AP Government Focuses on Pension: ఒక్క అర్హుడికీ అన్యాయం జరగదు
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:41 AM
అర్హుడైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని.. పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. వైసీపీ హయాంలో చాలా మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారని..
సామాజిక భద్రత, వృద్ధాప్య పింఛన్లను రూ.300 నుంచి రూ.4 వేలకు మనమే పెంచాం. వృద్ధులకు ఇస్తున్న రూ.4 వేలలో రూ.2,875ని టీడీపీ ప్రభుత్వాలే పెంచాయి. ఎన్నికల ముందు టీడీపీ యంత్రాంగం సూపర్ సిక్స్ హామీలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించింది. చెప్పిన విధంగా ఆ హామీలను అమలు చేసి మాట నిలబెట్టుకున్నాం. పింఛన్ల విషయంలో కూడా పార్టీ కేడర్ ఇదే విధంగా పనిచేయాలి.
- సీఎం చంద్రబాబు
దివ్యాంగుల పింఛన్లపై సీఎం భరోసా
వైసీపీ హయాంలో అనర్హులకు పెన్షన్లు
దివ్యాంగులకు ఒక్క రూపాయైునా పెంచలేదు
దానిపై మాట్లాడే అర్హతే వారికి లేదు
అనర్హుల గుర్తింపులో లోపాలు గుర్తించండి
అధికారులు తప్పు చేస్తే సరిదిద్దండి
ఎంతో చేస్తున్నాం.. చేసింది చెప్పుకొందాం
పింఛన్ల పంపిణీకి ఇంటింటికీ వెళ్లండి
జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం
రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు: సీఎం
టీడీపీ ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్
అమరావతి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): అర్హుడైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని.. పింఛను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. వైసీపీ హయాంలో చాలా మంది అనర్హులకు పింఛన్లు ఇచ్చారని.. దీనివల్ల అర్హులకు నష్టం కలుగుతోందని అన్నారు. ఏ ఒక్క అర్హుడికీ నష్టం జరుగకూడదంటే.. అనర్హులను తప్పించాల్సి ఉందని చెప్పారు. అనర్హులను గుర్తించే ప్రక్రియలో ఎక్కడైనా లోపాలున్నా.. అధికార యంత్రాంగం పొరపాట్లు చేసినా.. దానిని గుర్తించి సరిదిద్దే బాధ్యతను టీడీపీ యంత్రాంగం తీసుకోవాలని పిలుపిచ్చారు. తాత్కాలిక సర్టిఫికెట్లు ఉన్న వారికి నోటీసులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ పింఛను ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వినాయకచవితిని పురస్కరించుకుని బుధవారం ఆయన మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దివ్యాంగుల పింఛన్లపై వైసీపీ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. దీనిపై ఆ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తోందన్నారు. ‘వైసీపీ తప్పులు చేస్తూ.. వాటిని ఎదుటివారిపైకి నెడుతోంది. దీన్ని మనం సమర్థంగా తిప్పికొట్టాలి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనైనా.. గతంలో ఏ ప్రభుత్వాలైనా.. ఈ స్థాయిలో పింఛన్లు ఇచ్చాయా? సీఎంగా ప్రభుత్వ విధానాలను అమలు చేస్తాను. పార్టీ అధినేతగా పార్టీ యంత్రాంగం ఇచ్చే ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాను. లోపాలుంటే సరిదిద్దుతాను’ అని వివరించారు. సీఎం ఇంకా చెప్పారంటే..
సంక్షేమాన్ని పరిచయం చేసిందే టీడీపీ
తెలుగు ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీయే. ప్రతి ఇంటికీ మనం చేసే మంచి పని చేరాలి. ప్రభుత్వం ఇబ్బందులున్నా సంక్షేమం అందిస్తుందనే విషయం ప్రజలు అర్థం చేసుకునేలా వివరించాలి. మరే రాష్ట్రంలోనూ ఇవ్వనంత పెద్దఎత్తున పింఛన్లు ఇస్తున్నాం. దివ్యాంగులకు గత ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు. వైసీపీకి పింఛన్లపై నోరెత్తి మాట్లాడే అర్హత లేదు. దివ్యాంగుల పింఛన్లను రూ.500 నుంచి రూ.6 వేలు చేసింది టీడీపీ ప్రభుత్వాలే. డయాలసిస్ రోగులకు పింఛన్‌ను రూ.10 వేలకు పెంచిందీ టీడీపీయే. మంచానికే పరిమితమైన వారికి పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టిన టీడీపీ ప్రభుత్వమే.. ఆ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచింది. 63 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతినెలా 1నే పింఛన్లు ఇస్తున్నాం. ఏడాదికి రూ.35 వేల కోట్లు పింఛన్లకే ఖర్చు చేస్తున్నాం.
