Share News

Nominated Boards : నామినేటెడ్‌ పదవులపై కసరత్తు

ABN , Publish Date - Jan 25 , 2025 | 06:27 AM

రాష్ట్రంలో సహకార సొసైటీల పాలకవర్గాల పదవీకాలం కొన్ని సంవత్సరాల క్రితమే పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం వీటికి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ పాలక వర్గాలతో నడిపించింది.

Nominated Boards : నామినేటెడ్‌ పదవులపై కసరత్తు

  • జాబితాల వడపోతలో అధినాయకత్వం

  • 2,200 వ్యవసాయ సహకార ప్రాథమిక సొసైటీలు, 600 మార్కెట్‌ కమిటీలకు పాలక మండళ్ల నియామకాలు

  • ఫిబ్రవరి మొదటి వారంలో వెలువడే అవకాశం

  • పదవుల్లో టీడీపీకి 80, జనసేనకు 15, బీజేపీకి 5 శాతం

  • జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులకు జోరుగా లాబీయింగ్‌

  • పార్టీ కార్యాలయానికి చేరిన ప్రతిపాదనలు

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాథమిక సహకార సొసైటీలు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు పాలక వర్గాల నియామకంపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. సంక్రాంతిలోపే ఈ నియామకాలు పూర్తవుతాయని పార్టీ వర్గాలు ఆశించినా అనుకోని కారణాలతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నెలాఖరుకు ఇవి వెలువడవచ్చని టీడీపీ కేంద్ర కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సహకార సొసైటీల పాలకవర్గాల పదవీకాలం కొన్ని సంవత్సరాల క్రితమే పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం వీటికి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్‌ పాలక వర్గాలతో నడిపించింది. వీటిలో కొన్ని సంస్కరణలు చేపట్టాలన్న యోచనలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి వీటికి నామినేటెడ్‌ పాలక మండళ్లు నియమించాలని నిర్ణయించింది. ప్రతి సొసైటీకి ముగ్గురు సభ్యుల పాలక మండలిని నియమిస్తారు. ఇందులో ఒకరు చైర్మన్‌గా ఉంటారు. రాష్ట్రంలో వ్యవసాయ సహకార ప్రాథమిక సొసైటీలు 2,200 ఉన్నాయి. ఇవిగాక మత్స్యకార సొసైటీలు, చేనేత సొసైటీలు వంటి వాటికి కూడా పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. వీటికి ఎగువన జిల్లా స్థాయిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీలు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంక్‌ వంటి వాటికి కూడా పాలకవర్గాలను నియమించాల్సి ఉంది. గ్రామ స్థాయిలో నియమించాల్సిన వాటిపై ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులకు పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.


ఈ పదవుల్లో 80 శాతం టీడీపీ, 15 శాతం జనసేన, 5 శాతం బీజేపీకి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అధిక శాతం ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు ఇప్పటికే ఈ పేర్లు పంపారు. వీటిపై పార్టీ కేంద్ర కార్యాలయం పరిశీలన జరుపుతోంది. పార్టీ కార్యాలయం పరిశీలన పూర్తయితే ఈ నియామకాలపై జీవోలు వెలువడే అవకాశం ఉంది. ఈ నియామకాల కోసం కింది స్థాయిలో పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కింది స్థాయిలో నియామకాలు పూర్తయిన తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయి సహకార సంస్థల పాలక మండళ్లు నియమిస్తారు. వీటికి ఇప్పటికే ఆశావహులు ముమ్మరంగా లాబీయింగ్‌ చేస్తున్నారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల పాలక మండళ్ల నియామకానికి కూడా ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 600 మార్కెట్‌ కమిటీలకు పాలక మండళ్లను నియమించాల్సి ఉంది. వీటికి అధ్యక్షుడు, మరి కొందరు డైరెక్టర్లు ఉంటారు. ఈ నియామకాల్లో రిజర్వేషన్‌ అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఏ మార్కెట్‌ కమిటీ ఏ రిజర్వేషన్‌ పరిధిలోకి వస్తుందో ఇప్పటికే ఖరారు చేశారు. దానికి అనుగుణంగా పేర్లు పంపాలని ఎమ్మెల్యేలకు కేంద్ర కార్యాలయం సూచించింది. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే పంపారు. మిగిలిన వాటి కోసం కేంద్ర కార్యాలయంలో ఎదురు చూస్తోంది. ఈ ప్రతిపాదనలు అందిన తర్వాత వాటిపై కూడా పార్టీపరంగా పరిశీలన జరుపుతారు. ఆ తర్వాత నియామక ఉత్తర్వులు వెలువడుతాయి. ఫిబ్రవరి మొదటి వారంలో వీటి నియామకాలు జరిగే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: ఈ బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత కల్పించండి: సీఎంచంద్రబాబు..

Visakha: కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను.. మరి జగన్ వెళ్లారా..

Supreme Court: వైసీపీ నేత గౌతంరెడ్డికి సుప్రీంలో ఊరట

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 25 , 2025 | 06:27 AM