంగా వెలుగుచూసిన గ్యాంగ్‌ రేప్‌ ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది.

Crime: గ్యాంగ్‌ రేప్‌ కలకలం

మీవాళ్లంటే మీవాళ్లన్న టీడీపీ, వైసీపీ

చిత్తూరు అర్బన్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆలస్యంగా వెలుగుచూసిన గ్యాంగ్‌ రేప్‌ ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది. నిందితులు రాజకీయ కార్యకర్తలు కావడం అధికార,విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికైంది.

అసలేం జరిగిందంటే..

పూతలపట్టు మండలానికి చెందిన ఓ బాలిక చిత్తూరులో ఇంటర్మీడియట్‌ చదువుకుంటోంది.గత గురువారం బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మురకంబట్టు సమీపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నీవా నగరవనం’ పార్కుకు వెళ్లింది. అక్కడ చిత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు హేమంత్‌, మహేష్‌, కిశోర్‌ ఆ ప్రేమజంటను చూసి టార్గెట్‌ చేశారు. వారి వద్దకు వెళ్లి అటవీశాఖ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం వారిని ఫొటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించారు. ఆ ముగ్గురిలో ఒకరు ‘మా మేడం పిలుస్తోంది రా’ అని జంటలోని అబ్బాయిని దూరంగా పిలుచుకు వెళ్లగా మిగిలిన ఇద్దరు బాలికపై అత్యాచారానికి పాల్ప డ్డారు.తర్వాత మూడవ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.బాధితురాలు ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పగా సోమవారం పార్కు వద్ద ఆ ముగ్గురిలో ఇద్దరికి దేహశుద్ధి చేసి చిత్తూరు తాలుకా పోలీసులకు అప్పగించారు.మరొకడు పరారయ్యాడు.ఈ నేపథ్యంలో సోమవారం బాధితురాలి బాయ్‌ఫ్రెండ్‌ (18) ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు హత్యాయత్నం, రాబరీ, చంపుతామని బెదిరించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం వైసీపీ సోషల్‌ మీడియాలో గ్యాంగ్‌ రేప్‌ విషయం వైరల్‌ కావడంతో పోలీసులు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని వన్‌స్టా్‌ప సెంటర్‌కు తరలించారు.ఆమె ఫిర్యాదు మేరకు ఆ కేసుకు మరిన్ని సెక్షన్లు జోడించారు.పోక్సో, గ్యాంప్‌ రేప్‌తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లను అప్పటికే నమోదైన కేసుకు జత చేశారు. నిందితులకు సంబంధించి వైసీపీ సోషల్‌మీడియాలో రాజకీయ రంగు పులమడం వివాదాస్పదమైంది.ఈ నేపథ్యంలో డీఎస్పీ సాయినాథ్‌, సీఐలు మహేశ్వర్‌, శ్రీధర్‌నాయుడుమీడియాతో మాట్లాడుతూ ‘అత్యాచార ఘటనలో అలసత్వం, పక్షపాతం లేకుండా పూర్తి పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నాం.సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు మానుకోవాలి’అని సూచించారు.


నిందితులు ఎవరంటే..

హేమంత్‌ చిత్తూరు నగరం సంతపేటకు చెందినవాడు.రాజకీయాలతో సంబంధం లేదు.కిశోర్‌ రెండు నెలల క్రితం దాకా వైసీపీలో యాక్టివ్‌గా తిరిగేవాడు. వినాయకచవితి పండుగనాడు టీడీపీలో చేరాడని చెబుతున్నారు. అయితే నిందితులకు టీడీపీ సభ్యత్వం లేదని, వినాయకచవితి ఉత్సవాలకు ఆహ్వానించేందుకు వచ్చారని ఎమ్మెల్యే జగన్మోహన్‌ చెబుతున్నారు.రాజకీయాలతో సంబంధం లేకుండా కూలి పనులతో జీవనం సాగించే మహేష్‌ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరినట్లు చెబుతున్నారు. హేమంత్‌, కిశోర్‌ ఓ ప్రైవేటు బ్యాంకులో లోన్‌ సెక్షన్‌ సేల్స్‌ ఆఫీసర్లుగా పనిచేసేవారు. హేమంత్‌ మానేయగా, కిశోర్‌ కొనసాగుతున్నారు.

వైసీపీ పోస్టులతో రాజకీయ కలకలం

గ్యాంగ్‌ రేప్‌ విషయాన్ని మంగళవారం వైసీపీ పలు వాట్సాప్‌ గ్రూపుల్లో, సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసింది. నిందితులు కిశోర్‌, మహేష్‌ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌తో వున్న ఫొటోలను పోస్ట్‌ చేసింది. దీంతో టీడీపీ వాళ్లు కూడా విజయానందరెడ్డితో, పెద్దిరెడ్డితో నిందితులు కలిసి ఉన్న ఫొటోలను బయటపెట్టారు. అంతేకాకుండా ఎమ్మెల్యే జగన్మోహన్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘అత్యాచార ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి. వాళ్లు మా పార్టీ వాళ్లు కాదు. సభ్యత్వం కూడా లేదు. వైసీపీ వాళ్లే. వినాయక చవితి ఉత్సవాలకు ఆహ్వానించేందుకు లోకల్‌ టీడీపీ లీడర్లతో కలిసి నా వద్దకు వచ్చినప్పుడు ఫొటోలు తీసుకున్నారు’ అని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయానందరెడ్డి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టారు. ‘గ్యాంగ్‌ రేప్‌ ఘటనను మొదట సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది మా వాళ్లే. ఆ తర్వాతే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు గతంలో మా పార్టీలో వున్నవారే కానీ వాళ్ల వైఖరి నచ్చక పంపించేశాం’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - Oct 01 , 2025 | 01:44 AM