CM Chandrababu : విజన్ 2047లో భాగస్వాములవ్వండి
ABN , Publish Date - Feb 11 , 2025 | 03:54 AM
15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరం.
అగ్రి, అనుబంధ రంగాల్లో వృద్ధికి అవకాశం ఎక్కువ.. 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యం
బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరం.. రైతులకు నిమిషాల్లో రుణమిచ్చే పరిస్థితి ఉండాలి
ఉద్యాన, వాణిజ్య, ప్రకృతి సాగుకు మద్దతుగా నిలవాలి.. డెయిరీని ప్రోత్సహించాలి
‘సూర్యఘర్’లో ఏటా 20లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్
రైతు ఆత్మహత్యల నివారణకు మేధో మథనం.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల భేటీలో సీఎం
అమరావతి, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలి. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నాం. 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నాం. వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరం. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి సాధించే అవకాశం ఉంది. దీనికి బ్యాంకర్ల నుంచి తగిన మద్దతు కావాలి’ అని సీఎం చంద్రబాబు కోరారు. సోమవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ‘ప్రజల ఆహారపుటలవాట్లు మారుతున్నాయి. దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతోంది. వ్యవసాయ పంటల స్థానంలో ఉద్యాన పంటల సాగు వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఉద్యాన రైతులకు బ్యాంకర్లు విరివిగా రుణాలివ్వాలి. ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకు బ్యాంకులు సాయపడాలి. అన్ని అర్హతలున్న రైతులు రుణం కోసం బ్యాంకుకు వచ్చిన 15నిమిషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి ఉండాలి. డెయిరీ రంగాన్ని ప్రోత్సహించడం తమ ప్రభుత్వ విధానం. కొన్ని సందర్భాల్లో సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర రాక పంట ఉత్పత్తిని పారబోసే పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని నివారించేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నాం. ‘ప్రోడక్ట్ ఫర్‌ఫెక్షన్’ పైనా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పంటలు, ఉత్పత్తులకు విలువ పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నాం.
పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విపరీతంగా పురుగు మందుల వాడకం వల్ల క్యాన్సర్ బాధితులు పెరిగి, వైద్యం కోసం ఢిల్లీ బాట పడుతున్నారు. ఇలాంటి సమస్యలకుప్రకృతి సేద్యం గేమ్ ఛేంజర్ అవుతుంది. ఉద్యాన పంటల సాగుతో పాటు ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకర్లు మద్దతుగా నిలవాలి’ అని కోరారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అన్ని విభాగాలు, రంగాలూ దెబ్బతిన్నాయని, వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలో బ్యాంకులు దర్యాప్తు సంస్థలకు సమాచారమిచ్చి, సహకరించాలని సీఎం కోరారు. సాగు రంగంలో డ్రోన్ టెక్నాలజీకి సహకరించాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర పునర్నిర్మాణానికి, హెల్త్, వెల్త్, హ్యాపీ ఏపీకి సహకరించాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు సహకరించాలని ఎంఎ్‌సఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. సమావేశంలో సీఎస్ విజయానంద్, జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్‌కుమార్‌బాబు, యూబీఐ సీఈవో మణిమేఖలాయ్, ఆర్బీఐ ఆర్డీ బషీర్, వివిధ బ్యాంకుల అధికారులు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
99% రుణాల పంపిణీ: బ్యాంకర్లు
రాష్ట్రంలో 2024-25లో బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం గత డిసెంబరు నాటికి రూ.5.40లక్షల కోట్ల రుణ పంపిణీ లక్ష్యంలో రూ.5.34లక్షల కోట్లు (99%) సాధించినట్లు బ్యాంకర్లు తెలిపారు. వ్యవసాయ రుణాల పంపిణీ లక్ష్యం రూ.2.64లక్షల కోట్లలో రూ.2,37లక్షల కోట్లు, ప్రాధాన్య రంగాలకు రూ.3.37లక్షల కోట్లలోరూ.3.26లక్షల కోట్లు, ఎంఎ్‌సఎంఈ రంగం లో రూ.87వేల కోట్లలో రూ.79వేల కోట్లు, ప్రాధాన్యేతర రంగంలో రూ.1.65లక్షల కోట్లలో రూ.2.08లక్షల కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 2024 ఖరీ్‌ఫలోపంట రుణాలు రూ.97,940కోట్లు, అనుబంధ రంగాల కింద రూ.55,860కోట్లు కలిపి, మొత్తం రుణ లక్ష్యం రూ.1,53,800కోట్లు కాగా, రూ.1,69,797కోట్లు (110%) బ్యాంకులుపంపిణీ చేశాయి. 2024-25రబీలో పంట రుణాలు రూ.68,060 కోట్లు, అనుబంధ రంగాలకు రూ.42,140 కోట్లు కలిపి, మొత్తం రూ.1,10,200 కోట్ల రుణ లక్ష్యంలో గత డిసెంబరు నాటికి రూ.67,472 కోట్లు(61%) రైతులకు పంపిణీ చేశాయి. 2024-25లో 10లక్షల పంట సాగుదారు హక్కు పత్రాలు కౌలు రైతులకు పంపిణీ చేయగా, ఈ ఏడాది రూ.4వేల కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈలక్ష్యంలో రూ.3,826.41 కోట్లు(96%) బ్యాంకులుపంపిణీ చేశాయి. కాగా, 2024-25 బడ్జెట్‌లో వడ్డీలేని, పావలా వడ్డీ రుణాలు రూ.628కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదు
రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మాటే వినిపించకూడదని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం కంటే ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం, బ్యాంకర్లు ఏం చేయాలనే దానిపై ప్రత్యేకంగా మేధోమథనం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కేంద్రం ఎంఎ్‌సఎంఈలకు రుణాలను సరళతరం చేసిందని, బ్యాంకులు ఈ విషయంలో మరింత చొరవ చూపాలని ఆయన కోరారు. ఎంఎ్‌సఎంఈలకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని, ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని, ఇది సాకారం కావాలంటూ, చిరు వ్యాపారులకు రుణాలు సులభతరం చేయాలని సూచించారు. ‘పీఎం సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2కిలో వాట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తాం. ఈ పథకం ద్వారా ఉచితంగా తమ అవసరాలకు విద్యుత్‌ను పొందటమే కాకుండా, మిగులు విద్యుత్‌తో ప్రజలుఆదాయం పొందే అవకాశ ముంది. ఇందులో బ్యాంకులు భాగస్వామ్యంకావాలి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు రానున్నాయని, రుణాలిచ్చి, సహకరించాలి అని కోరారు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?