Share News

COLONY: వృథా కాలనీ

ABN , Publish Date - Nov 17 , 2025 | 12:05 AM

వైసీపీ హయాంలో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా వృథా చేశారనేందుకు నిదర్శనమే ఈ జగనన్న కాలనీ. అధికారులు, ప్రజాప్రతినిధులు అనాలోచిత నిర్ణయాలతో జగనన్న కాలనీ అడవిని తలపిస్తోంది. తనకల్లు మేజర్‌ పంచాయతీ పరిధిలోని 30 పల్లెల లబ్ధిదారులకు జగనన్న కాలనీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో 140 మందికి పట్టాలు ఇచ్చారు.

COLONY: వృథా కాలనీ
Kampuchets grown in Jaganna Colony

- ఊరికి 3 కి.మీ. దూరంలో 140 మందికి పట్టాలు

- భూమి చదును చేయడానికే రూ.30 లక్షలు

- విద్యుత స్తంభాలు ఏర్పాటు

- ఆసక్తి చూపని జనం.. ఒక్కరే నివాసం

తనకల్లు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా వృథా చేశారనేందుకు నిదర్శనమే ఈ జగనన్న కాలనీ. అధికారులు, ప్రజాప్రతినిధులు అనాలోచిత నిర్ణయాలతో జగనన్న కాలనీ అడవిని తలపిస్తోంది. తనకల్లు మేజర్‌ పంచాయతీ పరిధిలోని 30 పల్లెల లబ్ధిదారులకు జగనన్న కాలనీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో 140 మందికి పట్టాలు ఇచ్చారు. మేజర్‌ పంచాయతీకి సమీపంలో కాకుండా.. బత్తినవారిపల్లి వద్ద జగనన్నకాలనీ పేరుతో ప్రభుత్వ భూమిని ఎంపిక చేశారు. ఆ భూమిని చదును చేయడానికి రూ.30లక్షలకు పైగా ఖర్చు చేశారు. అదనంగా కాలనీకి విద్యుత స్తంభాలు ఏర్పాటు చేసి, హడావుడిగా లైన్లు లాగారు. రోడ్లు, తాగునీరు తదితర సౌకర్యాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తనకల్లుకు మూడు కిలో మీటర్ల దూరంలో కాలనీ ఏర్పాటు చేయడంతో.. అక్కడికి వెళ్లడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. అధికారులు పక్కాగృహాలు మంజూరు చేస్తాం, మౌలిక వసతులు కల్పిస్తామని ప్రగల్భాలు పలకడంతో ధైర్యం చేసి కొందరు ముందుకొచ్చారు. దీంతో ప్రభుత్వం నలుగురికి పక్కాగృహాలు మంజూరు చేసింది. వారు నలుగురు గోడల వరకు ఇంటి నిర్మాణం చేపట్టారు. నిరుపేదలైన ఇద్దరు మహిళలు మాత్రం ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. మిగిలిన వారెవరూ ఆ చాయలకు వెళ్లిన పాపాన పోలేదు. దీంతో ప్రభుత్వం వెచ్చించిన రూ.30 లక్షలు, విద్యుత కోసం చేసిన ఖర్చు వృఽథా అయ్యాయి. పట్టాలు పొందినవారు ఇళ్లు నిర్మించుకోవాలని అధికారులు ఎన్నిసార్లు చెప్పినా లబ్ధిదారులు ముందుకు రావడంలేదు.


దీంతో కాలనీ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతం కంపచెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. పనికిరాని భూమిని ఎంపిక చేయడంతోనే వృథాగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

12 చోట్లా ఇదే స్థితి

తనకల్లు మండల వ్యాప్తంగా జగనన్నకాలనీల పేరుతో 12 చోట్ల ప్రభుత్వ భూమిని ఎంపిక చేసి చదును చేశారు. ఇందుకోసం రూ.55 లక్షలు ఖర్చు చేశారు. 345 మందికి పట్టాలు ఇచ్చారు. 146 గృహాలు మంజూరు చేశారు. ఒక్కచోటకూడా ఒక్క కాలనీ ఏర్పాటు కాలేదు. జగనన్న కాలనీలో ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఎవరూ నివాసాలు లేరని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతో చదును చేయడానికి ఉపయోగించిన రూ.55 లక్షల ప్రభుత్వ ధనం వృఽథా అయినట్లేనని తెలుస్తోంది.

ఒంటిరిగా నివాసం ఉంటున్నా

- ఈశ్వరమ్మ, జగనన్నకాలనీ, బత్తినవారిపల్లి

మాది తనకల్లు పంచాయతీలోని వంకపల్లి. మా గ్రామం నుంచి 8 కిలోమీటర్లు దూరంలో జగనన్న కాలనీలో నాకు పట్టా ఇచ్చారు. పక్కాగృహం మంజూరు చేశారు. కాలనీలో 140 మందికి పట్టాలిచ్చారు కదా.. అందరూ వస్తారులే అనుకుని ఇల్లు నిర్మించుకున్నా. ఏ ఒక్కరూ ఇక్కడికిరాలేదు. కాలనీ మొత్తం కంపచెట్లతో నిండిపోయింది. పాములు, విషపురుగుల సంచారం అధికంగా ఉంది. పెద్ద పెద్ద విద్యుత స్తంభాలు ఏర్పాటు చేసిన అధికారులు కనెక్షన ఇవ్వడం మరిచారు. విధిలేని పరిస్థితుల్లో నేను ఒక్కదాన్నే నివాసం ఉంటున్నాను. నీటి సౌకర్యం కూడా లేదు. బత్తినవారిపల్లిలోకి వెళ్లి నీటిని తెచ్చుకోవాలి. అధికారులు నా ఒక్క ఇంటికైనా విద్యుత సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నా.

లబ్ధిదారులు ముందుకు రాలేదు- విజయభాస్కర్‌, ఏఈ, గృహనిర్మాణ శాఖ

నేను తనకల్లు, నల్లచెరువు మండలాలకు ఇనచార్జ్‌గా ఉన్నాను. కదిరిలో ఉన్న సిమెంటు గోడౌనకు కూడా ఇనచార్జ్‌గా కొనసాగుతున్నాను. జగనన్న కాలనీల్లో 345 మందికి పట్టాలు మంజూరు చేశారు. గృహం నిర్మించుకోవడానికి ఏ ఒక్క లబ్ధిదారుడు ముందుకురాలేదు. ఒక్క కాలనీలో కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. బత్తినవారిపల్లి కాలనీలో ఓ వృద్ధురాలు నివాసం ఉన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 17 , 2025 | 12:05 AM