Free Bus : రైట్.. రైట్..
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:43 AM
మహిళలు ఎదురుచూసిన వేళ రానే వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తికి ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకారం చుట్టనుంది. సాయంత్రం 5 గంటల నుంచి పథకాన్ని అమలు చేసేందుకు అనంత ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పల్లె వెలుగు, అల్ర్టా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అనుమతించనున్నారు. ఆ మేరకు మహిళలు ...
‘స్త్రీ శక్తి’కి శ్రీకారం నేడే
ఉచిత బస్సు ప్రయాణం అమలుకు అనంత ఆర్టీసీ సన్నద్ధం
మహిళల్లో హర్షాతిరేకాలు
అనంతపురం టౌన, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మహిళలు ఎదురుచూసిన వేళ రానే వచ్చింది. ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీ శక్తికి ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకారం చుట్టనుంది. సాయంత్రం 5 గంటల నుంచి పథకాన్ని అమలు చేసేందుకు అనంత ఆర్టీసీ అధికారులు సిద్ధమయ్యారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పల్లె వెలుగు, అల్ర్టా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అనుమతించనున్నారు. ఆ మేరకు మహిళలు నిర్దేశించిన బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణ వసతి పొందాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత ప్రయాణ పథకం ఎంతోమంది మహిళలకు ప్రయోజనకరంగా మారనుంది. బాలికలు మొదలుకుని వృద్ధులు, ట్రాన్సజెండర్లకు సైతం వయోపరిమితి లేకుండా స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణ వసతి కలగనుంది. రోజూ ఉద్యోగాలకు ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చేవారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలకు సైతం చార్జీల భారం తప్పనుంది. ఓటరు కార్డుగానీ, ఆధార్ కార్డుగానీ చూపించి బస్సుల్లో ఉచితంగా
ప్రయాణించవచ్చు. సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో పురుషులు 60శాతం, మహిళలు 40 శాతం ఉంటోంది. శుక్రవారం నుంచి అమలయ్యే పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.
అనంత ఆర్టీసీ సన్నద్ధం
స్త్రీ శక్తి పథకం అమలుకు అనంతపురం రీజియన ఆర్టీసీ అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసినప్పటి నుంచే పథకం అమలుకు సంబంధించిన చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు. స్త్రీ శక్తి పథకానికి వినియోగించే పల్లె వెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల కండీషనను పరిశీలించడంతోపాటు లైట్లు, టైర్లు అవసరమైన వాటికి ఏర్పాటు చేయించారు. బస్సుల్లో మహిళలకు టిక్కెట్ జారీ చేసే విధానంపైనా డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక తరగతుల ద్వారా శిక్షణ కల్పించారు. శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పథకాన్ని ప్రారంభించిన తరువాత అనంతపురం డిపోలో ఇక్కడి ప్రజాప్రతినిధులచే పథకాన్ని ప్రారంభింపజేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
అన్నిరకాల చర్యలు చేపట్టాం...
స్త్రీశక్తి పథకం అమలులో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను కండీషనలో ఉంచడంతోపాటు సిబ్బందికి అవగాహన కల్పించాం. ప్రయాణికుల పట్ల మర్యాదపూర్వకంగా వర్తించేలా సూచించాం. పథకం ప్రారంభమయ్యాక మహిళా ప్రయాణికుల రద్దీ పెరగడంతోపాటు బస్సుల్లో గందరగోళం ఏర్పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పథకం గురించి మహిళలకు అవగాహన కలిగేలా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
- నాగభూపాల్, ఆర్టీసీ అనంతపురం డీఎం
మహిళలకు ఆర్థిక చేయూత...
స్త్రీ శక్తి పథకం అమలుతో రాష్ట్రంలో మహిళలు ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కలిగింది. తద్వారా చార్జీల భారం తగ్గి మహిళలకు ఆర్థిక చేయూత లభిస్తుంది. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుందనడానికి సూపర్ సిక్స్ అమలు చేస్తుండడమే నిదర్శనం.
- పూల నాగరాజు, ఆర్టీసీ జోనల్ చైర్మన
మరిన్ని అనంతపురం వార్తల కోసం...