Students : సమస్యల గురుకులం...!
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:41 AM
మండలకేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల అసౌకర్యాలకు నిలయంగా మారింది. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం మూడో రోడ్డులో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలను భవనాల కొరతతో గార్లదిన్నెకు మార్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం నిర్మించిన భవనంలోకి 2016లో దీన్ని తరలించారు. మైనార్టీ గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రాప్తాడు సమీపంలో 6.72 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అలాగే భవన ...
వేధిస్తున్న తరగతి గదుల కొరత
ఆరు బయటే స్నానాలు, భోజనాలు
కన్నెత్తి చూడని పాలకులు, అధికారులు
ఇబ్బందుల్లో విద్యార్థులు
గార్లదిన్నె, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల అసౌకర్యాలకు నిలయంగా మారింది. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం మూడో రోడ్డులో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాలను భవనాల కొరతతో గార్లదిన్నెకు మార్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం నిర్మించిన భవనంలోకి 2016లో దీన్ని తరలించారు. మైనార్టీ గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రాప్తాడు సమీపంలో 6.72 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అలాగే భవన నిర్మాణం కోసం రూ. 17 కోట్లు మంజురు చేసింది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో నేటికీ మైనార్టీ గురుకుల పాఠశాలకు సొంత భవనం సమకూరకుండా ఉంది. ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య పెరుగుతుండ టంతో ఈ భవనం విద్యార్థులకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ప్రస్తుతం గురుకుల పాఠశాలలో సుమారు 400 పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 12 గదులు మాత్రమే ఉన్నాయి. అవి కూడా చిన్న విస్తీర్ణంతో ఉండటంతో పగలు తరగతి గదులుగా... రాత్రి పడక
గదులుగా వినియోగించుకుంటున్నారు. విద్యార్థుల సామగ్రి కూడా అదే గదులలోనే నిల్వ ఉంచడంతో గదులు పూర్తి ఇరుకుగా మారాయి. మరుగుదొడ్లు, స్నానపు గదుల కొరత తీవ్రంగా ఉంది. భోజనశాల, వంట గదులు అసలే లేవు. దీంతో విద్యార్థులు తమ అన్ని పనులను ఆరుబయటే కానిస్తున్నారు. ఇరుకు గదుల్లో ఎక్కువ మంది ఉండటం వల్ల సీజనల్ వ్యాధుల తొందరగా ప్రబలుతున్నాయి. పర్యవేక్షణకు వచ్చిన అధికారులతో సమస్యలపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎన్ని సార్లు ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం శూన్యం.
పట్టించుకోని పాలకులు, అధికారులు
మైనార్టీ గురుకుల పాఠశాలను పలుమార్లు అధికారులు, పాలకులు సందర్శించడమే తప్ప దాని అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాలను సందర్శించిన ప్రతిసారీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రగల్భాలు పలకడం తప్ప చేసిందేమీ లేదు. కూటమి ప్రభుత్వలోనైనా తమ పిల్లలకు మెరుగైన వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
అన్నీ గదులలోనే...
పాఠశాలలో సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. చదువుకునే గదులలోనే నిద్రపోతున్నాం. ఆదే గదిలోనే సామగ్రి పెట్టుకుంటున్నాం. ఒకే గదిలో చదు వు, నిద్ర, సామగ్రి అంటే ఇబ్బందిగా ఉంది. దీంతో పగలు తరగతి గది...రాత్రి పడక గదిలా గడుపుతున్నాం. ఒక్కో గదిలో 70 నుంచి 80 మంది ఉంటున్నాం.
-ఎల్లప్ప, విద్యార్థి పదో తరగతి, పత్తికొండ
గదుల కొరత తీవ్రంగా ఉంది
పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. ఈ పాఠశాలలో అన్ని సమస్యలే. చదువుకోవాలన్న, నిద్రపోవాలన్న తీవ్ర ఇబ్బందులు పడు తున్నాం. భోజనం చేసేందుకు గదిలేకపోవడంతో ఆరుబయటే తింటున్నాం. వర్షం వస్తే తడుస్తు భోజనం చేయాలి. గురుకుల పాఠశాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి సమస్యను చెబుతున్నా ఫలితం లేదు. గురుకుల పాఠశాలలో సమస్యలు పరిష్కరించి విద్యార్థుల చదువుకు సహకరించాలి.
- షెక్షా, విద్యార్థి డోన
మా సమస్య పరిష్కరించే నాథుడే లేడు
మైనార్టీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే నాథుడే లేడు. ఐదో తరగతి నుంచి మైనార్టీ గురుకుల పాఠశాలలోనే చదువుకుంటున్నాం. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నా. అధికారులు, నాయకులు వస్తారు. పాఠశాలను సందర్శిస్తారు. అయితే సమస్యలను మాత్రం పరిష్కరించిన పాపన పోలేదు. అధికా రులు, నాయకులు స్పందించి మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. - హరివాజ్ విద్యార్థి
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మైనార్టీ గురుకుల పాఠశాలలో తరగతి గదుల కొరత ఉన్న విషయం వాస్తమే. విద్యార్థులకు భవనం సరిపోవడంలేదు. భనవంలో 12 గదు లు మాత్రమే ఉన్నాయి. గదుల కొరత ఉన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఇటీవలే 6 బాతురూంలు నిర్మించాం. ఒక స్టేజ్ నిర్మించాం. మైనార్టీ గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే పరిష్కరిస్తామంటున్నారు.
-ఆంజనేయులునాయక్, ప్రిన్సిపాల్, మైనార్టీ గురుకుల పాఠశాల
మరిన్ని అనంతపురం వార్తల కోసం..