Share News

AP Govt Action: ఇన్‌చార్జ్‌ ఈవో సహా ఏడుగురిపై వేటు

ABN , Publish Date - May 06 , 2025 | 03:36 AM

సింహాచలంలో గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసింది. నాసిరకం నిర్మాణం, ఇంజినీరింగ్ లోపాలే ప్రమాదానికి కారణమని త్రిసభ్య కమిటీ నివేదిక తేల్చింది.

AP Govt Action: ఇన్‌చార్జ్‌ ఈవో సహా ఏడుగురిపై వేటు

  • సింహగిరి గోడ దుర్ఘటనలో త్రిసభ్య కమిటీ సిఫారసులకు ఆమోదం

  • సస్పెండైన వారిలో దేవస్థానం, ఏపీటీడీసీ ఇంజనీర్లు

  • కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌ చర్యలు.. బ్లాక్‌ లిస్టులో కాంట్రాక్టు సంస్థ

  • సచివాలయంలో సీఎంను కలిసిన ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌

  • ఏడుగురు భక్తులు మరణించిన దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక సమర్పణ

  • అది నాసిరకం గోడ.. ప్లాన్‌ లేదు.. డిజైనూ లేదు.. ఫ్లైయాష్‌ ఇటుకలు

  • వాడారు.. డ్రెయిన్‌ పైపులు పెట్టలేదు.. అన్నింటా అధికారుల నిర్లక్ష్యం

  1. ఏపీటీడీసీ, దేవదాయ శాఖ అధికారులు గోడ కట్టాలని చెప్పారే గానీ.. ఆ పనులు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంజనీర్లు, అధికారులు తనిఖీలు చేయకుండానే నిర్మాణాన్ని పూర్తి చేసేశారు.

  2. సాంకేతిక, అధికారిక అనుమతి లేకుండా ఆలయాల్లో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టవద్దు. నిర్మాణ సమయంలో రోజువారీ పాటించాల్సిన అన్ని రకాల ప్రొటోకాల్స్‌నూ కచ్చితంగా పాటించాలి. నాణ్యతా లోపాల పర్యవేక్షణ, జవాబుదారీ బాధ్యత మొత్తం ఇంజనీర్లకు అప్పగించాలి.

- త్రిసభ్య కమిటీ

అమరావతి/విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): సింహాచలం చందనోత్సవంనాడు గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించిన ఘటనకు బాధ్యులైన దేవస్థానం ఇన్‌చార్జి ఈవో కె.సుబ్బారావు సహా ఏడుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. సింహగిరిపై జోడుభద్రాలు వద్ద ఓ భారీ గోడను ఉత్సవానికి ఐదు రోజుల ముందు నిర్మించారు. ఆ పక్క నుంచే రూ.300 క్యూలైన్‌ ఏర్పాటుచేశారు. గత 29వ తేదీ రాత్రి కురిసిన భారీవర్షానికి ఆ గోడ మర్నాడు కూలిపోయి ఏడుగురు భక్తులు మరణించారు. దీనిపై విచారణకు ప్రభుత్వం పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేశ్‌కుమార్‌, ‘ఈగల్‌’ ఐజీ ఆకె రవికృష్ణ, జలవనరుల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. వారు మరుసటిరోజే సింహాచలం వచ్చి కొండపైకి వెళ్లి ఘటనా స్థలంలో విచారణ చేశారు. ఆ తర్వాతి రోజు విశాఖ ప్రభుత్వ అతిథిగృహంలో మరోసారి అందరినీ విచారించారు. మొత్తం 19 మందితో మాట్లాడారు. ఎటువంటి డిజైన్‌, అనుమతులు లేకుండా గోడను నిర్మించినట్లు తేల్చారు.


