Transco Bills : అదనపు మోత..!
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:35 AM
విద్యుత్ చార్జీల మోతతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు నేటికీ వెంటాడుతున్నాయి. దీంతో బిల్లులు చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. సత్యసాయి జిల్లా పరిధిలోని గృహ, వాణిజ్య, పరిశ్రమల సర్వీసులపై ఇంధన సర్దుబాటు, ట్రూఅప్ చార్జెస్, ఈడీ(ఎలక్ర్టిసిటీ డ్యూటీ), ఎఫ్‌పీపీసీఏ (ఫ్యూయెల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జె్‌స్టమెంట్) చార్జెస్ పేరిట ...
విద్యుత బిల్లు కన్నా అదనపు చార్జీలే అధికం
వెంటాడుతున్న వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు
లబోదిబోమంటున్న వినియోగదారులు
ధర్మవరం/కొత్తచెరువు, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): విద్యుత చార్జీల మోతతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు నేటికీ వెంటాడుతున్నాయి. దీంతో బిల్లులు చూసి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. సత్యసాయి జిల్లా పరిధిలోని గృహ, వాణిజ్య, పరిశ్రమల సర్వీసులపై ఇంధన సర్దుబాటు, ట్రూఅప్ చార్జెస్, ఈడీ(ఎలక్ర్టిసిటీ డ్యూటీ), ఎఫ్‌పీపీసీఏ (ఫ్యూయెల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జె్‌స్టమెంట్) చార్జెస్ పేరిట కరెంటు బిల్లు కంటే ఎక్కువగా అదనపు చార్జీలు మోపుతుండడంతో వినియోగదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం విద్యుత బిల్లులు ఎనిమిదిసార్లు పెంచింది. వారు చేసిన తప్పిదాల వల్లే ప్రస్తుతం వినియోగదారులపై అదనపు చార్జీలు పడుతున్నాయని విద్యుతశాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. సత్యసాయి జిల్లాలో గృహాల కనెక్షన్లు 5,07,756, వాణిజ్య సముదాయం 50,626, పరిశ్రమలు 8,318, ప్రభుత్వ వాటర్ వర్క్స్ ,వీధిదీపాలకు సంబంధించిన కనెక్షన్లు 13,693 ఉన్నాయి. వ్యవసాయ కనెక్షన్లు 1,32,430 ఉన్నాయి.
గత ప్రభుత్వ తప్పిదాలే శాపంగా మారాయా..?
2018లో టీడీపీ ప్రభుత్వం వినియోగదారులు వాడిన యూనిట్లతోపాటు అదనంగా విద్యుత సుంకాన్ని రూ.4.50 వసూలు చేసేది. వినియోగదారుడు ఎంత వాడితే అంతే బిల్లు కట్టేవారు. 75 యూనిట్లకు రూ.240 వచ్చేది. ఇందులో కస్టమర్ చార్జెస్ రూ.40, సుంకం రూ.4.50 ఉండేది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వినియోగించుకుంటున్న విద్యుత కన్నా అదనపు చార్జీలే
ఎక్కువగా విధించింది. 62 యూనిట్లు వాడితే రూ.153 బిల్లు రావాలి. పిక్స్‌డ్ చార్జెస్ కింద రూ.80, కస్టమర్ చార్జెస్ రూ.30, ఎలకి్ట్రసిటీ డ్యూటీ రూ.3.72 చొప్పున ఎఫ్‌పీపీసీఏ చార్జీలు రూ.69.60, సర్‌చార్జీలు రూ.25, ట్రూఅప్ చార్జీల కింద రూ.26.97 అదనంగా వసూలు చేసింది. ఇంధన చార్జీలకు ఖర్చుచేసిన సొమ్మును ప్రస్తుత ప్రభుత్వం వినియోగదారుల నుంచే సర్‌చార్జీల రూపంలో వసూలు చేస్తోంది.
ఏయే చార్జీలు ఉంటాయంటే..
విద్యుత వినియోగదారులను ఐదు కేటగిరీలుగా లెక్కిస్తారు. కేటగిరి-1 కింద సాధారణ గృహాల ప్రజలు, కేటగిరి-2 వ్యాపార సముదాయాలు, కేటగిరి-3 పరిశ్రమలు, కేటగిరి -4 యూటీలిటిస్, కేటగిరి -5 కింద వ్యవసాయదారులను విభజిస్తారు. కనీస చార్జీలు ఉపయోగించే యూనిట్ల ఆధారంగా లెక్కిస్తారు. కొన్ని స్లాబులు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక గృహ వినియోగదారుడు 200 యూనిట్లు వినియోగిస్తే మొదటి 30 యూనిట్లకు రూ.1.90 చొప్పున, తరువాత 31-75 యూనిట్లకు రూ.3చొప్పున, 76- 125 యూనిట్లకు రూ.4.50 చొప్పున, 126-225 యూనిట్లకు రూ.6చొప్పున విద్యుత చార్జీలను లెక్కిస్తారు. స్లాబులు మారితే యూనిట్లకు వేసే చార్జీలు కూడా మారతాయి.
