Aqua Advisory Committee: ఆక్వా పై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Apr 10 , 2025 | 03:20 AM
అమెరికా సుంకాల ప్రభావం దృష్టిలో ఉంచుకుని, ఆక్వా రంగ సమస్యలపై ప్రభుత్వంపై కమిటీ ఏర్పాటు చేసింది.ఈ కమిటీ తక్షణ, మధ్య మరియు దీర్ఘకాలిక పరిష్కారాలపై నివేదికలు సమర్పించనుంది.

సుంకాలు, సవాళ్లకు పరిష్కారమే లక్ష్యం
కమిటీ సభ్యులు, విధి విధానాలు ఖరారు
సూచనలు ఇచ్చేందుకు నిర్దిష్ట కాల పరిమితి
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): అమెరికా విధించిన సుంకాలతో సహా.. రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలు సూచించడానికి ఆక్వా వాటాదారులు, అధికారులతో కూడిన ‘ఆక్వా కల్చర్ సలహా కమిటీ’ని ప్రభుత్వం నియమించింది. అమెరికా సుంకాలతో ఉత్పన్నమయ్యే సమస్యలు, వాటిపై తీసుకోవల్సిన చర్యలపై ఈ నెల 7న సీఎం చంద్రబాబు సమక్షంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆక్వా రంగంలో తలెత్తిన సవాళ్లను అధ్యయనం చేసి, పరిష్కారాలు కనుగొనడానికి ఆక్వా భాగస్వాములతో కమిటీని మత్స్యశాఖ ప్రతిపాదించింది. ఈమేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కమిటీ కాలపరిమితి: కేంద్ర ప్రభుత్వం, ఎంపెడా, అధికారులు, ఆక్వా భాగస్వా ములతో సమావేశాలు నిర్వహించి అమెరికా సుంకాల ప్రభావం, స్వల్పకాలిక పరిష్కారాలపై ప్రాథమిక నివేదికను ఐదు రోజుల్లో ఇవ్వాలి. మధ్యస్థ, దీర్ఘకాలికంగా తీసుకోవల్సిన చర్యలపై 3వారాల్లోపు వివరణాత్మక నివేదిక సమర్పించాలి.
కమిటీ నిబంధనలు: రొయ్యల ఎగుమతికి ప్రత్యామ్నాయ మార్కెట్లను గుర్తించడం. దేశీయంగా సముద్ర ఆహార వినియోగాన్ని పెంచడం. నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు. రక్షక దళాల మెనూలో రొయ్యలను ప్రవేశపెట్టడం, ఫీడ్ డైనమిక్ ధరల అమలు... తదితర సమస్యలకు ఈ కమిటీ పరిష్కారాలు కనుక్కుంటుంది.
సలహా కమిటీ సభ్యులు:
ఆక్వా ఎగుమతిదారులు: ఆనంద్ (పశ్చిమగోదావరి), ఆనందకుమార్(కృష్ణా), వెంకట్, దిలీప్ (విశాఖపట్నం)
ఆక్వా రైతులు: రఘు (కాకినాడ), కుమార్‌రాజు(కృష్ణా), శ్రీకాంత్(నెల్లూరు), రామరాజు, సుబ్బరాజు (పశ్చిమ గోదావరి),
దాణా కంపెనీలు: సుబ్రహ్మణ్యం(కృష్ణా)
హేచరీస్ నిర్వాహకులు: కుమార్ (అనకాపల్లి), ఎస్‌ఎన్ రెడ్డి(కాకినాడ)
ప్రభుత్వ ప్రతినిధులు: ఫుడ్ ప్రోసెసింగ్ సొసైటీ సీఈవో శేఖర్‌బాబు, మత్స్యశాఖ ఏడీ అంజలి, ఎంపెడా జేడీ విజయ్‌కుమార్, ఎక్స్‌పోర్ట్ ఇన్పెక్షన్ ఏజెన్సీ డీడీ అవినాష్ వాధవ
Read Latest AP News And Telugu News