Share News

Oberoi : తిరుపతిలో ఒబెరాయ్‌ రిసార్ట్‌కు 20 ఎకరాలు

ABN , Publish Date - Oct 11 , 2025 | 01:53 AM

తిరుపతిలో ఒబెరాయ్‌ విల్లాస్‌ రిసార్ట్‌కు 20 ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Oberoi : తిరుపతిలో ఒబెరాయ్‌ రిసార్ట్‌కు 20 ఎకరాలు

తిరుపతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో ఒబెరాయ్‌ విల్లాస్‌ రిసార్ట్‌కు 20 ఎకరాల భూమి కేటాయించేందుకు రాష్ట్ర మంత్రి మండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నాయుడుపేట సెజ్‌లో ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతిపాదించిన పెట్టుబడిని తగ్గించుకునేందుకూ అంగీకరించింది. ఈ మేరకు శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 32వ ఇ-క్యాబినెట్‌ సమావేశంలో జిల్లాకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. తిరుపతిలోని అలిపిరి-చెర్లోపల్లి రోడ్డుకు ఉత్తరంగా ఒబెరాయ్‌ సంస్థకు గత ప్రభుత్వం 20 ఎకరాలను కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ ప్రతినిధులు తమ గ్రూపుల్లో ఒకటైన ముంతాజ్‌ హోటల్స్‌ పేరిట బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో హిందూయేతర సంస్థగా భావించిన పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు దీన్ని వ్యతిరేకించారు. ఒబెరాయ్‌కు భూ కేటాయింపులు రద్దు చేసి.. ఆ భూమిని టీటీడీకి అప్పగించాలని కోరుతూ పాలకమండలి తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపించారు. ఈ క్రమంలో తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు ఆ భూ కేటాయింపులు రద్దు చేసి, ఆ సంస్థకు మరోచోట భూములు కేటాయిస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం సర్వే నంబరు 588-ఏలో 20 ఎకరాలకు ఒబెరాయ్‌కు చెందిన ట్రైడెంట్‌ గ్రూప్‌ పేరిట కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదించింది. నాయుడుపేట సెజ్‌లో రూ. 3,718 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామంటూ మెస్సర్స్‌ ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌ లిమిటెడ్‌ సంస్థ గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనికి 116.62 ఎకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇటీవల ఆ సంస్థ తమ పెట్టుబడిని రూ.2,717 కోట్లకు తగ్గించుకుంటామంటూ ప్రతిపాదనలు పంపగా.. దానికనుగుణంగా ఇతర మినహాయింపులు, రాయితీలలో కూడా సవరణలను మంత్రివర్గం ఆమోదించింది.


మరోవారంలో కొలువుదీరనున్న ముక్కంటి ఆలయ బోర్డు

శ్రీకాళహస్తి, అక్టోంబరు 10(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్టు బోర్డు మారో వారం రోజుల్లో కొలువుదీరనుంది. ఇటీవల ధర్మకర్తల మండలి చైర్మన్‌, సభ్యుల పేర్లను కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారులు శుక్రవారం అధికారిక జీవోను విడుదల చేశారు. దీంతో మండలి నియామకం ఖరారు అయింది. చైర్మన్‌గా కొట్టే సాయిప్రసాద్‌తో పాటు 16మంది సభ్యులు బీల స్రవంతి, చిన్నపూల లక్ష్మీనారాయణ, లక్ష్మమ్మ, జి.గోపీనాథ్‌, కె.కుసుమ కుమారి, కొమ్మబోయిన రజని, నాగరాజు కొప్పెర్ల, పెనగలూరు హేమవతి, విజయమ్మ, రుద్రాక్షల కౌసల్యమ్మ, దండి రాఘవయ్య, పగడాల మురళి, వి.గుర్రప్పశెట్టి, కోల విశాలాక్షి, ప్రకా్‌షరెడ్డి, కాలే సావిత్రి ఉన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 01:53 AM