CROP: రైతు కష్టం వానపాలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 12:47 AM
అప్పులు చేసి, ఆరుగాలం కష్టపడి పండించిన పంట మూడురోజులు గా కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి ముద్ద అయింది. వేరు శనగకాయలతో పాటు పశువుల మేత కూడా నల్లగామారి ఆ రైతును నిండాముంచింది. మండలంలోని దర్శినమల గ్రామానికి చెందిన రైతు నారాయణ, లక్ష్మీనారాయణమ్మ కుటుంబం నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని బోరుబా వి కింద వేరుశనగను పంట సాగుచేశారు.
ధర్మవరం రూరల్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): అప్పులు చేసి, ఆరుగాలం కష్టపడి పండించిన పంట మూడురోజులు గా కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి ముద్ద అయింది. వేరు శనగకాయలతో పాటు పశువుల మేత కూడా నల్లగామారి ఆ రైతును నిండాముంచింది. మండలంలోని దర్శినమల గ్రామానికి చెందిన రైతు నారాయణ, లక్ష్మీనారాయణమ్మ కుటుంబం నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని బోరుబా వి కింద వేరుశనగను పంట సాగుచేశారు. పంట సాగు కోసం సుమారు రూ. 2లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. పంటకు రాత్రింబవళ్లు నీటి తడుపులు, రసాయనిక మందులు ఖర్చు, కూలీల ఖర్చులకు పెట్టుబడి పెట్టాడు. నాలుగు నెలలు పూర్తికాగానే దిగుబడి రావడంతో పంటను తొలగించారు. తొలగించిన రాత్రి నుంచే వర్షం కురవడంతో పంటంతా తోటలోనే తడిసి ముద్ద అయి కుళ్లిపోయింది. దీంతో ఏమిచేయ లేక ఆ రైతు కుటుంబం బోరుమని విలపించింది. కౌలుకు తీసుకుని పంటను సాగుచేశామని, రేయింబవళ్లు చేను దగ్గరే పడికాపులు కాచి పండించుకున్నా... తీరా పంట చేతికొచ్చేసమయంలో వాన వచ్చి చేతికందకుండా పోయిందని ఆ రైతుకుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఏడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా చేతికొచ్చిన పంటలు నష్టపోవడంతో అప్పులపాల వుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.