Share News

Collector : మార్గదర్శిగా కలెక్టర్‌

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:55 AM

ఐదు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ‘మార్గదర్శి’గా మారారు.

Collector : మార్గదర్శిగా కలెక్టర్‌
దత్తత తీసుకున్న కుటుంబాలతో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి(కలెక్టరేట్‌), జూలై 11(ఆంధ్రజ్యోతి): ఐదు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ‘మార్గదర్శి’గా మారారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పీ-4 కార్యక్రమం కింద జిల్లాలో సామాజిక అభివృద్ధికి దోహదపడేలా, అందరికీ ఆదర్శప్రాయంగా మొదటగా ఐదు బంగారు కుటుంబాలను శుక్రవారం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ దత్తత తీసుకున్నారు. కలెక్టరేట్‌కు సమీపంలోని నక్కల కాలనీకి చెందిన నాలుగు, దామినేడుకు చెందిన ఓ కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. శుక్రవారం వారు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులు మెరుగపడేందుకు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అవకాశాల్లో పునాదులు ఏర్పడేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబాల సంక్షేమం కోసం వ్యక్తిగతంగానే కాకుండా జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల సహకారం, సమన్వయంతో సాయం అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమం జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులకు, సమాజ సేవకులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతగా ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుంటే గ్రామీణాభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందని కలెక్టర్‌ తెలిపారు.

దత్తత తీసుకున్న కుటుంబాలు:

షికారీ కాలనీకి చెందిన సావిత్రమ్మ, వేదవల్లి, అంబికా, బలరాం, దామినేడుకు చెందిన విజయశాంతి కుటుంబాలు.

Updated Date - Jul 12 , 2025 | 12:55 AM