Tirumala: శ్రీవారి హుండీలో విదేశీ కరెన్సీ
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:42 AM
ప్రపంచంలో 197 దేశాలుంటే 157 దేశాల కరెన్సీ శ్రీవారి హుండీలో లభించింది. 2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ఆధారంగా చూస్తే రూ.201,65,97,829 విదేశీ కాయిన్స్, నోట్లు అందాయి.
ఆంధ్రజ్యోతి, తిరుమల: తృణమో ఫణమో అయినా స్వామికి హుండీలో సమర్పించుకోకుండా తిరుమల కొండకు వచ్చిన భక్తులెవరూ తిరుగు ప్రయాణం కారు. అట్లా శ్రీనివాసుడికి నగదూ, నాణేలూ, ఆభరణాలతో పాటు భూములు, భవనాల పత్రాలు కూడా హుండీ ద్వారా లభిస్తుంటాయి. హుండీ అనేది డబ్బు సేకరణకు సాధనం కాదు. భక్తికి ప్రతీక. దేశదేశాల నుంచి వచ్చే భక్తులు తమ దేశాల కరెన్సీనీ, నాణేలనూ హుండీలో వేస్తుంటారు. ప్రపంచంలో 197 దేశాలుంటే 157 దేశాల కరెన్సీ శ్రీవారి హుండీలో లభించింది. 2015 నుంచి 2025 మార్చి వరకు ఉన్న రికార్డుల ఆధారంగా చూస్తే రూ.201,65,97,829 విదేశీ కాయిన్స్, నోట్లు అందాయి. గడిచిన పదేళ్లలో ఏడాదికి సగటున రూ.20.16 కోట్లు విదేశీ సొమ్ములు స్వామి ఖజానాకు అందుతున్నాయి. విదేశీ కరెన్సీని వేలం ద్వారా మనీ చేంజర్స్‌కి అందజేసి స్వదేశీ కరెన్సీగా టీటీడీ మార్చుకుంటుంది. 2003 వరకు బరువు ప్రాదిపదికన నాణేల విక్రయం జరిగేది. ఆ తర్వాత వాటి విలువ ఆధారంగా మార్పిడి జరుగుతోంది. ఎఫ్‌సీఆర్‌ఏ మార్గదర్శకాల ప్రకారం తిరుమల ఎస్‌బీఐ బ్రాంచ్ నుంచి న్యూఢిల్లీలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో విదేశీ కరెన్సీని, నాణేలనూ జమ చేస్తున్నారు. రెండేళ్ల కిందట టీటీడీ ఎఫ్‌సీఆర్‌ఏ(ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) నిబంధనలను ఉల్లంఘించిందనే వివాదం కూడా నడిచింది. విరాళాలు ఇచ్చే దాతల వివరాలు తెలియజేయడం లేదనే రిపోర్టు ఆధారంగా టీటీడీకి జరిమానా కూడా విధించారు. అయితే హుండీలో సమర్పించే కానుకలు కావడంతో ఈ విరాళాలను ‘శ్రీవారికి సమర్పించే కానుకలు’గా పరిగణిస్తూ దాతల వివరాలను తెలియజేయాల్సిన అవసరం లేదంటూ యాక్ట్ నుంచి మినహాయింపు లభించింది.
2007 వరకు కూడా కేవలం 15 నుంచి 30లోపు దేశాలకు సంబంఽధించిన కరెన్సీ మాత్రమే పరకామణి లెక్కింపులో కనిపించేది. ఆ తర్వాతే ఇతర దేశాలకు సంబందించి కాయిన్స్‌తో పాటు నోట్లు అధికంగా రావడం మొదలయ్యాయి. 2010 వరకు ఉన్న లెక్కలను పరిశీలిస్తే సింగపూర్, అమెరికా డాలర్లు, యూరో సెంట్లు, బ్రిటిష్ పౌండ్లు, మలేషియా, ఆస్ర్టేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల నగదు అధికంగా ఉండేవి. ఆ తర్వాత అనేక దేశాలకు సంబంధించిన కరెన్సీ కానుకలుగా రావడం పెరిగిపోయింది. అమెరికా, మలేషియా, సింగపూర్‌తో పాటు యూఏఈ దేశాల కరెన్సీ అధికంగా ఉంటోంది. స్వామి హుండీలో పాకిస్తాన్ కరెన్సీ కూడా కనిపిస్తూ ఉంటుంది. 2004లో 10 టన్నుల విదేశీ నాణేలను టీటీడీ విక్రయించి దాదాపు రూ.కోటి ఆదాయాన్ని పొందింది. అందులో 80 వేల సింగపూర్ డాలర్లు, 1.6 లక్షల అమెరికన్ డాలర్లు, 3 వేల యూరో సెంట్లు, 35 వేల బ్రిటిష్ పౌండ్లు, 8 లక్షల మలేషియన్ రింగెట్లు, 4 వేల ఆస్ర్టేలియన్ డాలర్లు, వెయ్యి దక్షిణాఫ్రికా రాండ్లు, 15వేల కెనిడియన్ సెంట్లు, 10 వేల లంకన్ రూపాయలు ఉన్నాయి. 2007 డిసెంబరు నెల చివరి వారంలో ఆరు రోజుల్లో దాదాపు 14 దేశాలకు చెందిన కరెన్సీ హుండీలో చేరింది. జూ 2016లో హుండీ ద్వారా విదేశీ కరెన్సీ 50.63 కోట్లు లభించింది. 2015లో రూ.44.81 కోట్లు ఇతర దేశాల కరెన్సీ లభించింది. 2020-21 కరోనా సమయంలోనూ స్వామి హుండీలో రూ.1.92 కోట్లు ఇతర దేశాల నగదు చేరడం విశేషం.