ఆ నిర్మాణంలో కూడా ఇంజనీరింగ్‌ నిబంధనలు పాటించలేదని గుర్తించారు. ఈ పనులను కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్‌’ కింద చేపట్టారు. అధికారులు ఒత్తిడి చేస్తేనే గోడ కట్టానని కాంట్రాక్టర్‌ స్పష్టంచేశారు. అన్నింటినీ పరిశీలించిన త్రిసభ్య కమిటీ.. ఎవరు బాధ్యులో తేలుస్తూ చర్యలకు సిఫారసు చేసింది. సురేశ్‌కుమార్‌ సోమవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి ఆరు పేజీలతో ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఏడుగురు అధికారులను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చింది. దేవస్థానం ఇన్‌చార్జి ఈఓ కె.సుబ్బారావు, దేవస్థానంలో ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన డీజీ శ్రీనివాసరాజు (ఈఈ), కేఎస్ఎన్‌ మూర్తి (డిప్యూటీ ఈఈ), కె.బాబ్జీ (జేఈ), ఏపీటీడీసీకి చెందిన కె.రమణ (ఈఈ), ఏబీవీఎల్‌ఆర్‌ స్వామి (డిప్యూటీ ఈఈ), పి.మదన్‌మోహన్‌(ఏఈ)లను సస్పెండ్‌ చేసింది. కాంట్రాక్టర్‌ కె.లక్ష్మీనారాయణ (లక్ష్మణరావు)పై క్రిమినల్‌ చర్యలకు ఆదేశించింది. ఆయన సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని స్పష్టంచేసింది. అసలా రోజు అక్కడ ఏం జరిగిందో సురేశ్‌కుమార్‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు. 15 నిమిషాలు ఆయన ఆ వివరాలన్నీ తెలియజేశారు. వెంటనే ముఖ్యమంత్రి.. హోం మంత్రి అనిత, దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఫోన్లో మాట్లాడారు.


పునాదే లేదు..

గోడ నిర్మాణానికి సరైన డిజైన్‌, డ్రాయింగ్‌లు లేవని.. దీని నిర్మాణానికి ఎలాంటి ప్రణాళికనూ అధికారులు సిద్ధం చేయలేదని త్రిసభ్య కమిటీ వెల్లడించింది. పైగా గోడ నిర్మాణం వర్షపు నీటిని నివారించాలన్న ఉద్దేశంతో నిర్మించారు. కానీ వర్షపునీటి తాకిడిని తట్టుకునే సామర్థ్యంతో దానిని కట్టలేదు. పైగా దానికి పునాది కూడా లేదు. నిర్మాణంలోనూ ఫ్లైయాష్‌ బ్రిక్స్‌ ఉపయోగించారు. ఇంత బలమైన గోడ నిర్మాణానికి వాటిని వాడకూడదు. ఇలాంటి భారీ గోడలు నిర్మించే సమయంలో డ్రెయిన్‌ పైపులు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్రెంచ్‌ డ్రెయిన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వర్షపు నీరు గోడను ఆనుకుని నిలబడకుండా డ్రెయిన్‌ పైపుల ద్వారా బయటకు వెళ్తుంది. సింహాచలం గోడ నిర్మాణంలో ఈ నిబంధనలు పాటించలేదని నివేదికలో పొందుపరిచారు. అలానే నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో కూడా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వర్షం పడిన తర్వాత నీరు బయటకు పోకుండా గోడ కట్టడంతో నీరు అక్కడే నిలిచిపోయింది. చందనోత్సవం కోసం నిర్మించిన తాత్కాలిక షెడ్లు గోడపై భారంగా మారి.. వర్షం, గాలి వల్ల దానిపై మరింత ఒత్తిడి పెరిగింది. ‘గోడ కూలడం వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గోడ నిర్మాణానికి డిజైన్లు, దానికి అంచనాలు ఏమీ లేవు. అధికారులు వాటి ఊసే ఎత్తలేదు. సాధారణ ఇంజనీరింగ్‌ సూత్రాలను కూడా పాటించలేదు. దేవస్థానం ఈవో, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తమ విధి నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారు. పైగా గోడ ప్రమాదానికి ఏపీటీడీసీ అధికారులు కారణమన్నట్లు వారిపై నిందలు మోపేందుకు ప్రయత్నించారు. ప్లాన్‌ లేకుండానే గోడ నిర్మించినట్లు ఏపీటీడీసీ అధికారులు విచారణలో అంగీకరించారు. నిర్మాణం సమయంలో నాణ్యత తనిఖీల కోసం కచ్చితంగా ఉండాల్సిన ఎం-బుక్‌ను ఇంజనీర్లు ఉపయోగించలేదని తేలింది’ అని నివేదికలో పేర్కొన్నారు.


ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి..

ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో జరక్కుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కమిటీ సూచించింది. శాశ్వత నిర్మాణాలైనా.. తాత్కాలికమైనవైనా కచ్చితంగా డిజైన్లు ఉండాలి. అనుమతులు కచ్చితంగా తీసుకోవాలి. డిజైన్‌, నిర్మాణంలో నాణ్యత కోసం అర్హత కలిగిన ఇంజనీర్లకు మాత్రమే పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి. అనుమతి పొందిన మెటీరియల్స్‌ను మాత్రమే నిర్మాణాల్లో ఉపయోగించాలి. ముఖ్యంగా నిర్మాణం అనంతరం కచ్చితంగా క్యూరింగ్‌ చేయడంతో పాటు దానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలి. ప్రతి నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్‌ టెస్ట్‌లు కచ్చితంగా నిర్వహించాలని సిఫారసు చేసింది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం కచ్చితంగా ప్రత్యేకమైన ప్రొటోకాల్స్‌ సిద్ధం చేసుకోవాలని.. ముఖ్యంగా దేవస్థానం, ఏపీటీడీసీ మధ్య ప్రొటోకాల్స్‌ కచ్చితంగా ఉండాలని సూచించింది. ‘నిర్మాణాల్లో ఎలాంటి మార్పు చేయాలన్నా.. కచ్చితంగా అందరూ ఆమోదించాకే అనుమతివ్వాలి. అనధికార సమాచారంతో, ఆమోదంతో, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ప్లాన్‌ మార్చి నిర్మాణాలు చేపట్టవద్దు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, జవాబుదారీపై ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేయాలి’ అని నివేదికలో స్పష్టంగా పొందుపరచింది.


రుషికొండ నిర్మాణ పర్యవేక్షకుడు రమణే!

ఏపీటీడీసీ ఈఈ కె.రమణపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. రూ.450 కోట్లతో రుషికొండలో ప్యాలెస్‌ నిర్మాణ పనులను పర్యవేక్షించింది ఈయనే. అంతకుముందు అదే కొండపై ఉన్న హరిత రిసార్ట్స్‌ ఫర్నిచర్‌ విక్రయం, ప్యాలెస్‌ నిర్మాణానికి తవ్విన మట్టి అమ్మకంతో బాగా ఆర్జించారని విమర్శలున్నాయి. అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటక శాఖ అధీనంలో ఉన్న యాత్రీ నివా్‌సలు, హరిత రిసార్ట్స్‌ ఆధునికీకరణ పనుల అంచనాలు భారీగా పెంచేశారు. మూడేళ్లుగా విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ఆ శాఖ తరఫున ఒక్క గది కూడా లేకుండా చేశారు. ఆయనకు వైసీపీ ప్రభుత్వ పెద్దలు సహరించారు. కూటమి సర్కారు వచ్చాక ఆయనపై చర్యలు చేపడుతుందని అందరూ భావించారు. కానీ అదేం మాయో.. మరో రెండు పోస్టులు అదనంగా అప్పగించింది. దీనిపై పత్రికల్లో అనేక కథనాలు వచ్చినా చర్యలు తీసుకోలేదు. ఇటీవల చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించిన నేపథ్యంలో రమణను సస్పెండ్‌ చేశారు. అంతేతప్ప ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి పర్యాటక శాఖ ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. విచిత్రం ఏమిటంటే...ఆయన వైసీపీ హయాంలో జల వనరుల శాఖ నుంచి డిప్యుటేషన్‌పై ఏపీటీడీసీకి వచ్చి రూ.వందల కోట్ల విలువైన ప్రాజెక్టులను పర్యవేక్షించారు. ఇప్పటికైనా డిప్యుటేషన్‌ రద్దు చేస్తారో లేదో చూడాలి.


  • వైఫల్యం వీరిదే..

