AP Government: ఉద్యోగాల్లో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:47 AM
ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పోటీ పరీక్షల అవసరం లేకుండా అర్హత కలిగిన క్రీడాకారులకు ప్రత్యక్ష నియామకాలు జరుగుతాయి.
ఏపీపీఎస్సీతో సహా ఇతర నియామకాలకు వర్తింపు.. వివిధ పరిశీలనల తర్వాతే ఎంపిక
మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం.. స్పోర్ట్స్ పాలసీలో భాగంగా అమలు
అమరావతి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీసు, ఎక్సైజ్, ఆటవీ శాఖతో సహా యూనిఫాం సర్వీసుల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2024-29కి సంబంధించిన స్పోర్ట్స్ పాలసీని ప్రకటించింది.
క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అందులో ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా మూడు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా లేదా శాఖల వారీగా, డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా చేపట్టే ప్రతీ నియామకాల్లో క్రీడాకారులకు రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. క్రీడా కోటా కింద అందించే రిజర్వేషన్లకు పోటీ పరీక్షల అవసరం లేదు. ప్రత్యక్ష నియామకాల్లో అర్హత కలిగిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు సమాంతర రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఈ మార్గదర్శకాలు స్పోర్ట్స్ పాలసీ ప్రకటించినప్పటి నుంచే ఐదేళ్లు అమల్లో ఉంటాయి.
వీరికి ‘గ్రూప్స్’ ఉద్యోగాలకు అర్హత
ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఆసియన్ గేమ్స్, ఆసియన్ పారా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్‌లో స్వర్ణం, రజతం పతకాలు సాధించిన వారికి మాత్రమే గ్రూప్- 1, 2 విభాగాల్లో నేరుగా ఉద్యోగాలు కల్పించే వెసులుబాటు కల్పించింది. కాంస్య పతకంతో పాటు క్రీడల్లో పాల్గొన్న సర్టిఫికెట్ ఉంటే గ్రూప్- 3 విభాగంలో ఉద్యోగాలకు ప్రభుత్వం అర్హత కల్పించింది. మిగతా క్రీడల్లో గ్రూప్- 3కి మాత్రమే అర్హత ఉంటుంది.
స్క్రీనింగ్ కమిటీ పని ఇదీ..
శాప్ ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌తో ప్రభుత్వం ఒక స్ర్కీనింగ్ కమిటీని కూడా నియమించింది. ఇందులో ఇద్దరు సీనియర్ జిల్లా క్రీడా అధికారులు, గిరిజన క్రీడా అధికారి, శాప్‌లోని టెక్నికల్ అసిస్టెంట్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ క్రీడాకారులు అందించిన సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించడం, సదరు సర్టిఫికెట్లు వాస్తవికతను (జన్యూనిటీ) నిర్ధారించాల్సి ఉంటుంది. క్రీడాకారులు సాధించిన పతకాలు, సర్టిఫికెట్లను తనీఖీ చేయడంతో పాటు క్రీడాకారులు స్పోర్ట్స్‌లో పాల్గొన్న సమయంలో తీసుకున్న ఫోటోలు, అధికారిక ప్రకటనలు.. ఇలా ప్రతిదాన్ని పరిశీలించాలి.
రాష్ట్రస్థాయి కమిటీలో ఇలా..
రాష్ట్రస్థాయి కమిటీలో క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, నియామకాలు చేసే శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఎండీ మెంబర్ కన్వీనర్‌గా కమిటీలో ఉంటారు. శాప్ ఎండీ రాష్ట్రస్థాయి కమిటీ సమావేశానికి ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీ శాఖలు, కేడర్ వారీగా ఉద్యోగాలపై సమీక్ష నిర్వహించాలి. ప్రాథమిక మెరిట్ లిస్ట్‌ను సిద్ధం చేసి స్ర్కీనింగ్ కమిటీకి పంపించాలి. ఈ కమిటీ 15 రోజుల వ్యవధిలో మెరిట్ లిస్ట్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభ్యంతరాలు లేకపోతే రాష్ట్రస్థాయి కమిటీ తుది మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయాల్సి ఉంటుంది. దీన్ని మెంబర్ కన్వీనర్ ఆయా శాఖలకు పంపించాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదించిన తుది జాబితా ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు.
ఇవి కూడా చదవండి
తల్లి కోరిక మేరకు 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న బీజేపీ నేత
Kids Cough Syrup Ban: నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందుపై ఆంక్షలు
Read Latest AP News And Telugu News