Share News

APSRTC : సంక్రాంతికి పోదాం.. చలో చలో!

ABN , Publish Date - Jan 08 , 2025 | 03:11 AM

సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 7,200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎ్‌సఆర్టీసీ తెలిపింది.

APSRTC : సంక్రాంతికి పోదాం.. చలో చలో!

  • 7,200 ఏపీఎ్‌సఆర్టీసీ ప్రత్యేక బస్సులు

  • నేటి నుంచి పండగకు వచ్చి వెళ్లేలా ఏర్పాటు

  • ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవు

  • ఆర్టీసీ ఎండీ తిరుమలరావు స్పష్టీకరణ

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 7,200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎ్‌సఆర్టీసీ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై నుంచి అదనపు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకూ పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేందుకు.. అదేవిధంగా తిరిగి 16 నుంచి 20వ తేదీ వరకు తిరుగు ప్రయాణానికి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని, పండగకు వచ్చే ప్రయాణికులు ఓకేసారి తిరుగు ప్రయాణ టికెట్‌ కూడా రిజర్వేషన్‌ చేసుకుంటే.. చార్జీలో 10 శాతం రాయితీ ఉంటుందన్నారు. బుధవారం నుంచి ఈ నెల 13 వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ 3,900 బస్సులు నడుపుతోంది. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు 2,153 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా బెంగళూరు నుంచి 375, విజయవాడ నుంచి 300, విశాఖపట్నం 250, రాజమహేంద్రవరం 230, తిరుపతి 50, చెన్నై నుంచి 42 అదనపు బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎ్‌సఆర్టీసీ వివరించింది. సంక్రాంతి తర్వాత తిరుగు ప్రయాణానికి జనవరి 16 నుంచి 20 వరకు 3,300 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలోనే పెద్ద పండగ అయిన సంక్రాంతికి నగరాలు, పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు లక్షలాది మంది సిద్ధమవుతున్నారు. ఎలాంటి అదనపు చార్జీల్లేకుండా సురక్షితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి గమ్యం చేరాలని వారిని ఆర్టీసీ కోరింది. ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. కాల్‌ సెంటర్‌ నెంబర్‌ 149 లేదా 0866-2570005 నెంబర్లకు ఫోన్‌ చేయవచ్చని సూచించింది.


తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సికింద్రాబాద్‌, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపురం, తిరుపతి, శ్రీకాకుళం ప్రాంతాలకు అదనపు ట్రైన్లు అందుబాటులో ఉన్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 11, 15 తేదీల్లో కాచిగూడ నుంచి శ్రీకాకుళం రోడ్‌(07615)కు సాయంత్రం 5.45కు ప్రత్యేక రైళ్లు బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం మీదుగా మరుసటి రోజు ఉదయం గమ్యానికి చేరుకుంటాయి. అవే రైళ్లు ఈ నెల 12,16తేదీల్లో శ్రీకాకుళంరోడ్‌ నుంచి మధ్యాహ్నం 2.45కు తిరిగి వెళతాయి. మరో రైలు చర్లపల్లి నుంచి జనవరి 8న రాత్రి 7.20కు బయలుదేరి మరుసటి ఉదయం గమ్యం చేరుతుంది. అదే రోజు(9న) మధ్యాహ్నం 2.45కు తిరిగి వెళుతుంది.

ఆర్టీసీ రిటైర్డ్‌ సిబ్బందికి ఈహెచ్‌ఎస్‌

వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన వైద్య సేవలు పునరుద్ధరణ

ఏపీఎ‌స్ఆర్టీసీ రిటైర్డ్‌ సిబ్బందికి కూటమి ప్రభుత్వం సంక్రాంతి ముందు తీపికబురు చెప్పింది. విలీన సమస్యల్లో ఒకటైన ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్య సేవలు పొందే అవకాశం కల్పించింది. 2020 జనవరిలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన వైసీపీ ప్రభుత్వం.. అంతకు ముందున్న వైద్య సదుపాయాన్ని రద్దు చేసింది. ఎన్‌ఎంయూ, ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌, కార్మిక పరిషత్‌ అసోసియేషన్లు కూటమి ప్రభుత్వానికి తాజాగా కలిసి దీనిపై విన్నవించాయి. స్పందించిన ప్రభుత్వం పాత పద్ధతిని పునరుద్ధరిస్తూ అత్యవసర వైద్య సేవలకు రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం కూడా కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంపై రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ, అసోసియేషన్ల నాయకులు పీవీ రమణారెడ్డి, పలిశెట్టి దామోదర్‌ రావు, శేషగిరి, చల్లా చంద్రయ్య హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jan 08 , 2025 | 03:11 AM