Share News

CM Chandrababu : వైసీపీ పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయి

ABN , Publish Date - Feb 12 , 2025 | 06:09 AM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడిపోయిందని, దాంతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చందబ్రాబునాయుడు తెలిపారు.

CM Chandrababu : వైసీపీ పాలనలో పరిశ్రమలు మూతపడ్డాయి

  • కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు వస్తున్నాయి

  • కుటుంబానికి ఓ పారిశ్రామిక వేత్త లక్ష్యాన్ని సాధించాలి

  • మంత్రులు, కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడిపోయిందని, దాంతో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చందబ్రాబునాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు పరిశ్రమలకు అధిక ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘2022-23లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాగా.. ఏపీలో మాత్రం ఉన్న పరిశ్రమలు మూతపడ్డాయి. కనీసం ఎంఎ్‌సఎంఈలను కూడా ఏర్పాటు చేయలేకపోయారు. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థికంగానూ రాష్ట్రం బలపడుతుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానాలతో అన్ని రంగాలు ప్రగతి పథంలో అడుగులు వేస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ద్వారా విశాఖపట్నం, రాజమండ్రి, అనంతపురం, తిరుపతి నగరాలను తీర్చిదిద్దుతున్నాం. లాజిస్టిక్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రాష్ట్రంలో సీ పోర్టులు, ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తాం. దేశంలోనే బెస్ట్‌ లాజిస్టిక్‌ హబ్‌గా ఏపీ అభివృద్ధి చెందబోతోంది. రాష్ట్రంలో పారిశ్రామిక పార్కులు మరిన్ని ఏర్పాటు చేయాలి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌తో పాటు ఎస్ర్కో ఖాతాను వెంటనే పెట్టుకోవాలి. ‘ఒక కుటుంబం - ఒక పారిశ్రామిక వేత్త’ లక్ష్యాన్ని కచ్చితంగా సాధించి తీరాలి. లక్ష్యాలను సాధించడంలో అలక్ష్యం వద్దు. అధికారుల్లో ఇన్నోవేషన్‌ కల్చర్‌ పెరగాలి. సిలికాన్‌ వ్యాలీలా ఆంధ్రా వ్యాలీ తయారు కావాలి’’ అని చంద్రబాబు అన్నారు.


175 పారిశ్రామిక పార్కులు

రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ తెలిపారు. ఏపీఐఐసీ ద్వారా రూ. 2,500 కోట్లతో ప్లగ్‌ అండ్‌ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పీఎం కిసాన్‌ యోజన ద్వారా కేంద్రం నుంచి రూ. 2 వేల కోట్ల నిధులు తీసుకువస్తామన్నారు. రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనేది లక్ష్యమని చెప్పారు. రామాయపట్నం పోర్టులో 52.91 శాతం, మచిలీపట్నం పోర్టులో 31 శాతం, మూలపేట పోర్టులో 32 శాతం, కాకినాడ గేట్‌ వే పోర్టులో 24 శాతం పనులు పూర్తయినట్లు యువరాజ్‌ వివరించారు. ఫిషింగ్‌ హార్బర్‌లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి చేస్తామని, 300 ఎకరాల్లో డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. సాగర మాల కార్యక్రమంలో భాగంగా నదుల అనుసంధానికి రూ. 866 కోట్లను కేంద్ర బడ్జెట్‌లో కేటాయించినట్లు చెప్పారు.

Updated Date - Feb 12 , 2025 | 06:09 AM