Renigunta: నేపాల్ నుంచి రేణిగుంట చేరుకున్న 40 మంది
ABN , Publish Date - Sep 12 , 2025 | 02:12 AM
విహార యాత్రలో భాగంగా నేపాల్ వెళ్లారు. అక్కడ నెలకొన్న అలర్ల నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల్లో చిక్కుకున్నారు. తిరిగి ఇళ్లు చేరగలమా అని ఆందోళన చెందారు. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. నేపాల్ నుంచి రప్పించింది.
తిరుపతి(వైద్యం)/రేణిగుంట, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): విహార యాత్రలో భాగంగా నేపాల్ వెళ్లారు. అక్కడ నెలకొన్న అలర్ల నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల్లో చిక్కుకున్నారు. తిరిగి ఇళ్లు చేరగలమా అని ఆందోళన చెందారు. అలాంటి వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. నేపాల్ నుంచి రప్పించింది. అలా తిరుపతి జిల్లాకు చెందిన 9 మంది, కడప జిల్లా 19, నెల్లూరు జిల్లా చెందిన ఐదుగురు, అన్నమయ్య జిల్లాకు చెందిన ముగ్గురు, అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు, నంద్యాల జిల్లాకు చెందిన 2.. మొత్తం 40 మంది గురువారం రాత్రి 10.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉద్విగ్నత, ఉత్సాహం, భావోద్వేగానికి గురయ్యారు. వీరికి ఎయిర్‌పోర్టులో కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు తిరుపతి, చంద్రగిరి, పూతలపట్టు, కడప, కోడూరు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, మురళీమోహన్, మాధవిరెడ్డి, శ్రీధర్, శాప్ చైర్మన్ రవినాయుడు, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తదితరులు స్వాగతం పలికారు. ప్రయాణం ఎలా సాగిందని అడిగారు. ప్రభుత్వ చొరవ, నారా లోకేష్ కృషి లేకుంటే తాము స్వదేశానికి చేరుకునే వాళ్లం కాదంటూ వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. వీరికి తిరుమల శ్రీవారి, శ్రీకాళహస్తీశ్వరస్వామి ప్రసాదాలను అందజేశారు. విమానాశ్రయంలో భోజన వసతి కల్పించారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో వారిని స్వస్థలాలకు తరలించారు.
ఇప్పటికీ భయమేస్తుంది : చంద్రశేఖర్‌రావు, తిరుపతి
నేపాల్లో మేము చూసిన పరిస్థితులను తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది.ఇక అయిన వారిని చూడలేమని, ప్రాణాలతో బయటపడలేమనే పరిస్థితులకొచ్చాం. అలాంటి మమ్మల్ని బయట పడేసి సురక్షితంగా ఇళ్లకు చేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి ప్రశంసనీయం.
తిరిగి వస్తామనుకోలేదు : లోహిత, రేణిగుంట
విహారయాత్ర కాస్త మా కుటుంబంలో విషాద యాత్రగా మారుతుందనుకున్నాను. అక్క డ పరిస్థితులు చూస్తే ఆ విధంగానే ఉన్నాయి. బయటకు అడుగు పెట్టాలంటే భయం. హోటళ్లో ఉండాలన్నా వాటిపైనా దాడులు. అటువంటి పరిస్థితుల నుంచి బయట పడేసి సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉంది.
నా భార్యకు తగిలే దెబ్బలు చూసి..: నాగేంద్రప్రసాద్, కడప
ఈ నెల 5న నా భార్య శ్రీదేవితో కలిసి నెపాల్ వెళ్లా. మేము ఉంటున్న హోటల్‌పై ప్రజలు తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో నా భార్య బాగా గాయపడింది. నా ప్రాణాలు విలవిల్లాడాయి. హోటల్లో నుంచి బయటకు కూడా రాలేమనుకున్న పరిస్థితుల్లో ఏకంగా ఇంటికే తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందుకు కృషి చేసిన ప్రభుత్వానికి రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా.
మా వాహనాలపై రాళ్లు విసిరారు: ప్రకాష్ బాబు, మదనపల్లె
పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇండియా సరిహద్దుకు వెళ్తుండగా స్థానికులు మా వాహనాలపై రాళ్లు విసిరారు. ఏం జరుగుతుందో తెలియలేదు. ప్రాణాలతో బయటపడి బిక్కు బిక్కుమంటున్న మాకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఊపిరి పీల్చుకున్నాం. 24 గంటల్లో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోగలిగాం.
రెండు రోజులు హోటళ్లకే పరిమితమయ్యాం: రాజేశ్వరి, కడప
ఈనెల 1న కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నేపాల్ వెళ్లాం. అన్ని ప్రాంతాలు చూసుకుని తిరుగు ప్రయాణమయ్యే సమయంలో అక్కడి పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. స్థానికులు మా బస్సుపై దాడి చేశారు. రెండు రోజులు హోటళ్లకే పరిమితమయ్యాం. కూటమి ప్రభుత్వం స్పందించి మమ్మల్ని గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయడం ఆనందం కలిగించింది. ఈ విషయంలో మంత్రి లోకేశ్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.
బస్సులోనే ప్రాణాలు పోతాయనుకున్నాం: మల్లికార్జున్, శశికళ దంపతులు, అనంతపురం
మా బస్సును వందల మంది ఒక్కసారిగా వచ్చి చుట్టుముట్టి రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఆ దాడిలో బస్సులోని వారు అనేక మంది గాయపడ్డారు. మాకు కూడా రాళ్ల దెబ్బలు తగిలాయి. మా ప్రాణాలు బస్సులోనే పోతాయి అనుకున్నాం. ఆ సమయంలో కొందరు పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు. అక్కడి పరిస్థితులను చూసి ఇక ప్రాణాలతో తిరిగి వస్తామనుకోలేదు. అంతటి పరిస్థితులు కొనసాగుతున్న దేశంలో నుంచి మమ్మల్ని స్వదేశానికి తీసుకువచ్చిన ప్రభుత్వానికి, మంత్రి లోకేశ్‌కు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.