CORPORATION : బడ్జెట్ అంశంతోనే సరిపెడతారా..?
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:42 PM
కేవలం బడ్జెట్ అంశంతోనే కౌన్సిల్ సమావేశం జరుగుతుందా...? మరి కొన్ని అంశాలపైనా చర్చ నడుస్తుందా...? అనేది చర్చనీయాంశంగా మారింది. నగర పాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో సోమవారం బడ్జెట్ అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత పాలకవర్గం ప్రతి ఏటా బడ్జెట్ అంశంపైనే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, సభ్యులు వివిధ అంశాలపై ప్రశ్నించేవారు.

- వివాదం రేపుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నామకరణం
- ఎమ్మెల్యే వర్సెస్ మేయర్..?
- అందరి చూపు వారి పైనే
- నేడు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం
అనంతపురం క్రైం, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కేవలం బడ్జెట్ అంశంతోనే కౌన్సిల్ సమావేశం జరుగుతుందా...? మరి కొన్ని అంశాలపైనా చర్చ నడుస్తుందా...? అనేది చర్చనీయాంశంగా మారింది. నగర పాలక సంస్థ కార్యాలయం కౌన్సిల్ హాల్‌లో సోమవారం బడ్జెట్ అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుత పాలకవర్గం ప్రతి ఏటా బడ్జెట్ అంశంపైనే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, సభ్యులు వివిధ అంశాలపై ప్రశ్నించేవారు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన నిధులు మొదలుకొని పారిశుధ్యం పనుల వరకు చర్చ నడు స్తూ వచ్చేది. ఈ క్రమంలో సోమవారం నిర్వహించే కౌన్సిల్ సమావేశం ఎలా నడుస్తుందనే విషయం ఆసక్తి కరంగా మారింది. గత వారంలో రూ. 135 కోట్లతో బడ్జెట్ అంశంపై ఐదుగురితో స్టాండింగ్ కమిటీలో ఆమోదం తెలిపారు. ప్రస్తుత పాలవకర్గం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో పలు అంశాలపైనే చర్చ నడిస్తే సభ్యుల మధ్య తలెత్తే వాగ్వా దంతో సమావేశం మరింత వాడివేడిగా సాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
వివాదం రేపుతున్న బ్రిడ్జి నామకరణం
నగరంలోని బళ్లారి బైపాస్ నుంచి పంగల్‌రోడ్డు వరకు 9.2 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మించారు. అందులో భాగంగా టవర్‌క్లాక్ ఎదుట ఫ్లైఓవర్‌ను మార్చి కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జికి ఇంకా పేరు పెట్టనే లేదు. కొంతకాలంగా ఈ బ్రిడ్జి పేరు విషయంలో తమ హయాంలోనే నిర్మించామని తాము నిర్ణయించిన పేరునే పెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అదే క్రమంలో మరో పేరును పెట్టాలని టీడీపీ కొంతకాలంగా తన గళం వినిపిస్తోంది. ఇక పలు ప్రజా సంఘాలు కొత్త పేర్లను ప్రతిపాదిస్తున్నాయి. ఈ విషయంలో ఇదివరకే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు అనేకసార్లు వినతులందాయి. ప్రస్తుతం ఈ బ్రిడ్జి పేరుపై సమావేశంలో తీర్మాణం చేయాలనే చర్చ నడుస్తోందట. మరి సమావేశంలో అదే అంశంపైనే చర్చ నడిస్తే వాదోపవాదాలు, చర్చోపచర్చలు బ్రిడ్జి చుట్టూనే నడుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అందరి దృష్టి ఆ ప్రజాప్రతినిధులపైనే..
ఒకరు అనంతపురం నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధి. మరొకాయన ప్రస్తుత పాలకవర్గంలో ముఖ్య ప్రజాప్రతినిధి. వీరిద్దరూ కొంతకాలంగా పరస్పర ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి వచ్చింది. ఇందుకు ముఖ్యకారణం డంపింగ్‌యార్డు బిల్లు. గుత్తి రోడ్డులోని డంప్‌యార్డులో బయో మైనింగ్ పేరుతో వైసీపీ హయాంలో రూ. 26 కోట్లతో ప్రాజెక్టు నడిచింది. పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు నివేదించా రని, కొంత శాతం బిల్లు చేశారనే ఆరోపణలున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో రూ. 5కోట్లు వరకు, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో రూ. 4కోట్లకు బిల్లు అయింది. వాటిని ఎలా చేశారనే అంశంపైనా గత కౌన్సిల్ సమావేశాల్లో చర్చ నడిచింది. అవినీతి జరిగిందని ఎమ్మెల్యే దగ్గు పాటి ప్రసాద్ ప్రస్తావించగా, జరగలేదని అవసరమైతే విచారణ చేయిం చాలని మేయర్ మహమ్మద్ వసీం చెప్పుకొచ్చారు. తాజాగా అదే అంశంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. కౌన్సిల్ సమావేశంలో మరోసారి ఆ అంశం చర్చకు వస్తే ఏం జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక నగరంలో అనేక సమస్యలపైనా సభ్యులు తమ గళం వినిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు సమావేశం జరిగినా, పారిశుధ్యంపైన చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు కార్పొరేటర్లు చెప్పుకొచ్చే పరిస్థితి ఉంది. దీంతో సమావేశం ఎలా నడుస్తుందో..? వేచి చూడాల్సిందే.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....