Chandrababu Amaravati House: రాజధానిలో సొంత ఇంటికి శ్రీకారం
ABN , Publish Date - Apr 10 , 2025 | 04:23 AM
అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమిపూజ నిర్వహించారు. కుటుంబసభ్యులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు

శంకుస్థాపన చేసిన చంద్రబాబు దంపతులు
కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్ దంపతులు
వారికి పట్టువస్త్రాలు అందించిన రాజధాని రైతులు
అమరావతి, గుంటూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో సొంత ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. బుధవారం ఉదయం 8.51 గంటలకు సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేశ్ దంపతులు, మనవడు దేవాన్ష్‌తో కలిసి చంద్రబాబు భూమి పూజ నిర్వహించి, ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెలగపూడి సచివాలయం వెనుక ఈ9 రహదారి చెంతనే సుమారు 5 ఎకరాల స్థలంలో సీఎం సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. వేదపండితుల ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని కొద్దిమంది కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. భూమిపూజ సందర్భంగా చంద్రబాబుకు భూమిని విక్రయించిన వెలగపూడి మాజీ సర్పంచ్ కంచర్ల శాంతకుమారి, ఆమె కుమార్తె గీత కలిసి లోకేశ్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాజధాని రైతులు పాల్గొని చంద్రబాబు, లోకేశ్ దంపతులకు ఘనస్వాగతం పలికారు. మంగళవారం రాత్రే భూమి పూజ జరిగే ప్రదేశాన్ని రాజధాని మహిళా రైతులు రంగవల్లులతో తీర్చిదిద్దారు.
శంఖుచక్రాలు తిరునామాలతో వేసిన ముగ్గు చంద్రబాబు దంపతులను విశేషంగా ఆకట్టుకుంది. శంకుస్థాపన అనంతరం రాజధాని రైతులను చంద్రబాబు, లోకేశ్ ఆప్యాయంగా పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిలో ఇల్లు కట్టుకుని తమలో ఒకడు కాబోతుండడం తమకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రాజధాని రైతులు, ప్రధానంగా మహిళలు హర్షం వ్యక్తంచేశారు.
Read Latest AP News And Telugu News