Re-verification : సదరం.. బేరం..!
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:40 AM
దివ్యాంగ పింఛనదారుల్లో అనర్హులను ఏరి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కొందరు వైద్యులకు కాసులు కురిపిస్తోంది. దివ్యాంగ సర్టిఫికెట్ల రీవెరిఫికేషనలో కాసులు పిండుకుంటున్నారు. పింఛన లబ్ధిదారుల నుంచి వేల రూపాయలు గుంజుతున్నారు. ఎంత ఎక్కువ డబ్బు ఇస్తే.. వైకల్యం లేకున్నా కోరినంత పర్సెంటేజీ నమోదు చేస్తున్నారు. ...
దివ్యాంగ సర్టిఫికెట్ల రీవెరిఫికేషనలో కాసుల వేట
కాసులిచ్చుకున్న వారికి అధిక శాతం
లేదంటే.. అర్హులకూ అన్యాయం
పోలియో బాధితులకూ వైకల్య శాతం తగ్గింపు
సర్టిఫికెట్లు రద్దు
శింగనమల/పుట్లూరు, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): దివ్యాంగ పింఛనదారుల్లో అనర్హులను ఏరి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కొందరు వైద్యులకు కాసులు కురిపిస్తోంది. దివ్యాంగ సర్టిఫికెట్ల రీవెరిఫికేషనలో కాసులు పిండుకుంటున్నారు. పింఛన లబ్ధిదారుల నుంచి వేల రూపాయలు గుంజుతున్నారు. ఎంత ఎక్కువ డబ్బు ఇస్తే.. వైకల్యం లేకున్నా కోరినంత పర్సెంటేజీ నమోదు చేస్తున్నారు. ఏళ్లుగా పింఛన తీసుకుంటున్న అర్హులైన దివ్యాంగులు కాసులు ఇచ్చుకోకపోవడంతో అడ్డగోలుగా అనర్హులని తేల్చారు. వారి సర్టిఫికెట్లను రద్దు చేశారు. పోలియో బారినపడిన వారివీ రిజెక్ట్
చేయడంతో బాధితులు అవాక్కవుతున్నారు. వైద్యులు ఇంత స్థాయిలో దందా సాగిస్తున్నా.. ఉన్నతాధికారులు కళ్లు మూసుకోవడం విమర్శలకు తావిస్తోంది. కొందరు దళారీల అవతారమెత్తి వసూళ్లు చేసి, వైద్యులకు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు
వైసీపీ హయాంలో పింఛన్ల మంజూరులో విచ్చలవిడిగా వ్యవహరించారన్నది బహిరంగ రహస్యమే. అర్హతతో సంబంధం లేకుండా ఆ పార్టీ నాయకులు చెప్పిన వారికే పింఛన్లు మంజూరు చేశారు. ఆ అక్రమాలకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టాలనుకుంది. అనర్హ దివ్యాంగ పింఛన్లు తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రీవెరిఫికేషనకు ఆదేశించింది. ప్రత్యేక సదరం శిబిరాలు నిర్వహిస్తూ.. వైద్యులతో సర్టిఫికెట్ల వెరిఫికేషన చేయిస్తోంది. అనర్హుల పింఛన్లు తొలగించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కొందరు వైద్యులు తూట్లు పొడుస్తున్నారు. కాసులే పరమావధిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కాసులిస్తే అనర్హులకు వైకల్య శాతం అధికంగా నమోదు చేస్తున్నారు. కాసులివ్వని అర్హుల సర్టిఫికెట్లను ఏకంగా రద్దు చేస్తున్నారు. పోలియో బాధితులు సర్టిఫికెట్లను సైతం రద్దు చేస్తూ జాబితాను సచివాలయాలకు పంపారు. ఆ జాబితాను చూసి అర్హులు అవాక్కవుతున్నారు. కాసులివ్వలేదని దివ్యాంగులకు అన్యాయం
చేస్తారా అని జనం ఆవేదన చెందుతున్నారు. శింగనమల మండలంలో దివ్యాంగ పింఛన్లు 1203 ఉండగా.. ఏకంగా 300 వరకు అర్హుల సరిఫికెట్లను రద్దు చేసినట్లు సమాచారం.
