MP CM Ramesh : వైసీపీ హయాంలో 30 వేల కోట్ల లిక్కర్ స్కాం
ABN , Publish Date - Feb 12 , 2025 | 06:02 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో రూ.30 వేల కోట్ల లిక్కర్ స్కాం జరిగింది.

ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా 10 రెట్లు పెద్దది: ఎంపీ సీఎం రమేశ్
న్యూడిల్లీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో రూ.30 వేల కోట్ల లిక్కర్ స్కాం జరిగింది. ఢిల్లీ మద్యం కుంభకోణం రూ.2,500 కోట్లు కంటే పది రెట్లు పెద్ద స్కాం అది’ అని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు. మంగళవారం లోక్‌సభలో జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. ‘2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యం పాలసీని మార్చింది. మద్యం దుకాణాలను ప్రైవేటు నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చింది. రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడింది. మద్యం దుకాణాల్లో ఐదేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి. లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరిగాయి. ఒక్క పేమెంట్ కూడా డిజిటల్ రూపంలో తీసుకోలేదు. మద్యం దుకాణాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించారు’ అని రమేశ్ ఆరోపించారు. ఈక్రమంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘సీఎం రమేశ్ బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తున్నారు. మార్గదర్శి స్కాంపై మాట్లాడినందుకు ప్రతీకారంగా మాపై ఆరోపణలు చేస్తున్నారు’ అని అన్నారు.