  1. కె.సుబ్బారావు-ఈవో, సింహాచలం దేవస్థానం:

    తాత్కాలిక గోడ నిర్మాణానికి అనుమతిచ్చారు. తన విధి నిర్వహణలో పూర్తిగా విఫలం అయ్యారు. ఇంజనీరింగ్‌ అధికారులపై పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఈయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

  2. డి.జి.శ్రీనివాసరావు, ఈఈ, సింహాచలం దేవస్థానం: సింహాచలం దేవస్థానంలో పరిస్థితులు, ప్రమాదాల గురించి ఈయనకు పూర్తిగా అవగాహన ఉంది. అయినా గోడ నిర్మాణం చేపట్టాలని పట్టుబట్టారు. కానీ నిర్మాణ పర్యవేక్షణలో పూర్తిగా విఫలమయ్యారు. విధి నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారు. క్రిమినల్‌ చర్యలతోపాటు క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలి.

  3. కె.రమణ-ఈఈ, ఏపీటీడీసీ: కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్‌’ స్కీమ్‌లో భాగంగా నిర్మాణాలకు అనుమతి ఇచ్చినందున ఈయనే బాధ్యత తీసుకోవాలి. అక్కడ జరుగుతున్న నిర్మాణాలపైన, నాణ్యతాలోపాలపైన ఈయనకు పూర్తి అవగాహన ఉంది. అయినా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించినందుకు క్రిమినల్‌ చర్యలతోపాటు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

  4. కె.ఎస్ .ఎన్‌.మూర్తి, డిప్యూటీ ఈఈ, సింహాచలం దేవస్థానం: గోడ నిర్మాణ పనులు తనిఖీలు చేయడంలో, నాణ్యతలోపాలు గుర్తించడంలో ఈయన పూర్తిగా విఫలమయ్యారు. నాణ్యతాలోపాలు సరిదిద్దడంలోనూ విఫలం చెందారు. సురక్షితం గాని గోడ నిర్మాణానికి అడ్డుకోలేదు. కాబట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

  5. ఏఆర్‌వీఎల్‌ఆర్‌ స్వామి-డిప్యూటీ ఈఈ, ఏపీటీడీసీ: గోడ నిర్మాణంలో నాణ్యత తక్కువ ఉందని ఈయన అంగీకరించారు. కానీ అది తాత్కాలిక గోడ కావడంతో వల్ల ప్రశ్నించలేదని, జోక్యం చేసుకోలేదని చెప్పారు. ఈయనపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

  6. పి.మదనమోహన్‌-ఏఈ, ఏపీటీడీసీ: గోడ నిర్మాణంలో నాణ్యత తక్కువ ఉందని తెలిసినా.. నాణ్యత పెంచే చర్యలు చేపట్టలేదు. ఈయనపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

  7. కె.బాబ్జీ-జేఈ, సింహాచలం దేవస్థానం: గోడ నిర్మాణంలో లోపాలు గమనించి ఈయన ఉన్నతాధికారులకు నివేదించారు. కానీ లోపాలు సరిదిద్దేందుకు సత్వర చర్యలు తీసుకోలేదు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

  8. కె.లక్ష్మీనారాయణ-కాంట్రాక్టర్‌: గోడ కూలి ఏడుగురు మరణించడానికి కాంట్రాక్టర్‌ కారణం. అనధికారికంగా పనులు చేపట్టారు. నిర్మాణ పనుల్లో లోపాలున్నాయని తెలిసినా వాటిని నివారించే చర్యలు తీసుకోలేదు. అధికారులు, కాంట్రాక్టర్‌కు వృత్తిపరమైన జవాబుదారీతనం లేకపోవడం వల్లే ఏడుగురు భక్తులు మరణించారు. నాణ్యతలేని గోడ నిర్మాణం చేపట్టి భక్తుల మరణాలకు కారణమయ్యారు కాబట్టి కాంట్రాక్టు సంస్థను బ్లాక్‌లిస్ట్‌ చేయడంతో పాటు లక్ష్మీనారాయణపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి.

దేవదాయ శాఖ కమిషనర్‌ వైఫల్యాలు..

త్రిసభ్య కమిటీ దేవదాయ కమిషనర్‌ వైఫల్యాలను కూడా ఎత్తిచూపింది. లోపాలను గుర్తించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. పర్యాటక శాఖతో సమన్వయం చేసుకోలేదు. గోడ నిర్మాణం గురించి తెలిసి కూడా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మొత్తం పర్యవేక్షణలో పూర్తిగా విఫలమయ్యారు. జవాబుదారీ లేకపోవడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించాయి.

Updated Date - May 06 , 2025 | 06:35 AM