Share News

Water Crisis: కళ్లెదుటే నీరున్నా కరువే..!

ABN , Publish Date - Feb 17 , 2025 | 02:14 AM

ఇదే విషయాన్ని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న ‘ఆలిండియా స్టేట్‌ వాటర్‌ మినిస్టర్స్‌ కాన్ఫరెన్స్‌’ దృష్టికి తీసుకురానుంది.

Water Crisis: కళ్లెదుటే నీరున్నా కరువే..!

విభజన తర్వాత దిగువ రాష్ట్రంగా చాలా కోల్పోయాం

89 ప్రాజెక్టుల్లో 980 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్నా.. ఇంకా కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వలేక పోతున్నాం

పోలవరం, బనకచర్లతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం

ఆలిండియా వాటర్‌ మినిస్టర్స్‌ కాన్ఫరెన్స్‌’లో గళం విప్పనున్న ఏపీ

ఉదయ్‌పూర్‌ వేదికగా రేపు, ఎల్లుండి సదస్సు

అమరావతి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): కళ్లెదుటే నీరున్నా.. తమది కరువు పరిస్థితేనని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న ‘ఆలిండియా స్టేట్‌ వాటర్‌ మినిస్టర్స్‌ కాన్ఫరెన్స్‌’ దృష్టికి తీసుకురానుంది. ‘2047 నాటికి నీటి సురక్షిత దేశంగా భారత్‌’ అనే థీమ్‌తో రెండు రోజులపాటు సాగే ఈ జాతీయ స్థాయి సదస్సు మంగళవారం మొదలవుతుంది. ఆఖరి రోజైన బుధవారం రాష్ట్రం తరఫున నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనతో మిగిలిన విభాగాల తరహాలోనే జలాల్లోనూ తీవ్రంగా నష్టపోయామని కేంద్రం దృష్టికి తీసుకురానున్నారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల ఎకరాలకు నీరందించే వీలున్నా.. రెండు కోట్ల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించగలుగుతున్నామని, మరో కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు కృషి చేస్తున్నామని వివరించనున్నారు. రాష్ట్రంలో 89 ప్రాజెక్టుల్లో 980 టీఎంసీల జలాలను నిల్వ చేస్తున్నామని.. భూగర్భ జలాలను పెంచే విధానాలను అమలు చేస్తున్నామని చెప్పనున్నారు. ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో కృష్ణా, గోదావరి జలాల నిల్వలు ఉన్నా.. దిగువ రాష్ట్రంగా ఏపీకి వచ్చేసరికి జలాల కొరత కనిపిస్తోందని వివరించనున్నారు. రాష్ట్రానికి కరువు, వరదలు కూడా ఎక్కువేనని.. అతివృష్టి, అనావృష్టిలతో తరచూ తీవ్రంగా నష్టపోతున్నామని కేంద్రం దృష్టికి తీసుకురానున్నారు. రాష్ట్రంలో సాగునీటి పారుదలను పెంచేలా పోలవరం ప్రాజెక్టు, గోదావరి-కృష్ణా నదుల అనుసంధాన పథకం బనకచర్లను పూర్తి చేస్తామని చెప్పనున్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా గోదావరి జలాలను తరలిస్తామని, రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలను పూర్తిగా తరలించి కరువు సీమను సస్యశ్యామలం చేసేలా కార్యాచరణను రూపొందిస్తున్నామని వివరించనున్నారు.


Also Read:

గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..

భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..

For More National News and Telugu News..

Updated Date - Feb 17 , 2025 | 02:14 AM