CM Nara Chandrababu Naidu: రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Dec 31 , 2025 | 08:49 PM
నూతన సంవత్సరం సందర్భంగా పేదల ఇళ్లల్లో సంతోషం నింపేందుకు ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచనను చక్కగా అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రభుత్వ అధికారులకు, గ్రామ సచివాలయ సిబ్బందికి, గ్రామస్థాయి ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా పేదల ఇళ్లల్లో సంతోషం నింపేందుకు ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచనను చక్కగా అమలు చేశారని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. పింఛన్లు అందుకున్న లబ్దిదారులు అందరికీ మరోసారి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించింది. ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికింది. ఏ రంగంలో చూసినా 2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు. నాటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు. ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతి సాధించిన సంవత్సరంగా 2025 గుర్తుండిపోతుంది.
ఇదే స్ఫూర్తితో ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ప్రారంభమయ్యే 2026 నూతన సంవత్సరం అందరి జీవితాలలో కొత్త కాంతులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం, సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తానని మాటిస్తున్నాను. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ ఏడాది మరెన్నో అడుగులు పడాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026’ అని అన్నారు.
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: పవన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. 2026 క్యాలెండర్ ఇయర్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..
ఏపీ,తెలంగాణ మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీ