Industries: 4 పరిశ్రమలు.. రూ.3,972 కోట్లు
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:52 AM
శ్రీసిటీలో రూ.1,629 కోట్లు, నాయుడుపేటలో రూ.2,343 కోట్ల చెప్పున రూ.3,972 కోట్లతో నాలుగు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
తిరుపతి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): శ్రీసిటీలో రూ.1,629 కోట్లు, నాయుడుపేటలో రూ.2,343 కోట్ల చెప్పున రూ.3,972 కోట్లతో నాలుగు పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ మేరకు సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు ప్రతిపాదనలను ఆమోదించారు. శ్రీసిటీలో రూ. 550 కోట్ల పెట్టుబడితో 1130 ఉద్యోగాలు కల్పించేందుకు మెస్సర్స్ ఎస్‌సీఐసీ వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ సంస్థ ముందుకొచ్చింది. పీసీడీఏ మానుఫ్యాక్చరింగ్, బీఎల్‌డీసీ మోటార్స్, కాపర్ ట్యూబ్స్ మాన్యుఫ్యాకరింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు ఈ సంస్థ చేసిన ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించింది. పారిశ్రామిక విధానంకింద అవసరమైన రాయితీలు, మినహాయింపులు ఇవ్వడానికి అంగీకరించింది. అలాగే రూ.1079 కోట్లతో 1500మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తా మంటూ మెస్సర్స్ క్రియాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆసక్తి చూపింది. ఐటీ ఎన్‌క్లోజర్స్, పీసీబీ బేర్ బోర్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకు ప్రతిపాదించగా మంత్రిమండలి ఆమోదించింది.
నాయుడుపేటలో రూ.2343 కోట్లతో..
నాయుడుపేటలో సోలార్ పవర్ కేటగిరీలో మెస్సర్స్ వోల్ట్‌సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 1748 కోట్ల పెట్టుబడితో 4 గిగావాట్స్ సోలార్ సెల్ అండ్ మాడ్యూల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 415 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రతిపాదించింది. ఈ సంస్థకు 40 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి మండలి అంగీకరించింది. నాయుడుపేట ఇండస్ట్రియల్ పార్కులో మెస్సర్స్ గ్రీన్ లామ్ సౌత్ లిమిటెడ్ రూ. 595 కోట్ల పెట్టుబడితో పార్టికల్ బోర్డ్ అండ్ లామినేట్ యూనిట్ నెలకొల్పేందుకు ప్రతిపాదించింది. రోజుకు 650 సీబీఎంసామర్థ్యంతో ఉత్పత్తిచేస్తామని, తద్వారా 850మందికి ఉద్యోగావకాశాలుకల్పిస్తామని ప్రతి పాదించగా మంత్రిమండలి అనుమతిచ్చింది.
ఎపిటోమ్ సంస్థకు 19 ఎకరాలు
నాయుడుపేట ఎంపీఎ్‌సఈజెడ్‌లో మెస్సర్స్ ఎపిటోమ్ కాంపొనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పీసీడీలు, అనుబంధ ఎలకా్ట్రనిక్ కాంపొనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ ఫెలిసిటీ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థకు 19.06 ఎకరాల భూమి కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదించింది.
కోవనూరులో టిడ్కోకు 32.21 ఎకరాలు
కేవీబీపురం మండలం కోవనూరులో పీఎంఏవై 2.0 పథకం కింద ఎన్టీఆర్ నగర్ పేరిట పేదలకు ఇళ్ళు నిర్మించివ్వడం కోసం టిడ్కోకు 32.21 ఎకరాలను కేటాయించేందుకు మంత్రి మండలి అంగీకరించింది. కోవనూరు గ్రామం సర్వే నంబరు 363-1లో 19.27 ఎకరాలు, సర్వే నంబరు 365లో 12.94 ఎకరాలు చొప్పున కేటాయించనున్నారు. ఎకరా రూ.18.55 లక్షల చొప్పున రూ.5.97 కోట్లకు భూములు కేటాయించేలా నిర్ణయించింది. ఆ మొత్తాన్ని టిడ్కో 2025-26 నుంచీ 2029-30 నడుమ ఐదు వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించారు.
తిరుపతిలో టీడీపీ ఆఫీసుకు భూమి కేటాయింపు
తిరుపతిలో టీడీపీ పార్లమెంటు కమిటీ కార్యాలయ భవనం కోసం రెండెకరాల ప్రభుత్వ భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించేందుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామం సర్వే నంబరు 495-5లో 1.85 ఎకరాలు, సర్వే నంబరు 495-11లో 15 సెంట్లు చొప్పున మొత్తం రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని తిరుపతి పార్లమెంటు టీడీపీ కమిటీ అధ్యక్షుడి పేరిట 33 ఏళ్ళ పాటు లీజుపై కేటాయించనున్నారు. ఎకరాకు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున లీజు చెల్లించే ప్రాతిపదికన భూమి కేటాయించనున్నారు.
పెళ్లకూరులో ఎంఎ్‌సఎంఈ పార్కు
నేడు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్న సీఎం
ప్రత్యక్షంగా పాల్గొననున్న మంత్రి నిమ్మల
పెళ్లకూరు, నవంబరు, 9(ఆంధ్రజ్యోతి): పెళ్లకూరు మండలం శిరసనంబేడు, పాలచ్చూరు పరిధిలో రూ.447 కోట్ల పెట్టుబడులతో మూడు పరిశ్రమలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నేరుగా పాల్గొననున్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం 2009లో శిరసనంబేడులో 58.33 ఎకరాలు సేకరించారు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం చెన్నప్పనాయుడుపేట, నందిమాల, ఎర్రగుంట గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూపరిశీలన చేసింది. స్థానిక రైతులు సహకరించకపోవడంతో పూర్తిస్థాయిలో భూసేకరణ జరగలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవాడ అభివృద్ధి మరుగున పడింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రావడంతో శిరసనంబేడులో సేకరించిన 58.33 ఎకరాల్లో మొదటి విడతలో 22.42 ఎకరాలు, రెండో విడతలో 35.91 ఎకరాలు అభివృద్ధి చేయనున్నారు. పాలచ్చూరులో రూ.137 కోట్లతో 3ఎక్స్‌పెర్ ఇనోవెంచర్ పరిశ్రమ ప్రారంభోత్సవంతో పాటు రూ.245 కోట్లు దమ్ము బయోప్యూయల్ పరిశ్రమకు వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.