Women: వ్యాపార రంగంలో మహిళలకు ప్రోత్సాహం
ABN , Publish Date - May 11 , 2025 | 01:16 AM
ఏటా లక్షమంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు ఇదివరకే హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు నిర్వహించేలా తృప్తి క్యాంటీన్లను ప్రవేశపెట్టారు.
మరింతమందికి పరోక్ష ఉపాధి
చిత్తూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): మహిళల్ని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఏటా లక్షమంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని సీఎం చంద్రబాబు ఇదివరకే హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు నిర్వహించేలా తృప్తి క్యాంటీన్లను ప్రవేశపెట్టారు. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టులుగా ప్రవేశపెట్టగా.. నెల్లూరులో ఇటీవల తృప్తి క్యాంటీన్‌ను ప్రారంభిచారు. మన జిల్లాలోని మున్సిపల్ ప్రాంతాల్లోనూ 82 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరి మున్సిపాలిటీల్లో 7,953 స్వయం సహాయక పొదుపు సంఘాలుండగా..81,700 మంది సభ్యురాళ్లున్నారు. నలుగురు సభ్యురాళ్లను ఓ యూనిట్‌గా ఏర్పాటు చేసి తృప్తి క్యాంటీను అప్పగిస్తారు. దీనిని నడిపేందుకు 20 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో కంటెయినర్‌ను ప్రభుత్వం అందిస్తుంది. వంట, నిర్వహణ అంశాలపై శిక్షణ ఇస్తుంది. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తూ ఎలక్ర్టిక్ పరికరాలు అందిస్తారు. సౌరశక్తిని ఉపయోగిస్తారు. వంటలు కూడా ఎలక్ర్టిక్ పరికరాలపై చేయనున్నారు.
నాలుగు విడతల్లో 82 క్యాంటీన్లు..
ఈ ఏడాది జూన్‌లోగా చిత్తూరులో రెండు, మిగిలిన మున్సిపాలిటీల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 6 క్యాంటీన్లను డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే సెప్టెంబరులోగా చిత్తూరులో 12, మిగిలిన మున్సిపాలిటీల్లో 3 చొప్పున మొత్తం 24... డిసెంబరులోగా చిత్తూరులో 13, నగరిలో 4, మిగిలినచోట 3 చొప్పున మొత్తం 26... మార్చిలోగా చిత్తూరులో మరో 13, నగరిలో 4, మిగిలినచోట 3 చొప్పున మొత్తం 26 క్యాంటీన్లు ఏర్పాటుచేయాలని లక్ష్యం పెట్టుకన్నారు. 2026 వ ఆర్థిక సంవత్సరంలోగా జిల్లావ్యాప్తంగా 82 తృప్తి క్యాంటీన్లు పనిచేస్తుండాలి.
75 శాతం మహిళలదే పెట్టుబడి
క్యాంటీన్ నిర్వహణకు మొత్తం రూ.16.40 లక్షలు పెట్టుబడిగా నిర్ణయించారు. ఇందులో 75 శాతం అంటే రూ.12.30 లక్షల్ని నలుగురు డ్వాక్రా మహిళలు తమ వాటాగా వేసుకోవాలి. మిగిలిన 25 శాతం అంటే రూ.4.10 లక్షల్ని ప్రభుత్వం తరఫున సారా ప్రాజెక్ట్స్ ఫిర్మ్ అనే సంస్థ పెట్టుకుంటుంది. రూ.16.40 లక్షల్లో కంటైనర్‌కు రూ.4.48 లక్షలు, మెషినరీకి రూ.5.82 లక్షలు, సోలార్ పవర్‌కు రూ.4.10 లక్షలు, వర్కింగ్ కేపిటల్ కింద రూ.2 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంది.
నెలకు రూ.2.46 లక్షల లాభం వచ్చేలా..
ఒక్కో క్యాంటీన్ నెలవారి టర్నోవర్ రూ.6.39 లక్షలు ఉండేలా.. ప్రతి నెలా నికర లాభం రూ.2.46 లక్షలు వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.అల్పాహారం ద్వారా రూ.90 వేలు, టీ నుంచి రూ.1.44 లక్షలు, కాఫీ నుంచి రూ.2.16 లక్షలు, బిర్యానీ ద్వారా రూ.1.35 లక్షలు, వాటర్ బాటిల్స్ ద్వారా రూ.54 వేలు వచ్చేలా ప్లాన్ చేసింది. 24 గంటలూ పనిచేస్తే అనుకున్న లాభాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
పరోక్షంగానూ ఉపాధి
జిల్లాలో 82 క్యాంటీన్లు ఏర్పాటైతే ఒక్కో దానికి నలుగురు చొప్పున 328 మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా మారనున్నారు. అలాగే పరోక్షంగా మరో 328 మందికి ఉపాధి కూడా లభిస్తుంది. వచ్చిన లాభంలో 75 శాతం మహిళలు, 25 శాతం ప్రారంభ పెట్టుబడి పెట్టిన సంస్థ తీసుకుంటుంది.
మున్సిపాలిటీ లక్ష్యం
చిత్తూరు 40
కుప్పం 10
పలమనేరు 10
నగరి 12
పుంగనూరు 10
మొత్తం 82