CM Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం
ABN , Publish Date - Jul 17 , 2025 | 03:13 AM
తెలుగు రాష్ట్రాలే తనకు ముఖ్యమని.. రెండు రాష్ట్రాలూ బాగుండాలని కోరుకునేవారిలో తాను ముందుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం బాగుండాలని..
ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కాను: చంద్రబాబు
గోదావరిలో మా వాటా కిందే బనకచర్ల ప్రాజెక్టు
50 ఏళ్ల గోదావరి వరద లెక్కలను పరిగణనలోకి తీసుకుని.. ఎగువ రాష్ట్రాలన్నీ వాడుకున్నాక మిగిలిన జలాలు సముద్రంలోకి వృథాగా పోకుండా రాష్ట్రావసరాల కోసం వినియోగించుకోవడం పోలవరం-బనకచర్ల పథకం ఉద్దేశం. గోదావరి జలాల్లో మా రాష్ట్ర వాటా మేరకే దీనిని చేపడుతున్నాం.
తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణానికి నేనెప్పుడూ అడ్డుచెప్పను. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా.. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలు కలిసే ఉంటారు.
- సీఎం చంద్రబాబు
సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం
నిపుణుల కమిటీ ముందు అన్నిటిపైనా చర్చిద్దాం
అయినా తెగకపోతే అపెక్స్ కౌన్సిల్‌లో చర్చిద్దాం
వృథా పోయే వరద నీరే బనకచర్లకు వాడుకుంటాం
అది కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకున్నాకే
తెలంగాణ పథకాలకు ఎప్పుడూ అడ్డుచెప్పను
వాటి కోసం కర్ణాటక, మహారాష్ట్రలతో పోరాడా
బాబ్లీ పోరులో రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు
ఢిల్లీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు
అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలే తనకు ముఖ్యమని.. రెండు రాష్ట్రాలూ బాగుండాలని కోరుకునేవారిలో తాను ముందుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం బాగుండాలని.. మరో రాష్ట్రం వెనుకబడిపోవాలని భావించే వ్యక్తిని కానని తేల్చిచెప్పారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ వద్ద జరిగిన సమావేశంలో చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వాల్లో రెండు రాష్ట్రాల మంత్రులు, అధికారుల బృందాలు పాల్గొన్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణ నిర్మించుకునే ప్రాజెక్టులకు తాను ఎప్పటికీ అడ్డుచెప్పబోనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాడానని.. అరెస్టు కూడా అయ్యానని గుర్తుచేశారు. బాబ్లీ ప్రాజెక్టు ఆందోళనలో రేవంత్‌రెడ్డి కూడా ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టుల విషయంలో సామరస్యంగా చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకుందామన్నారు. కేంద్రం ఆధ్వర్యంలోని సాంకేతిక, నిపుణుల కమిటీలో చర్చించాక కూడా సమస్యలు తేలకపోతే.. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చిద్దామని సూచించారు. పోలవరం-బనకచర్ల పథకం గురించి చర్చ తీసుకురావడంపై టీ-మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు, కేటాయింపుల మేరకే.. సముద్రంలో వృధాగా పోయే వరద జలాలను మాత్రమే వాడుకునేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమ కోసం నిర్మిస్తున్నదని.. ఈ ప్రాజెక్టుపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమేనని, తనకు భేషజాలు లేవని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ లేదన్నారు. పథకంపై ఉన్న సందేహాలు నివృత్తి చేస్తూ రూపొందించిన సమాచారం ప్రతులను రేవంత్‌రెడ్డికి, ఉత్తమకుమార్‌రెడ్డికి పంపారు.