బంగారు తల్లికి ఉప్పు నీరే గతి..!
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:51 AM
మా స్కూల్‌లో తాగడానికి మంచి నీళ్లు లేవు. చేతులు, ప్లేట్లు కడుక్కునే నీటినే తాగుతున్నాం. కొన్ని నెలల నుంచి ఈ ఉప్పు నీరు తాగలేక ఇబ్బంది పడుతున్నాం. మీరైనా మాకు మంచి నీరు వచ్చేలా చూడండి. కానీ మా ఫొటోలను పేపర్లో వేయొద్దు..! మా మేడమ్ వాళ్లు.. సార్ వాళ్లు చూస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారు..’’ ‘‘ఇంటి నుంచి.. హాస్టల్ నుం...
ప్లేట్లు కడిగే నీటిని తాగుతున్న బాలికలు
కేఎస్‌ఆర్ బాలికోన్నత పాఠశాలలో దుస్థితి
1,418 మంది విద్యార్థినులకు నిత్యం నరకం
ఆరు నెలల క్రితం చెడిపోయిన ఆర్వో ప్లాంట్
మరమ్మతులు చేయని ఏజెన్సీ.. పట్టించుకోని అధికారులు
‘‘అంకుల్..!
మా స్కూల్‌లో తాగడానికి మంచి నీళ్లు లేవు. చేతులు, ప్లేట్లు కడుక్కునే నీటినే తాగుతున్నాం. కొన్ని నెలల నుంచి ఈ ఉప్పు నీరు తాగలేక ఇబ్బంది పడుతున్నాం. మీరైనా మాకు మంచి నీరు వచ్చేలా చూడండి. కానీ మా ఫొటోలను పేపర్లో వేయొద్దు..! మా మేడమ్ వాళ్లు.. సార్ వాళ్లు చూస్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారు..’’
‘‘ఇంటి నుంచి.. హాస్టల్ నుంచి వాటర్ బాటిల్‌లో నీళ్లు తెచ్చుకుంటాం. ఎప్పుడైనా మరిచిపోతే ఫ్రెండ్స్‌ను అడిగి తాగుతాం. వాళ్లు ఇవ్వకుంటే ఉప్పు నీళ్లే తాగుతాం..! లేదంటే సాయంతం ఇంటికో, హాస్టల్‌కో వెళ్లాక నీళ్లు తాగుతాం. అప్పటిదాకా దప్పికతో ఇబ్బంది పడక తప్పడం లేదు. ఉప్పు నీళ్లు తాగినా దాహం తీరడంలేదు..’’
ఇదీ.. బాలికల ఆవేదన
అనంతపురం నగర నడిబొడ్డున ఉన్న కేఎస్‌ఆర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులకు నీటి కష్టం వచ్చింది. పాఠశాలను ‘ఆంధ్రజ్యోతి’ శనివారం విజిట్ చేసింది. అక్కడి బాలికలు గుక్కెడు నీటికోసం అల్లాడిపోతున్న దృశ్యం కళ్లకు కట్టింది. బాలికలు ఉదయం బడికి వస్తే.. సాయంత్రం వరకూ లోపలే ఉండిపోతారు. ఆరు నెలల క్రితం బడిలో ఉన్న వాటర్ ప్లాంట్ చెడిపోయింది. అప్పటి నుంచి చేతులు, ప్లేట్లు శుభ్రం చేసుకునే నీటితోనే దాహం తీర్చుకుంటున్నారు. నాడు-నేడు పథకం కింద 2022-23లో ఈ పాఠశాలకు వాటర్ ప్లాంట్ ఇచ్చారు. అంత మంది విద్యార్థినులకు ఈ ఒక్క ప్లాంట్ నీరు సరిపడేది కాదు. అయినా క్రమశిక్షణతో సర్దుకుపోయేవారు. ఆ ఒక్కటి కూడా ఆరు నెలల క్రితం చెడిపోయింది. మరమ్మతు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రం నడిబొడ్డున, జిల్లా విద్యాశాఖ అధికారి కారాల్యం ఇలాంటి సమస్య నెలల తరబడి పరిష్కారం కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం.
