Share News

Accident: కారు ప్రమాదం

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:16 AM

గుడికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

Accident: కారు ప్రమాదం
ధ్వంసమైన కారు

గంగాధరనెల్లూరు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): గుడికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గంగాధరనెల్లూరు మండలం వేపంజేరి పంచాయతీ గోవిందరెడ్డిపల్లెకు చెందిన మాజీ మండల వైసీపీ కన్వీనర్‌ సురేంద్రరెడ్డి భార్య చిట్టెమ్మ(49), కుమార్తె కీర్తి (30), మనవడు శాన్విక్‌రెడ్డి (1), తమ్ముడు చిన్నబ్బరెడ్డి అలియాస్‌ విశ్వనాథరెడ్డి(52), మరదలు రేఖ (42), వారింట్లో పనిమనిషి పద్మమ్మ (58)తో కలిసి మంగళవారం మధ్యాహ్నం తమిళనాడులోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి గుడికి కావడి చెల్లింపుల కోసం కారులో బయల్దేరారు. చిత్తూరు - తచ్చూరు రోడ్డులో తమిళనాడు రాష్ట్రం పళ్లిపట్టుకు సమీపంలోని కుమారరాజాపేట వద్దకొచ్చేసరికి గుంతను తప్పించబోయి అక్కడున్న బ్రిడ్జిని కారు ఢీకొంది. తర్వాత బ్రిడ్జి నుంచి కిందకు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులోని పద్మమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చిన్నబ్బరెడ్డి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శాన్విక్‌రెడ్డి మరణించారు. చిట్టెమ్మ, కీర్తి, రేఖలకు కూడా తీవ్ర గాయాలవడంతో తమిళనాడులోని రాణిపేట సీఎంసీ ఆస్పత్రికి తరలించారు.

గోవిందరెడ్డిపల్లెలో విషాదఛాయలు

విషయం తెలియడంతో గోవిందరెడ్డిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి బుధవారం రాణిపేట సీఎంసీకి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారని వైసీపీ నేతలు పేర్కొన్నారు. సుమారు రెండు నెలల కిందటే సురేంద్రరెడ్డి కుమారుడికి వివాహమైంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడం స్థానికులను కలచివేసింది.

Updated Date - Aug 13 , 2025 | 01:16 AM