Share News

CM Chandrababu : ‘స్వర్ణాంధ్ర’ సాధనలో భాగస్వాములు కండి!

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:03 AM

స్వర్ణాంధ్ర విజన్‌-2047లో ఆర్యవైశ్యులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆర్యవైశ్యులను వృద్ధి చేయాలన్న ఉద్దేశంతో...

CM Chandrababu  : ‘స్వర్ణాంధ్ర’ సాధనలో భాగస్వాములు కండి!

  • ఆర్యవైశ్యులకు చంద్రబాబు పిలుపు

  • త్యాగం, శక్తికి ప్రతీక వాసవీ మాత: సీఎం

  • పెనుగొండలోని వాసవీ ధామ్‌ సందర్శన

  • అమ్మవారికి తొలిసారి పట్టువస్ర్తాల సమర్పణ

  • కన్యకా పరమేశ్వరికి ప్రత్యేక పూజలు

  • కల్లుగీత కార్మికులతో మాట్లాడిన చంద్రబాబు

  • కార్పొరేషన్‌ ద్వారా వ్యాపారాభివృద్ధికి తోడ్పాటు

  • రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకొస్తామని హామీ

పెనుగొండ/ఆచంట/భీమవరం, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అభివృద్ధి కోసం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్‌-2047లో ఆర్యవైశ్యులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆర్యవైశ్యులను వృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటైందన్నారు. దాని ద్వారా వారి వ్యాపారాభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. వాసవీ మాత ఆత్మార్పణదినం సందర్భంగా శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో నగరేశ్వరస్వామి ఆలయంలో కొలువుదీరిన వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. వేద పండితులు శాస్ర్తోక్తంగా ముఖ్యమంత్రితో అమ్మవారికి పూజలు చేయించి ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆయన సమీపంలోని వాసవీధామ్‌ను సందర్శించారు. ఈ ఆలయాన్ని దర్శించడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు. దేశవ్యాప్తంగా అమ్మవారికి ఆర్యవైశ్యులు ఆలయాలు నిర్మించారని, ఇక్కడి వాసవీ మాత ఆలయానికి భవిష్యత్తులో మరింత పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. 90 అడుగుల పంచలోహ వాసవీ మాత విగ్రహానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా వాసవీధామ్‌ ట్రస్ట్‌ సభ్యులు చంద్రబాబును సత్కరించారు. తర్వాత సీఎం భక్తులనుద్దేశించి మాట్లాడారు. ‘‘మహిళల ఆత్మగౌరవాన్ని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు చాటారు. శాంతి కోసం వాసవీ మాత ఆత్మ బలిదానం చేశారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు, అహింసకు, ఆత్మ త్యాగానికి, ధర్మనిరతికి, శాంతికి ప్రతిరూపం వాసవీ కన్యకాపరమేశ్వరి. అమ్మను వేడుకుంటే శాంతి, సంపద, రక్షణ. ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం. దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు కొలిచే దేవత వాసవీ కన్యకా పరమేశ్వరి. త్యాగానికి, శక్తికి, సంకల్పానికి ప్రతీకైన అమ్మవారికి ప్రభుత్వం తరఫున తొలిసారిగా పట్టువస్ర్తాలను సమర్పించడం పూర్వ జన్మ సుకృతం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. వాసవీ మాత ఆలయం, వాసవీధామ్‌లో చంద్రబాబు సుమారు రెండు గంటలు గడిపారు.


నేడు అన్నమయ్య జిల్లాకు సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అన్నమయ్య జిల్లా సంబేపల్లెలో పర్యటించనున్నారు. గన్నవరం నుంచి విమానంలో బయలుదేరి కడప విమానాశ్రయానికి మధ్యాహ్నం 12.05 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.20 గంటలకు సంబేపల్లెకి వస్తారు. ఒంటిగంటకు సంబేపల్లెలో ఎన్టీఆర్‌ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. 1.50 గంటలకు పింఛన్‌ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి పింఛన్‌ అందజేస్తారు. అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు.

బీసీలకు అన్ని విధాల అండగా ఉంటాం

బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దానికి కొనసాగింపుగానే తెలుగుదేశం పార్టీ చట్ట సభల్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా బీసీలకు అవకాశాలు కల్పించిదన్నారు. పెనుగొండ హెలిప్యాడ్‌ వద్ద శెట్టిబలిజ, గౌడ, యాదవ, శ్రీశయన తదితర గీత కార్మిక సంఘాల సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. ‘‘బీసీలంటే తెలుగుదేశం.. తెలుగుదేశం అంటే బీసీలు. వారిని రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చింది టీడీపీ. వారికి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కూడా రిజర్వేషన్‌లు కల్పించాలని పోరాడుతున్నది టీడీపీయే. గడిచిన ఎన్నికల్లో 141 బీసీ కులాలు ఏకమై టీడీపీకి అండగా నిలబడ్డాయి. అన్ని స్థాయిల్లోనూ బీసీలకు టీడీపీ న్యాయం చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 10 శాతం మద్యం షాపులను కల్లుగీత కార్మికులకు కేటాయించాం. అందులో 50 శాతం డిపాజిట్‌తోనే షాపులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. యాంత్రీకరణతో కుల వృత్తులు పోయాయి.


చేతి వృత్తులకు కష్టకాలం వచ్చింది. కల్లుగీతకు కష్టం వచ్చింది. అందుకే బీసీ వర్గాల్లో కుల వృత్తులందరికీ, వెనుకబడిన వర్గాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఎన్డీఏ, టీడీపీ కట్టుబడి ఉన్నాయి. నేను.. పవన్‌ కల్యాణ్‌.. బీజేపీ కూడా బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం. ఈ విషయాన్ని పది మందికీ చెప్పండి. పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం బలంగా ఉంటుంది. గత ఐదేళ్లు రాష్ట్రం అధోగతి పాలైంది. పార్టీ శ్రేణులు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. అటువంటి చీకటి రోజులు మళ్లీ రాకూడదు. భవిష్యత్తుపై భరోసా ఇవ్వడానికి 2047 విజన్‌ తీసుకొచ్చాం. అప్పటికి రాష్ర్టాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతాం. గీత కార్మికులను అభివృద్ధి చేస్తాం’’ అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పెనుగొండకు విచ్చేసిన చంద్రబాబుకు మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులపర్తి అంజిబాబు, బొలిశెట్టి శ్రీనివాస్‌, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు తదితరులు స్వాగతం పలికారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 03:03 AM