AP Govt : దావోస్ పర్యటనకు చంద్రబాబు
ABN , Publish Date - Jan 20 , 2025 | 03:33 AM
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు బయలుదేరింది.
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యం
దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు
ప్రపంచ ఆర్థిక సదస్సులో ‘బ్రాండ్ ఏపీ’ నినాదం
బాబు వెంట లోకేశ్, భరత్, ఉన్నతాధికారులు
‘ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి ప్రపంచ పెట్టుబడుల పటంలో నిలిపేందుకు సిద్ధంగా ఉన్నాం. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు 55వ వార్షికోత్సవాన్ని వేదికగా చేసుకుని పెట్టుబడులు రాబడతాం.’’
- చంద్రబాబు
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనకు బయలుదేరింది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ సాగే ఈ పర్యటనలో భాగంగా సీఎం బృందం ఆదివారం ముందుగా ఢిల్లీకి వెళ్లింది. అక్కడినుంచి అర్ధరాత్రి 1.30 గంటలకు జ్యూరిచ్ చేరుకుంటుంది. అక్కడ భారత రాయబారితో పాటు పదిమంది దిగ్గజ పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలతో సమావేశమవుతారు. అలాగే ‘మీట్ అండ్ గ్రీట్ ’ కార్యక్రమంలో భాగంగా తెలుగు సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలను కలుస్తారు. అనంతరం దావోస్ కు వెళ్తారు. రాత్రి పారిశ్రామికవేత్తలతో, ఆర్సెలర్స్‌మిట్టల్ సంస్థ యజమాని లక్ష్మీ మిట్టల్‌తో డిన్నర్‌లో పాల్గొంటారు. రెండోరోజు దావోస్ లో గ్రీన్ హైడ్రోజన్‌పై జరిగే ప్రత్యేక సెషన్‌లో చంద్రబాబు పాల్గొంటారు. కోకాకోలా, ఎల్‌జీ సహా ఇతర దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందంతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు. యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్‌తో భేటీ అవుతారు. ‘ఎనర్జీ ట్రాన్సిషన్’, ‘ది బ్లూ ఎకానమీ’ అంశాలపై జరిగే సెషన్లలో సీఎం ప్రధానోపన్యాసం చేస్తారు. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వూలు ఇస్తారు. దావోస్ సదస్సులో భాగంగా మూడోరోజు పలువురు వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో సమావేశమవుతారు. నాలుగో రోజు జ్యూరిచ్ చేరుకుని అక్కడినుంచి భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు. చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఉన్నతాధికారులు ఉన్నారు.
పారిశ్రామిక అనుకూల విధానాలే ఆకర్షణ
‘బ్రాండ్ ఏపీ’ నినాదంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను దావోస్ సదస్సులో చంద్రబాబు బృందం పెట్టుబడిదారులకు వివరించనుంది. ‘2014 నుంచి 2019 వరకూ జాతీయ స్థాయిలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ అమలులో టాప్‌లో నిలిచిన ఏపీ.. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ విధానానికి మరింత పదును పెట్టి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ పాలసీని అమలు చేస్తోంది. గతంలో పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి ఆహ్వానించి, వారితో సంప్రదింపులు జరుపుతూ 21 రోజుల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సహకారాన్ని ప్రభుత్వం తరఫున అందించేవారు. అయితే ఇప్పుడు పారిశ్రామికవేత్తల వద్దకే మం త్రులు వెళ్లి రాష్ట్రంలోని పెట్టుబడుల సానుకూల ధోరణులను వివరిస్తున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని స్వాగతిస్తున్నారు. దీనికోసం వారికి ఏం కావాలో ఆరా తీస్తున్నారు. పొరుగు రాష్ట్రాలు కూడా పెట్టుబడుల ప్రోత్సాహక విధానాలను అమలు చేస్తూ పోటీ పడుతుండటంతో సంప్రదింపుల ప్రక్రియకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలను లోకేశ్, భరత్ దావో్‌సలో మార్కెటింగ్ చేయనున్నారు.
తొలిరోజు నుంచీ చంద్రబాబు బిజీ
దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు పెట్టుబడులను ఆకర్షించే పనిలో తొలిరోజు నుంచే బిజీబిజీగా గడపనున్నారు. ఆదివారం రాత్రి దావోస్ లోని కాంగ్రెస్ సెంటర్‌లో పెట్టుబడిదారులతో సమావేశమవుతారు. రెండోరోజు ఉదయం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులపై ప్రధానోపన్యాసం చేస్తారు.
డీవీ వరల్డ్ సీఈవో, యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్‌తో భేటీ అవుతారు. ఎల్‌జీ కెమ్ సీఈవో షిన్ హాక్ చియోల్, కేరిస్ బర్గ్ సీఈవో జాకబ్ అరూప్ అండర్సన్, ఏపీ మొల్లర్ మీర్స్క్ సీఈవో విన్సెంట్ క్లెర్క్‌తో సీఎం సమావేశమవుతారు. ఆ తర్వాత ‘బిజినెస్ టుడే’ న్యూస్ డైరెక్టర్ రాహుల్ కన్వల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తారు. టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో ప్రత్యేక సమావేశం ఉంటుంది. గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖీల్ గోజ్‌మేన్, సిస్కో చైర్మన్ అండ్ సీఈవో చుక్ రాబిన్స్, వాల్‌మార్ట్ సీఈవో కాత్ మెక్లేతో భేటీ అవుతారు. మధ్యాహ్నం సీఎన్‌బీసీ టీవీ18తో మోడరేటర్ షెరీన్‌భాన్‌తో నిర్వహించే ‘బిల్లింగ్ నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్’ డిబేట్‌లో పాల్గొంటారు. సీఎన్‌బీసీకి, బ్లూమ్‌బెర్గ్ సీనియర్ ఎడిటర్ మేనకా దోషికి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తారు. ఎనర్జీ ట్రాన్స్‌మిషన్- పబ్లిక్ పాలసీ సెమినార్‌లోనూ, సీఎన్‌బీసీ టీవీ-18 నిర్వహించే ‘పయనీరింగ్ ద బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో’ సెమినార్‌లోనూ పాల్గొంటారు. 22న యూనిలీవర్ సీఈవో హెన్‌స్కూమాచర్‌తో, పెట్రోమాస్ సీఈవో మహమ్మద్ తాఫిక్‌తో, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌తో సమావేశమవుతారు. మేఘా ఇంజనీరింగ్‌తో ఒప్పంద కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటర్నేషనల్ బేవరేజెస్, పెప్సికో చీఫ్ కార్పొరేట్ ఆఫీసర్ ఏజెన్ విల్మ్‌సెన్‌తోనూ, పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీవెన్ కెహోతో భేటీ అవుతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు రాబొర్టో బోక్సతో సమావేశం తర్వాత మధ్యాహ్నం బీఎంజీఎఫ్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో చంద్రబాబు సమావేశమవుతారు. రాయిటర్స్ అసియా ఎడిటర్ ఉమాగలానీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తారు.