Share News

AP High Court : సుప్రీం మార్గదర్శకాల మేరకు సీసీ కెమెరాలుఏర్పాటు చేశారా?

ABN , Publish Date - Feb 18 , 2025 | 06:02 AM

పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన కెమెరాలు స్టేషన్‌ ప్రాంగణం మొత్తం రికార్డయ్యేలా ఏర్పాటు చేశారా? లేదా? అని ఆరా తీసింది. ఈ విషయాన్ని పరిశీలించి రాష్ట్రస్థాయిలో

AP High Court : సుప్రీం  మార్గదర్శకాల మేరకు సీసీ కెమెరాలుఏర్పాటు చేశారా?

  • పోలీస్‌ స్టేషన్లను పరిశీలించి ఐటీ అధికారికి నివేదిక ఇవ్వండి

  • డీఎస్పీలకు హైకోర్టు ఆదేశం

  • అదనపు అఫిడవిట్‌ దాఖలుకు ఉత్తర్వులు

అమరావతి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీ్‌సస్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన కెమెరాలు స్టేషన్‌ ప్రాంగణం మొత్తం రికార్డయ్యేలా ఏర్పాటు చేశారా? లేదా? అని ఆరా తీసింది. ఈ విషయాన్ని పరిశీలించి రాష్ట్రస్థాయిలో ఐటీ విభాగాన్ని చూసే అధికారికి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీఎస్పీలను ఆదేశించింది. సదరు నివేదికను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ, మరమ్మతులు, సీసీటీవీ స్టోరేజ్‌ సామర్థ్యం తదితర వివరాలతో సవివరంగా అదనపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,392 పోలీస్‌ స్టేషన్లు ఉండగా 1,001 స్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని గుర్తు చేసింది. మిగిలిన స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడానికి కారణాలు ఏమిటి? చెప్పాలని కోరింది. అదేవిధంగా రాష్ట్రంలోని 81 జైళ్లలో 1,226 కెమెరాలు ఏర్పాటు చేయగా, 785 మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన సీసీ కెమెరాలు మరమ్మతు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కనీసం 12 నెలల పాటు ఫుటేజ్‌ను స్టోర్‌ చేయాల్సి ఉంటుందని, ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్లలో ఏర్పాటు చేసిన వ్యవస్థతో ఎన్ని నెలల ఫుటేజ్‌ స్టోర్‌ చేయవచ్చో స్పష్టత ఇవ్వాలని కోరింది. పోలీస్‌ స్టేషన్లలో రికార్డు అయిన ఫుటేజ్‌ను ఎక్కడ స్టోర్‌ చేస్తున్నారు? మరమ్మతులకు ఎలాంటి విధానాన్ని అనుసరించబోతున్నారో సవివరంగా అదనపు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మార్చి 10కి వాయి దా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌. రఘునందనరావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


ఇదీ పిటిషన్‌

రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ 2019లో న్యాయవాది తాండవ యోగేశ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్నాన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2019, జులై 15న ఽఆదేశాలిచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని స్పష్టం చేసింది. ఏళ్లు గడుస్తున్నా ఉత్తర్వులు అమలు కాకపోవడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా పూర్తి వివరాలతో వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని డీజీపీ, జైళ్లశాఖ డీజీని ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్‌ సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. న్యాయవాది తాండవ యోగేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘రాష్ట్రంలోని 391 పోలీస్‌ స్టేషన్లలో ఇప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. దీనికి కారణాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదు. ఎంతకాలం పాటు ఫుటేజ్‌ను భద్రపరుస్తున్నారో స్పష్టంగా చెప్పలేదు. సీసీటీవీల నిర్వహణ బాధ్యులు ఎవరో కౌంటర్‌లో స్పష్టం చేయలేదు’’ అని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) టి. విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. ‘‘రాష్ట్ర వాప్తంగా లాకప్‌ ఉన్న పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పోలీసు స్టేషన్లు, జైళ్లలో పనిచేయని కెమెరాలను మరమ్మతు చేయడంతో పాటు వాటి నిర్వహణ బాధ్యతను రెండు ఏజెన్సీలకు అప్పగించారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - Feb 18 , 2025 | 06:02 AM