ఫిక్స్‌డ్ చార్జెస్ అంటే..
విద్యుత స్తంభాలు, వైర్లు, ట్రాన్సఫార్మర్లతో పాటు విద్యుత సిబ్బంది సేవలను ఉపయోగించుకుంటున్నందుకు ఈ ఫిక్స్‌డ్ చార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇందులో కేటగిరి-1లో కిలోవాట్‌కు రూ.10, కేటగిరి-2,3 కిలోవాట్‌కు రూ.75 చొప్పున వసూలు చేస్తారు.
కస్టమర్ చార్జెస్
వినియోగదారుల సర్వీస్ చార్జె్‌సగా లెక్కిస్తారు. ఇది కూడా కేటగిరి ఆధారంగా ఉంటుంది. వినియోగదారుడు విద్యుత ఉపయోగించినా, ఉపయోగించకపోయినా దీనిని డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది.
ఎలెకి్ట్రసిటీ డ్యూటీ
ప్రతి వినియోగదారుడి నుంచి ప్రభుత్వాలు ఎలకి్ట్రసిటి డ్యూటీ(విద్యుతసుంకం) రూపంలో వసూలు చేస్తారు. ఇది ప్రభుత్వ ఖజానాకు వెళుతుంది. కేటగిరి 2,3లకు యూనిట్‌కు ఒక రుపాయి చొప్పున వసూలు చేస్తారు. సాధారణ గృహాలకు యూనిట్‌కు 6 పైసలు, రైతులకు పూర్తి మినహాయింపు ఉంటుంది.
ఎఫ్‌పీపీసీఏ అంటే..
ప్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జె్‌స్టమెంట్(ఎ్‌ఫపీపీసీఏ)గా పరిగణిస్తారు. బొగ్గు లేదా ఇందన ధరల్లో పెరుగుదలను నేరుగా వినియోగదారులకు బదిలీ చేసేందుకు తీసుకువచ్చిన సుంకాన్ని మూడునెలలకు ఒకసారి ప్రభుత్వం ఎలకి్ట్రసిటీ రెగ్యులేషన కమిషన్లు (ఎస్‌ఈఆర్‌సీ)లు సవరిస్తూ ఉంటాయి. ఇది యూనిట్లు, స్లాబులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలో 2022 నవంబరుకు సంబంధించి వినియోగదారుడిపై రూ.124.22, 2023 జూలైలో రూ.77.62 చొప్పున అదనంగా భారం మోపారు. 2025 మేలో రూ.62.40 వినియోగదారుల నుంచి సుంకాన్ని ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఈ ఇంధన చార్జీలు 2026 మార్చి వరకు ఉంటాయని విద్యుత శాఖ అధికారులు చెబుతున్నారు.
సర్ చార్జెస్
సర్‌చార్జెస్ అంటే డిలే పేమెంట్ చార్జీగా దీనిని పరిగణిస్తారు. వినియోగదారుడు బిల్లు వచ్చిన 15 రోజుల్లో చెల్లిస్తే ఎలాంటి రుసుం(సర్‌చార్జెస్) ఉండదు. 15 రోజుల తరువాత రోజుకు 5 పైసల చొప్పున వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. నెల దాటితే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సర్‌చార్జీలను రైతుల నుంచి వసూలు చేయరు.
పాలసీ ప్రకారమే ట్రూ అప్ చార్జీలు
గత ప్రభుత్వం విద్యుత ఉత్పత్తి కోసం ఇంధన వనరులైన బొగ్గు తదితర వాటిని కొనుగోలు చేసింది. వాటిని ప్రభుత్వం వినియోగదారుల నుంచే ట్రూఅప్ చార్జీల పేరుతో వసూలు చేస్తోంది. దీంతో విద్యుత బిల్లులు అధికంగా వస్తున్నాయి.
- సంపతకుమార్, ఎస్‌ఈ, విద్యుత శాఖ, శ్రీసత్యసాయి జిల్లా
మరిన్ని అనంతపురం వార్తల కోసం...