CM Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. కేవలం రూ.100తో భూముల రిజిస్ట్రేషన్..
ABN , Publish Date - Jul 07 , 2025 | 04:16 PM
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సామాన్యులు.. భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టు పలుమార్లు తిరగవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, జులై 07: ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులోభాగంగా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో నామమాత్ర ఫీజుతో.. వారసత్వ భూముల సక్సెషన్ రిజిస్ట్రేషన్లు త్వరలో ప్రారంభించేందుకు సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. చర్యలను వేగవంతం చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ రూ. 10 లక్షల లోపు ఉంటే.. రూ. 100, అంతకంటే ఎక్కువ ఉంటే రూ. 1000 ఫీజును స్టాంపు డ్యూటీ కింద తీసుకోనున్నారు.
అందుకే ఈ నిర్ణయం..
ఆస్తి యజమానులు మరణించిన అనంతరం వారసులకు సంక్రమించే వాటికి మాత్రమే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు. తల్లిదండ్రులు మరణించిన అనంతరం వారసత్వంగా వచ్చే ఆస్తులను వారసులు.. తహసీల్దారుకు దరఖాస్తు చేసి, కాగితాలపై రాసుకుంటున్నారు. అయితే వీటికి మ్యుటేషన్లు జరగడం లేదని.. తహసీల్దారు కార్యాలయ సిబ్బంది పలుమార్లు తిప్పుతున్నారంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. గత ఒక్క ఏడాదిలో 55 వేలకు పైగా ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. అదీకాక.. తమ ఆస్తికి ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించాలనే ఉద్దేశంతో పలువురు ఉంటున్నారు. దీని వల్ల చనిపోయిన వారి పేర్లు భూముల రికార్డుల్లో అలాగే ఉండిపోతున్నాయి. దీంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రభుత్వ అంచనా..
గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో మరణ ధృవీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. యజమాని మరణించిన అనంతరం వచ్చిన ఆస్తులను వారసులు భాగాలుగా చేసుకుని లిఖితపూర్వకంగా ఏకాభిప్రాయంతో వస్తే.. గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో పని చేసే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తారు. సచివాలయాల్లో.. అది కూడా నామమాత్రపు ఫీజులతో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వారసులు ముందుకు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
సీఎంచంద్రబాబు సమీక్ష..
ఇక రిజిస్ట్రేషన్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాలు నమోదు ఆటోమేటిగ్గా జరుగుతుంది. ఆ వెంటనే ఈ పాస్ బుక్ జారీ అవుతుంది. ఆ క్రమంలో వారసుల వద్ద నుంచి ఈ కేవైసీ సైతం తీసుకుంటారు. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించి.. ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ నుంచి ఈ విధానం అమలుపై మార్గదర్శకాలు రానున్నాయి. అందుకోసం రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ చర్యలు తీసుకుంటుంది. అందుకోసం రెండు, మూడు మాసాల సమయం పట్టనుందని తెలుస్తోంది.
వైసీపీ పాలనలో గందరగోళం..
గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అనాలోచితంగా ప్రవేశపెట్టిన దస్తావేజుల రిజిస్ట్రేషన్ గందరగోళానికి దారితీసింది. కానీ ప్రస్తుతం వారసత్వ భూములకు రిజిస్ట్రేషన్ చేస్తారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగనుంది. అందుకోసం డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుందని తెలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ ప్రతిపక్షానికి కూడా పనికిరాడు.. దేవినేని ఉమ సెటైర్లు
సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
For More AndhraPradesh News And Telugu News