- ఆంధ్రజ్యోతి, అనంతపురం విద్య
మంచి బడి
సప్తగిరి సర్కిల్‌లో ఉన్న కేఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చాలా మంచి పేరు ఉంది. అందుకే ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలకు పంపలేనివారు తమ బిడ్డలను ఇక్కడ చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. నగరంలోని బాలికలు ఇళ్ల వద్ద నుంచి, దూర ప్రాంతాలవారు హాస్టళ్ల నుంచి ఈ బడికి వచ్చి వెళతారు. నగరం చుట్టుపక్కల మండల కేంద్రాలు, గ్రామాల నుంచి వందలాది మంది బాలికలు బస్సులు, ఆటోలలో వస్తుంటారు. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకూ ఏకంగా 1,418 మంది బాలికలు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషనలను పరిశీలిస్తే.. ఒక మండలంలోని అన్ని పాఠశాలల్లో కలిపి కూడా ఇంత మంది ఉండరు. ఉత్తమ విద్యను అందిస్తూ, తల్లిదండ్రుల నమ్మకం సంపాదించుకున్న ఇలాంటి పాఠశాలలో సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడం దారుణం.
నిధులిచ్చినా.. నిర్లక్ష్యం
కేఎ్‌సఆర్ పాఠశాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.6 లక్షలు ఇచ్చారు. నిధులు ఇచ్చి నెలలు గడిచినా కొత్త ప్లాంట్ ఏర్పాటు కాలేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాగునీటి సమస్య తీవ్రం కావడంతో ఆ మాత్రం పనులైనా చేశారని తెలుస్తోంది. పట్టుమని పది మంది విద్యార్థులు లేని పాఠశాలల్లో ఏవేవో పనులు చేయిస్తుంటారు. ఇలాంటి చోట చిన్నపాటి సమస్యను పరిష్కరించకుండా, బాలికల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.
నీరు తాగకపోతే..
నీరు తాగకపోతే ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. డీ హైడ్రేషన కారణంగా ప్రాణాపాయం తలెత్తుతుంది. జీర్ణక్రియ సమస్యలు, తల తిరగడం, చర్మ సమస్యలు, అలసట.. ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇక బోరు నుంచి నేరుగా వచ్చే నీటిలో ఫ్లోరైడ్ సహా అనేక హానికారక పదార్థాలు ఉంటాయి. ఫ్లోరైట్ నీటిని తాగితే దంతాలు, ఎముకల సమస్య తలెత్తుతుంది. ఫ్లోరోసిస్ వ్యాధిబారిన పడే ప్రమాదం ఉంటుంది. బడికి వెళ్లే బాలలకు నీరు తాగే సమయం ఉండదు. చదువుల ఒత్తిడో ఉండి చాలామంది నీరు తాగకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఈ సమస్యలను గుర్తించిన ప్రభుత్వం, గతంలో బడిలో ‘వాటర్ బెల్’ను అమలు చేసింది. తాగునీటికి ఇంత ప్రాధాన్యం ఉంది. అలాంటిది తాగుదామంటే చుక్క నీరు దొరకని పరిస్థితి నెలల తరబడి కొనసాగటం ఏమిటి..?
చొరవ చూపాలి కదా..!
తాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించేదాకా ప్రత్యామ్నాయం గురించైనా ఉపాధ్యాయులు ఆలోచించాల్సింది. నగరంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, స్వచ్ఛంద సేవకులు ఉన్నారు. అలాంటివారిని అడిగితే కావాల్సినన్ని శుద్ధ జలం ట్యాంకర్లను నిత్యం బడికి తీసుకువెళ్లి నిలుపుతారు. కానీ ఆ మాత్రం చొరవ చూపేవారేరీ..? బడి అంటే.. చదువొక్కటే కాదు. ఈ విషయాన్ని గురువులు అర్థం చేసుకోవాలి.
ఏజెన్సీ పట్టించుకోవడం లేదు..
ఆర్వో ప్లాంట్ చెడిపోయింది. మరమ్మతు చేయాలని ఏజెన్సీకి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ ప్లాంట్‌తో సంబంధం లేదని అంటున్నారు. కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రూ.6 లక్షలు ఇచ్చారు. పనులు ముగింపు దశకు వచ్చాయి. దసరా సెలవులు ముగిసేలోగా సమస్యను పరిష్కరిస్తాం.
- బాలకృష్ణుడు, హెచఎం