Tdp : నా నిశ్శబ్దం విప్లవం అవుతుంది
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:37 AM
ఎవరికైనా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం తనకు ఉన్నాయని, తాటాకు చప్పుళ్లకు భయపడనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. సాయినగర్‌లోని ఆసుపత్రి సమస్యపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నానని, ఆ వివరాలతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశను కలుస్తానని స్పష్టం చేశారు. అవే ద్వారా లీగల్‌గా కూడా వెళ్తానని అన్నారు. ..
సమాధానం చెబుతా.. వడ్డీతో చెల్లిస్తా..!
వివరాలతో చంద్రబాబు, లోకేశను కలుస్తా
మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి
అనంతపురం క్రైం, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): ఎవరికైనా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం తనకు ఉన్నాయని, తాటాకు చప్పుళ్లకు భయపడనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. సాయినగర్‌లోని ఆసుపత్రి సమస్యపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నానని, ఆ వివరాలతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశను కలుస్తానని స్పష్టం చేశారు. అవే ద్వారా లీగల్‌గా కూడా వెళ్తానని అన్నారు. అందరి లెక్కలు తేలుస్తానని, వడ్డీతో సహా తిరిగి ఇస్తానని హెచ్చరించారు. రాంనగర్‌లోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జగన పత్రికకు, కొందరు పాత్రికేయులకు అనంతపురంలో వైకుంఠం తప్ప ఎవరూ కనిపించడం లేదని విమర్శించారు. తాను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని కాదని, సామాన్య కార్యకర్తనని అన్నారు. తనకు మరొకరితో పోటీ అని
జగన పత్రికలో రాశారని, తనకు ఎవరితోనూ పోటీ లేదని, తనతో తనకే పోటీ అని అన్నారు. మున్సిపల్ చైర్మనగా, ఎమ్మెల్యేగా 72 ఎకరాల్లో శిల్పారామం, పార్కుల్లో జిమ్స్, కమ్యూనిటీ హాల్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, చెరువుకట్టపై రోడ్డు, పార్కు ఏర్పాటు చేశానని, అయినా తన హయాంలో అభివృద్ధి కుంటుపడిందని రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సూర్యానగర్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, హౌసింగ్ బోర్డు రోడ్లు వేయించామని అన్నారు. చీకటి మిత్రుడు అని మరొకరు రాశారని, తనకు ఫుల్ బాటిల్ కొట్టే అలవాటు లేదని, కార్డ్స్ ఆడేది లేదని అన్నారు.
గత ప్రభుత్వంలో జరిమానాలు వేయడంతో గ్రానైట్ క్వారీలు, క్రషర్లు మూసేసుకుని, ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం పనిచేశామని అన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే పార్టీ చేసుకున్నవారు, ఐదేళ్లపాటు స్పందించని నాయకులు ఇప్పుడు తనపై జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నారని, సస్పెండ్ చేయిస్తారేమో చేయించాలని సవాలు విసిరారు. మరొక ఊరి నుంచి వలస వచ్చిన నాయకుడిపై ఆ ప్రాంతంలో అనే కేసులు ఉన్నాయని, ఆయన కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. అవే సంస్థను పెట్టిందే దౌర్జన్యాలను అడ్డుకోడానికని, గతంలో రాష్ట్రం అంతటా తిరిగి ఫ్యాక్షనిజానికి వ్యతిరేకంగా పోరాటం చేశామని అన్నారు. తన సహనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. ‘నా నిశ్శబ్దం భవిష్యత్తులో ఒక విప్లవం అవుతుంది’ అని హెచ్చరించారు. తన గురించి మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి లేనిపోనివి రాయిస్తున్నారని, ఆయన ప్రజల గురించి ఆలోచిస్తే బాగుంటుందని హితవు పలికారు.