Share News

CM Chandrababu: మీలో వేగమేదీ?!

ABN , Publish Date - Jan 18 , 2025 | 03:47 AM

పాతవారిని పక్కన పెట్టి యువతరం అని కొత్తవారికి మంత్రి పదవుల్లో అవకాశం ఇస్తే వారిలో ఆ వేగం కనిపించడం లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

CM Chandrababu:  మీలో వేగమేదీ?!

  • యువ మంత్రుల పనితీరుపై బాబు అసంతృప్తి

  • ప్రజల్లోకి మరింతగా వెళ్లి పనిచేయాలని ఆదేశం

  • మంత్రులు, ఎంపీలు, జోనల్‌ ఇన్‌చార్జులతో సమీక్ష

  • కొందరు పార్లమెంటు సభ్యుల గైర్హాజరుపై ఆగ్రహం

  • ప్రజాదరణ ఇప్పటికంటే 5 శాతం పెంచేలా లక్ష్యం

అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): పాతవారిని పక్కన పెట్టి యువతరం అని కొత్తవారికి మంత్రి పదవుల్లో అవకాశం ఇస్తే వారిలో ఆ వేగం కనిపించడం లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలు, పార్టీ జోనల్‌ ఇన్‌చార్జులతో సుమారు 3గంటలపాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రుల పనితీరుపై సీఎం నిశితంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. ‘‘నా మంత్రివర్గంలో 24మంది మంత్రులు ఉంటే ఆరుగురు గతంలో మంత్రులుగా చేసినవారు ఉన్నారు. 18మందికి మొదటిసారి అవకాశం వచ్చింది. కొత్తవారికి అవకాశం ఇస్తే ఉత్సాహంగా పరిగెత్తుతారని భావించి.. ఇంతమందికి అవకాశం ఇచ్చాను. కానీ, కొంతమందిలో ఆ వేగం కనిపించడం లేదు. అవకాశం రానివారు.. రావడం లేదని బాధపడుతుంటే, వచ్చినవారు ఆ వేగం ఎందుకు చూపించలేకపోతున్నారు? ప్రజల్లోకి దూసుకు వెళ్లడానికి మీకువచ్చిన అడ్డం ఏమిటి? మీ పనితీరు మెరుగు పర్చుకోకపోతే నష్టపోతారు. మంత్రులుగా శాఖపై పట్టుసాధించాలి. అధికారులతో పని చేయించుకోవాలి. మీ జిల్లాలో పార్టీకి నాయకత్వం ఇవ్వాలి. ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్న మంచిని బలంగా తీసుకువెళ్లాలి. నేను గమనిస్తున్నానని గుర్తించండి. వచ్చేసారి సమీక్ష నాటికి మీ పనితీరులో మార్పు కనిపించాలి’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.


అసాధ్యాలు సైతం సాధించాం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల స్వల్ప వ్యవధిలోనే అసాధ్యం అనుకొన్న పనులు అనేకం చేశామని చంద్రబాబు తెలిపారు. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మంత్రులు అలసత్వంతో వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఆగిపోయిన అమరావతిని పట్టాలెక్కించాం. పోలవరం విధ్వంసం చేశారు. అది కూడా పూర్తి కాగలదన్న నమ్మకం కలిగించాం. విశాఖ ఉక్కుకు కేంద్రం సాయం సాధించాం. వచ్చిన మొదటి నెలలోనే పేదల పింఛన్లు పెంచాం. ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లో డబ్బులు జమ చేస్తున్నాం. 7 నెలల్లో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. మీలో ఎంత మంది ఈ విషయాలు ప్రజల్లోకి వెళ్లి మాట్లాడుతున్నారు? ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అవగాహన కలిగిస్తున్నారు? మనం చేసిన పనులు చెప్పలేకపోతే ప్రత్యర్ధుల దుష్ప్రచారం ప్రజల మనసుల్లోకి వెళ్తుంది’’ అని చంద్రబాబు అన్నారు.

ప్రజల సంతృప్తి ఇలా..

కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల సంతృప్తిలో ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు చెప్పారు. కృష్ణా, చిత్తూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు మొదటి మూడు స్థానాల్లోనూ, కడప, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి చివరి మూడుస్థానాల్లో ఉన్నాయని తెలిపారు. సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవడంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆయన మార్కులిచ్చారు. మంత్రుల్లో ఫరూక్‌ చివరిస్థానంలో ఉన్నారు. ‘‘సామాజిక మాధ్యమాల వినియోగం పెంచుకోవాలి. మీకు ప్రత్యేకంగా ఉద్యోగులను, పీఆర్వోలను ఇచ్చాను. అయినా కొంతమంది ఇంకా వెనకబడే ఉన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఐటీ రంగంలో పనిచేసి వచ్చారు. ఆయన ర్యాంక్‌ కూడా సంతృప్తికరంగా లేదు. ఈసారి నాకు మీ నుంచి మంచి ఫలితాలు కనిపించాలి’’ అని చంద్రబాబు అన్నారు.


ఇన్‌చార్జి మంత్రులకు మరిన్ని బాధ్యతలు

జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం తెలిపారు. ‘‘మీ జిల్లాల్లో పార్టీ, యంత్రాంగాన్ని సమన్వయం చేసే బాధ్యత మీదే. ఊరికే డీడీఆర్సీ సమావేశాలకు హాజరై తిరిగి రావడం కాకుండా జిల్లాల్లో రాజకీయ పరిస్ధితిపై పట్టుపెంచుకోండి. అవసరమైతే మండలస్థాయి వరకు వెళ్లండి. కొత్త ఎమ్మెల్యేలు చాలా తప్పులు చేస్తున్నారు. వారికి ఏది తప్పో చెప్పండి. మీకు మొహమాటం ఉంటే నాకు చెప్పండి. నేను ఏ సమయంలో ఫోన్‌ చేసినా.. బాధ్యత అప్పగించినా నాకు వెంటనే ఫలితం కనిపించాలి. జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రి, జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీ, కలెక్టర్‌ ఒక బృందంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలి’’ అని సూచించారు. రేషన్‌ షాపుల విషయం కోర్టుకు వెళ్లిందని, ఈలోపు ఇన్‌చార్జులను నియమిస్తామని తెలిపారు. ఇకనుంచి పార్టీకి ఎక్కువ సమయం ఇస్తానని, ఈ విషయంలో తేడాను త్వరలోనే చూస్తారని చంద్రబాబు చెప్పారు.

నేను కఠినంగా ఉండేదాకా..!

సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఇద్దరు కేంద్ర మంత్రులు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు గంటి హరీశ్‌, అంబికా లక్ష్మీనారాయణ తదితరులు గైర్హాజరయ్యారు. ఈ విషయంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కమిటీ మీటింగులు, ఇతర పనులు పార్టీ పని కంటే మీకు ఎక్కువా? నేను మొదటిసారి ఈ సమావేశం పెట్టాను. ఏ సమావేశం ప్రాధాన్యం ఏమిటో కూడా అర్ధం కావడం లేదా? కొందరు ఎంపీలు పార్టీ పనిని పూర్తిగా వదిలేసి తిరుగుతున్నారు. అలాంటి వారిని ఊరుకొనేది లేదు. నేను కఠినంగా ఉండేంత వరకు తెచ్చుకోకండి’’ అని చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించినట్లు తెలిసింది.

Updated Date - Jan 18 , 2025 | 03:48 AM