Vijayawada: మెట్రో సాకారం దిశగా అడుగులు
ABN , Publish Date - Jan 03 , 2025 | 06:03 AM
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో రూ.2 వేల కోట్ల వ్యయంతో రోడ్డు కమ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది.
2 వేల కోట్లతో రోడ్డు కమ్ మెట్రో డబుల్ డెక్కర్ ఫ్లైఓవ ర్లు
తొలి విడతలో విజయవాడలో 4.7 కి.మీ.. విశాఖలో 4 కి.మీ.
విశాఖ, విజయవాడ మెట్రోలకు కేంద్రం సాయం!
కోల్‌కతా తరహాలో ఏపీలోనూ చేపట్టేలా చర్చిద్దాం
నాలుగేళ్లలో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యం
మెట్రో రైలుపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, విజయవాడ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో రూ.2 వేల కోట్ల వ్యయంతో రోడ్డు కమ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. విజయవాడలో 66 కి.మీ మేర, విశాఖపట్నంలో 76.90 కి.మీ మేర చేపట్టబోయే మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు ఆమోదించారు. ఈ ప్రాజెక్టులకు నిధుల అంశంపై గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి ప్రజంటేషన్ ద్వారా ప్రాజెక్ట్ స్థితిగతులను వివరించారు. 2017లో వచ్చిన కొత్త మెట్రో పాలసీ ప్రకారం రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు ఫండింగ్ అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. 2017 వరకు నూరు శాతం నిధులు కేంద్రం భరించే విధానం లేదు. అయితే 2017 పాలసీ ప్రకారం వంద శాతం ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్‌కతాలో రూ.8,565 కోట్లతో 16 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు చేపట్టింది. ఈ తరహాలో ఏపీలో కూడా మెట్రో ప్రాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఏపీ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని అన్నారు. ఈ చట్ట ప్రకారం.. లేదంటే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్రం సాయం చేయాలన్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక దాని ప్రకారం పూర్తి ఖర్చు కేంద్రం భరించేలా సంప్రదింపులు జరుపుతామని చెప్పారు.
రెండు చోట్ల డబుల్ డెక్కర్...
మెట్రో ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో ఎన్‌హెచ్-16పై నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు వరకు 4.7 కి.మీ., విశాఖపట్నంలో గాజువాక నుంచి స్టీల్‌ప్లాంట్ వరకు 4 కిమీ. మేర రోడ్డు కమ్ డ బుల్ డెక్కర్ ఫ్లైఓవ ర్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ విధానంలో రోడ్డు ఫ్లైఓవర్ మీద మెట్రో ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ అంటారు. ఎన్‌హెచ్-16పై నిడమానూరు జంక్షన్ నుంచి మహానాడు జంక్షన్ వరకు 7 కి.మీ. ఆరు వరసల ఫ్లైఓవర్ మంజూరైంది. ఈ మార్గంలో మొదటి మెట్రో కారిడార్ గన్నవరం బస్‌స్టేషన్ నుంచి రామవరప్పాడు రింగ్ మీదుగా ఏలూరు రోడ్డు నుంచి రైల్వేస్టేషన్, పీఎన్‌బీఎస్ వరకు వెళుతుంది.
ఈ మార్గంలో నిడమానూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు రింగ్ వరకు 4.7 కి.మీ. మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.1100 కోట్ల మేర ఖర్చవుతుందని ఇటీవల మెట్రో అధికారులు అంచనాలు రూపొందించారు. అదే విధంగా గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు కూడా ఇదే విధంగా రూ.900 కోట్లు వ్యయం అవుతుందని నిర్ణయించారు. ఇప్పటికే ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కేంద్రంతో త్వరితగతిన చర్చించి మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నాలుగేళ్లలో రెండు నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షలో మంత్రులు నారాయణ, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.