Share News

Tourism Development: ఆధ్యాత్మిక నగరాల్లో హోమ్‌ స్టేలు

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:44 AM

రాష్ట్రంలోని ఆధ్యాత్మిక నగరాల్లో హోమ్‌ స్టేలను ప్రోత్సహించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు...

Tourism Development: ఆధ్యాత్మిక నగరాల్లో హోమ్‌ స్టేలు

  • కోనసీమలోనూ అభివృద్ధి.. పర్యాటకులు గ్రామీణ అనుభూతి పొందాలి.. సమీక్షలో సీఎం

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆధ్యాత్మిక నగరాల్లో హోమ్‌ స్టేలను ప్రోత్సహించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. తిరుపతితో పాటు ఇతర ప్రముఖ దేవాలయాలున్న ప్రాంతాల్లో వీటిపై దృష్టిపెట్టాలన్నారు. అలాగే కోనసీమ ప్రాంతంలో గ్రామీణ వాతావరణం అనుభూతి చెందేలా హోమ్‌ స్టేలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐలు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ హోమ్‌ స్టేలన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేలా చూడాలన్నారు. బుధవారం సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో పర్యాటక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖ, విజయవాడ, అమరావతి, తిరుపతి, అనంతపురం, కర్నూలు వంటి ప్రాంతాల్లో నిరంతరం ఏదోక టూరిజం ఈవెంట్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. నిర్దేశించిన గడువులోగా పర్యాటక ప్రాంతాల్లో బస కోసం హోటల్‌ గదులను సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే 2026 మార్చి నాటికి రాష్ట్రంలో 10 వేల గదులు అందుబాటులోకి రావాలని చెప్పారు. 2029 నాటికి 50 వేల గదుల లక్ష్యాన్ని కూడా చేరుకోవాలని స్పష్టం చేశారు. పర్యాటకుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక్క చిన్న సంఘటన జరిగినా మొత్తం పర్యాటక రంగం దెబ్బతింటుందని హెచ్చరించారు. పర్యాటకుల పట్ల మర్యాదగా ప్రవర్తించడం చాలా ముఖ్యమైన అంశమన్నారు. సమీక్షలో ఆయన ఇంకా ఏమన్నారంటే..

అనంతపురంలో డిస్నీ వరల్డ్‌

‘‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పర్యాటక ప్రాజెక్టులకు స్థలాలను గుర్తించాలి. పోర్టుల వద్ద పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలి. అనంతపురంలో డిస్నీ వరల్డ్‌ సిటీ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించాలి. కొండపల్లి ఖిల్లా లాంటి ప్రాజెక్టులను దత్తత తీసుకునేలా ప్రైవేట్‌ భాగస్వాములను గుర్తించాలి. ఉండవల్లి గుహల వద్ద లైట్‌ అండ్‌ సౌండ్‌ షో ఏర్పాటుతో పాటు, చింతపల్లిలో ఎకో టూరిజం, కుప్పంలో ఏనుగుల సఫారీ, విశాఖలో డాల్ఫిన్‌ షో వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలి. తైడ, అరకు, గండికోట, సూర్యలంక, బ్రిడ్జిలంక, లంబసింగి వంటి ప్రాంతాల్లో టెంట్‌ సిటీలను ఏర్పాటు చేయాలి. రాజమండ్రిని స్పెషల్‌ టూరిజం హాబ్‌గా చేయాలి. హావ్‌లాక్‌ బ్రిడ్జిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ఆకర్షణీయమైన బీచ్‌ ఫ్రంట్‌లను గుర్తించి అభివృద్ధి చేయాలి. హెలీ, సీప్లేన్‌ టూరిజానికి సంబంధించి విజయవాడ-శ్రీశైలం, గండికోట-బెంగళూరు, విశాఖ-అరకు లాంటి కొత్త మార్గాలను కూడా గుర్తించాలి. రివర్‌ క్రూయిజ్‌లను ప్రోత్సహించాలి. ఈనెల 22 నుంచి విజయవాడలో జరిగే దసరా ఉత్సవాలను మైసూరు ఉత్సవాల తరహాలో ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలి.


పర్యాటక ప్రాంతాలకు ఆకర్షణలు

పర్యాటరంగానికి మరింత శోభ తెచ్చేలా అదనపు ఆకర్షణలు జోడించడంతో పాటు, స్థానికంగా ఉన్న ఉత్పత్తులను కూడా బ్రాండింగ్‌ చేయాలి. అన్ని పర్యాటక ప్రాంతాల్లో, ఈవెంట్లలో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు అరుదైన ఎర్రచందనం బొమ్మలు, ఫర్నిచర్‌ లాంటి ఉత్పత్తులను కూడా ప్రదర్శించాలి. మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి లాంటి చేనేత వస్త్రాలు, సేంద్రీయ ఉత్పత్తులను కూడా ప్రదర్శించాలి’’ అని సీఎం ఆదేశించారు. సూర్యలంకలో బీచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ప్రాజెక్టు పనులను రూ. 97 కోట్లతో చేపట్టామని, వచ్చే జూన్‌ నాటికి ఈ ప్రాజెక్టు సిద్ధం అవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంకలో ఫెస్టివల్‌ నిర్వహించవచ్చని సీఎం సూచించారు. గోదావరి పుష్కరాలకు కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం నిర్వహిద్దామన్న మంత్రి దుర్గేశ్‌ ప్రతిపాదనకు సీఎం అంగీకారం తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించేందుకు సిద్ధం చేసిన ఆరు పురాతన తెలుగు తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు.


తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. నువ్వొస్తానంటే.. నే రానిస్తానా..!

పౌరుషానికి ప్రతీక నందమూరి హరికృష్ణ..

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 03:44 AM