Share News

Kadapa Hills: కడప కొండల్లో ఆదిమానవుని ఆనవాళ్లు

ABN , Publish Date - Mar 02 , 2025 | 04:20 AM

కడప కొండల్లో ఆదిమానవుని ఆనవాళ్లు లభించాయి. క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో జీవించిన మనిషి ఎలా ఉండేవాడు? ఏం తిన్నాడు? ఎలా తిన్నాడు? ఎక్కడ నివసించాడు?

 Kadapa Hills: కడప కొండల్లో ఆదిమానవుని ఆనవాళ్లు

  • లంకమల కొండల్లో ఆవాసాలు

  • జంతువులను కాల్చి తిన్న ఆధారాలు

  • తెలుపు, ఎరుపు, నలుపు వర్ణ రేఖా చిత్రాలు

  • మూడు రోజులుగా అభయారణ్యంలో పురావస్తు శాఖ సర్వే

రాయచోటి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): కడప కొండల్లో ఆదిమానవుని ఆనవాళ్లు లభించాయి. క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో జీవించిన మనిషి ఎలా ఉండేవాడు? ఏం తిన్నాడు? ఎలా తిన్నాడు? ఎక్కడ నివసించాడు? తన భావోద్వేగాలను ఎలా పంచుకున్నాడు? వంటి ప్రశ్నలకు అక్కడ దొరికిన రేఖా చిత్రాలు సమాధానాలుగా నిలిస్తున్నాయి. కడప జిల్లా బద్వేలు, సిద్దవటం, మైదుకూరు పరిధిలోని లంకమల అభయారణ్యంలోని కొండల్లో వేల సంవత్సరాల నాటి ఎన్నో చారిత్రక వింతలు, విశేషాలు బయటపడుతున్నాయి. పురావస్తు శాఖ పరిశోధనల్లో నిష్ణాతులైన మునిరత్నం రెడ్డి, యేసుబాబు ఆధ్వర్యంలో గురువారం నుంచి లంమల అడవుల్లో ఓ బృందం పర్యటిస్తోంది. దీనిలో యేసుబాబు బృందం ఆదిమానవుడు ఇక్కడ జీవించినట్లు పలు ఆధారాలను సేకరించింది. మల్లుగాని బండ (గవి) వద్ద రాతియుగం నాటి ఆదిమానవుడు గీసిన జంతువులు, మనుషులను పోలిన కొన్ని రేఖా చిత్రాలను గుర్తించారు. బండిగాని సెల వద్ద ఉన్న ఒక గుహలో ఆదిమానవుని ఆవాసాలు, రే ఖాచిత్రాలు ఉన్నాయి. తెలుపు రంగుతో గీసిన రేఖా చిత్రాల్లో అడవి జంతువులు, ఆహార వ్యవహారాలకు సంబంధించినవి ఉన్నాయి. ఎరుపు రంగుతో వేసిన బొమ్మల్లో గుర్రం, రాజు, సైన్యం, ఖడ్గం వంటి ఆయుధాలు, ఆవులు, ఆవులను కోసే వాళ్లు ఇలాంటి నాగరిక జీవన ప్రమాణ అంశాలు ఉన్నాయి.


ఇక్కడ శివలింగం, త ప్పెట్లు, డోలుతో ఊరేగింపుగా వెళుతున్నట్లు, కొరడా పట్టుకుని పోతురాజులాగా ఉన్న రేఖాచిత్రాలను గమనిస్తే.. ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక కోణంలో పరిశోధనకు అవకాశాలు కనిపిస్తాయి. కాగా, పురావస్తు శాఖ అధికారి యేసుబాబు తమ మూడవ రోజు పర్యటన వివరాలను ఆంధ్రజ్యోతికి వివరించారు. ‘మూడు రాతి స్థావరాల్లో ఒకదానిలో రేఖాచిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలలో ముఖ్యంగా మనుషుల, జంతువుల రేఖాచిత్రాలున్నాయి. సహజసిద్ధంగా ఏర్పడిన రాతి గుహలలో ఆదిమ మానవులు సంచార జీవులుగా నివసించే వాళ్లు. ఇక్కడ నీటి వసతి ఉండడంతో.. జంతువులను వేటాడి జీవించే వాళ్లు. వేటాడిన జంతువులను కాల్చుకుని తిన్నారు అనడానికి ఇక్కడ ఆదిమానవుని కాలం నాటి బొగ్గులు దొరికాయి’ అని వివరించారు.

Updated Date - Mar 02 , 2025 | 04:20 AM