Share News

Soldier: ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను వీరమరణం

ABN , Publish Date - Jan 21 , 2025 | 12:48 AM

కశ్మీర్‌లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన యువ జవాన్‌ కార్తీక్‌ ప్రాణాలు కోల్పోయారు.

Soldier: ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను వీరమరణం
కార్తీక్‌ (ఫైల్‌ ఫొటో) - కుటుంబీకులతో కార్తీక్‌

బంగారుపాళ్యం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లో సోమవారం చోటు చేసుకున్న ఉగ్రవాదుల కాల్పుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన యువ జవాన్‌ కార్తీక్‌ ప్రాణాలు కోల్పోయారు. బంగారుపాళ్యం మండలం ఎగువ రాగిమానుపెంటకు చెందిన వరదరాజులు, సెల్వి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాజేష్‌, చిన్న కుమారుడు కార్తీక్‌ (29). కార్తీక్‌ ప్రాథమిక విద్యాభ్యాసం బంగారుపాళ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఇంటర్మీడియట్‌ చిత్తూరు పీసీఆర్‌లో పూర్తి చేశాడు. డిగ్రీ చదువుకుంటూ 2017లో ఆర్మీలో చేరాడు. దీపావళికి ఇంటికి వచ్చి వారం పాటు కుటుంబ సభ్యులతో స్నేహితులతో గడిపాడు. మే నెలలో మళ్లీ వస్తానని చెప్పి విధులకు వెళ్లాడు. ఆదివారం నార్త్‌ జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు, సైనికుల మధ్య జరిగిన కాల్పుల్లో కార్తీక్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్మీ అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కార్తీక్‌ తండ్రి వరదరాజులకు ఆర్మీ అధికారులు ఫోన్‌ చేసి.. మీ కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. సాయంత్రం మళ్లీ ఫోన్‌ చేసి వీరమరణం పొందాడని సమాచారం ఇచ్చారు. దీంతో రాగి మానుపెంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం కార్తీక్‌ పార్థివదేహం ఎగువ రాగిమానిపెంటకు చేరుకుంటుందని ఆయన తండ్రి వరదరాజులు తెలిపారు.

Updated Date - Jan 21 , 2025 | 12:48 AM