Share News

Seeds: 4నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ

ABN , Publish Date - May 30 , 2025 | 12:34 AM

జిల్లాలో జూన్‌ నాల్గవ తేదీ నుంచి వేరుశనగ విత్తనకాయల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ తెలిపారు.

Seeds: 4నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ
పెనుమూరులో గోడౌన్‌కు చేరిన వేరుశనగ విత్తనాలు

చిత్తూరు సెంట్రల్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జూన్‌ నాల్గవ తేదీ నుంచి వేరుశనగ విత్తనకాయల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ తెలిపారు. గురువారం తన చాంబర్‌లో ఏడీఏలతో పలు అంశాలపై సమీక్షించారు. వేరుశనగ విత్తనకాయల పంపిణీ, డ్రోన్ల అందజేత, భూసార పరీక్షలు, పంటల సాగు, యోగా అంశాలపై సమీక్షించారు. భూసార పరీక్షల ఆధారంగా రైతులు పంటలు సాగు చేసేలా చూడాలని సూచించారు. జూన్‌ 9, 10, 11 తేదీల్లో ప్రతి మండలంలోనూ రైతులతో యోగాసనాలు వేయించి, యోగాతో కలిగే ప్రయోజనాలు వివరించాలని చెప్పారు. సమావేశంలో చిత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు ఏడీఏలు ఉమ, సౌభాగ్యలక్ష్మి, గీతాకుమారి, శివకుమార్‌ పాల్గొన్నారు.

27 మండలాల్లో ‘పొలంబడి’

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జూన్‌ మొదటి వారం నుంచి జిల్లాలోని 27 మండలాల్లో పొలంబడి కార్యక్రమం చేపట్టనున్నారు. రైతులు సాగు చేసే పంటలు, వాడుతున్న ఎరువుల సాంద్రత, భూసార పరీక్షలు చేస్తారు. సేంద్రియ ఎరువులతో సాగు చేసిన పంటలకు ప్రాధాన్యం ఇస్తూ ఆ రైతుకు ఇండిగ్యాప్‌ సర్టిఫికేషన్‌ ఇస్తారు. డివిజన్‌కు ఒకటి చొప్పున ఉండే ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ కింద రైతును నమోదు చేస్తారు. ఆ రైతు తాను పండించిన పంటను గిట్టుబాటు ధరలకు ఇక్కడ విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది.

Updated Date - May 30 , 2025 | 12:34 AM