మధ్యవర్తుల ద్వారా వసూళ్లు
దివ్యాంగ సర్టిఫికెట్ల రీవెరిఫికేషనలో కొందరు దళారీల అవతారమెత్తారు. డబ్బులు వసూలు చేసి, ఆ మేరకు దివ్యాంగ శాతం వేయించారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పుట్లూరు మండలంలో ఇద్దరు ఆర్‌ఎంపీలు పింఛనదారులకు సదరం సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు వసూలు చేసి, మండలవ్యాప్తంగా వందల సంఖ్యలో సదరం సర్టిఫికెట్లు ఇప్పించారని తెలుస్తోంది. ఆ ఇద్దరు ఆర్‌ఎంపీలకు.. కొందరు ప్రభుత్వ వైద్యులతో పరిచయాలు ఉండడంతోనే ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. శాతానికి ఇంత సొమ్ము అంటూ ధరలు నిర్ణయించి, వసూలు చేస్తున్నారు. వైకల్యం 60శాతం నమోదు చేయాలంటే రూ.20 వేలు, 70శాతానికి రూ.30వేలు, 80 శాతానికి రూ.40వేలు వసూలు చేస్తున్నారు. పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి ప్రభుత్వం పింఛన రూ.15వేలు ఇస్తుండడంతో వీరికి సర్టిఫికెట్ ఇప్పించాలంటే రూ.50వేల నుంచి 70వేల వరకు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ గ్రామంలో ఏకంగా లక్షరూపాయల మేర ముట్టజెప్పారని తెలుస్తోంది. సుమారు 15 గ్రామాల్లో వీరు వైద్యం చేయడానికి వెళుతూ ఎవరికి పింఛనరాలేదంటూ ఆరాతీస్తున్నారు. వారి వివరాలను తీసుకుని సదరం సర్టిఫికెట్ కోసం ఆర్‌ఎంపీలే స్వయంగా దరఖాస్తు చేస్తున్నారు. అధిక శాతం అనర్హులకే చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఆర్‌ఎంపీలకు డిమాండ్ పెరిగిందని ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు. వారి వద్దకు క్యూ కడుతున్నారని మండలంలో చర్చించుకుంటున్నారు. గతంలో ఓ ఆర్‌ఎంపీపై ఇలాంటి ఆరోపణలు రావడంతో వైద్యశాఖ అధికారులు అతడిపై నివేదికలు పంపినా చర్యలు శూన్యం. దీంతో ఆర్‌ఎంపీలు పేట్రేగిపోతున్నారు.
కన్ను లేకున్నా..
సొదనపల్లి గ్రామానికి చెందిన సి అంజనమ్మకు ఒక కన్ను లేకపోవడంతో సదరం క్యాంపులో అప్పట్లో వైద్యులు 43 శాతం పర్సెంటేజీతో ధ్రువీకరణ పత్రం ఇచ్చారు 8 ఏళ్లుగా సోదనపల్లి సచివాలయంలో ఐడి నంబర్ 112636338తో పింఛన తీసుకుటున్నా. నా కొడుకు అనంతపురంలో వెరిఫికేషన శిబిరానికి తీసుకెళ్లాడు. నా దివ్యాంగ ధ్రువీకరణ పత్రం రద్దు చేసినట్లు రెండు రోజుల క్రితం సచివాలయానికి జాబితా వచ్చింది. దీంతో ఇక పింఛన రాదని కొందరు చెబుతున్నారు. కన్ను లేదు.. నా సర్టిఫికెట్ ఎలా రద్దు చేస్తారు?
- సి.అంజినమ్మ, అంధురాలు, సోదనపల్లి
కోర్టును అశ్రయిస్తా
నేను పుట్టుకతోనే పోలియో బాధితుడిని 20 ఏళ్ల క్రితం వైద్యులు పరీక్షించి, 76 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అప్పటి నుంచి దివ్యాంగ పింఛన తీసుకుంటున్నా. ఇటీవల సదరం వెరిఫికేషన పేరుతో శింగనమల ఆస్పత్రికి వెళ్లా. వైద్యుడు పరీక్షలు చేశాడు. 50 శాతమే వైకల్యం ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. అదే క్యాంపులో వైద్యుడు డబ్బులు తీసుకుని ఇద్దరికి 45 పర్సంటేజీ ఉండగా.. 80 శాతంగా నమోదు చేశాడు. వైద్యుడిపై కోర్టుకెళ్తా.
- చాకలి ముత్యాలప్ప, దివ్యాంగుడు, శింగనమల
అర్హులకు నాయ్యం చేస్తాం
దివ్యాంగ సర్టిఫికెట్ల రీ వెరిఫికేషనలో కొందరు వైద్యులు డబ్బు ఇవ్యలేదని అర్హుల దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి వారి సర్టిఫికెట్ రద్దు చేసినట్లు, పింఛన రద్దయినట్లు సమాచారం లేదు. అర్హుల సర్టిఫికెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు కాదు. మరోసారి రీ వెరిఫికేషన క్యాంపు నిర్వహించి, న్యాయం చేస్తాం.
-భాస్కర్, ఎంపీడీఓ, శింగనమల
మరిన్ని అనంతపురం వార్తల కోసం...