సంక్షేమాన్ని పరిచయం చేసిందే టీడీపీ
తెలుగు ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీయే. ప్రతి ఇంటికీ మనం చేసే మంచి పని చేరాలి. ప్రభుత్వం ఇబ్బందులున్నా సంక్షేమం అందిస్తుందనే విషయం ప్రజలు అర్థం చేసుకునేలా వివరించాలి. మరే రాష్ట్రంలోనూ ఇవ్వనంత పెద్దఎత్తున పింఛన్లు ఇస్తున్నాం. దివ్యాంగులకు గత ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు. వైసీపీకి పింఛన్లపై నోరెత్తి మాట్లాడే అర్హత లేదు. దివ్యాంగుల పింఛన్లను రూ.500 నుంచి రూ.6 వేలు చేసింది టీడీపీ ప్రభుత్వాలే. డయాలసిస్ రోగులకు పింఛన్‌ను రూ.10 వేలకు పెంచిందీ టీడీపీయే. మంచానికే పరిమితమైన వారికి పింఛన్లు ఇవ్వడం మొదలుపెట్టిన టీడీపీ ప్రభుత్వమే.. ఆ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచింది. 63 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతినెలా 1నే పింఛన్లు ఇస్తున్నాం. ఏడాదికి రూ.35 వేల కోట్లు పింఛన్లకే ఖర్చు చేస్తున్నాం.
6న సూపర్ సిక్స్ సభ
ప్రజల కోసం పనిచేయడం ఎంత ముఖ్యమో.. చేసిన పని చెప్పుకోవడమూ అంతే ముఖ్యం. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ విజయవంతమైంది. ఇందులో భాగంగా 1.12 కోట్ల ఇళ్లకు పార్టీ యంత్రాంగం వెళ్లి.. చేస్తున్న మంచిని వివరించింది. 6న అనంతపురంలో ‘సూపర్ సిక్స్- సూపర్‌హిట్’ సభ నిర్వహిస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే ఎక్కువ చేశాం. మెగా డీఎస్సీ నిర్వహించాం. 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఎంత మంది పిల్లలున్నా.. తల్లికి వందనం ఇచ్చాం. అన్న క్యాంటీన్, అన్నదాత సుఖీభవ అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. చేనేతలకు ఉచిత విద్యుత్, మత్స్యకారుల సేవలో భాగంగా వేట విరామ సమయంలో రూ.20 వేలు.. ఇలా ఎన్నో మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రజల్లోకి వెళ్లి వివరించాలి.
ప్రజల కోసమే రాజకీయం చేయాలి
కార్యకర్తలు, నేతలు గట్టిగా పనిచేసి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించారు. ఏ ఎన్నిక వచ్చినా కూటమే గెలవాలి. మనం ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూపించి దెబ్బతీయాలని ప్రత్యర్థులు చూస్తున్నారు. వారి కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొందరు తాత్కాలిక రాజకీయాలు చేయాలనుకుంటారు. దీని వల్ల ఇబ్బందులు వస్తాయి. శాశ్వత రాజకీయాలు చేయాలి. ప్రజల కోసమే రాజకీయాలు చేయాలి. టీడీపీ జిల్లా కమిటీల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. త్వరలోనే ప్రకటిస్తాం. రాష్ట్ర కమిటీ ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నాం.

అర్హత ఉండీ పెన్షన్ అందలేదంటే కలెక్టర్లదే బాధ్యత: సీఎస్
రాష్ట్రంలో అర్హత గల ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పింఛన్ అందించాలని.. ఎక్కడైనా అర్హత ఉండి పింఛన్ రాలేదని ఫిర్యాదు వస్తే అందుకు సంబంధింత జిల్లా కలెక్టర్లే బాధ్యత వహించాలని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. పింఛన్లు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, భూగర్భ జలాలు, పీఎం కుసుమ్ పథకం, జిల్లా జువెనైల్ జస్టిస్ కమిటీలు తదితర అంశాలపై గురువారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, జిల్లా, మండల ప్రత్యేక అధికారులు ప్రతినెలా పింఛన్ల పంపిణీలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. ‘కలెక్టర్లు అర్హత గలవారందరికీ తప్పనిసరిగా పెన్షన్ అందేలా చూడాలి. పెన్షన్ల తనిఖీకి సంబంధించి 1.35లక్షల మందికి నోటీసులు జారీచేసి నెలరోజుల్లోగా ఎంపీడీవోలకు అప్పీల్ చేసుకోవాలని తెలియజేశాం. వారిలో 88,319 మంది అప్పీలు చేసుకున్నారు. వాటిని నెల రోజుల్లోపు పరిష్కరించాలి’ అని నిర్దేశించారు.
1,129 కోట్లతో విలేజ్ హెల్త్ క్లినిక్స్
4,472 గ్రామాల్లో నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్
ఏడాదిలోగా పూర్తి చేయాలి: సత్యకుమార్
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం 4,472 గ్రామాల్లో రూ.1,129 కోట్లు వ్యయంతో విలేజ్ హెల్త్ క్లినిక్స్‌కు సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉండగా.. వాటిలో 1,086 ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయని, మిగిలినవి అద్దె భవనాల్లో నడుస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సమీక్షించి 4,472 గ్రామాల్లో హెల్త్ క్లినిక్‌లకు సొంత భవనాలు నిర్మించడానికి ఆమోదం తెలిపామన్నారు. గత ప్రభుత్వం నిర్మాణ పనులు చేపట్టి.. నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయిన 2,309 భవనాలతోపాటు, నూతనంగా మరో 2,163 కలిపి మొత్తం 4,472 భవనాలను ప్రభుత్వం నిర్మించనుందని తెలిపారు. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎం ఏబీహెచ్‌ఐఎం), 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ నిర్మాణాలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. ఈ భవనాలను ఏడాదిలోపు పూర్తి చేయాలని, ఈ మేరకు నిర్మాణ పనులు చేపట్టనున్న పంచాయతీరాజ్ శాఖతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రి సూచించారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..