Dwakra communities : రికవరీ పట్టదా?
ABN , Publish Date - Aug 14 , 2025 | 12:26 AM
డ్వాక్రా సంఘాల సొమ్మును కాజేసి ఏళ్లవుతున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నారు. నేటికీ బాధ్యులపై చర్యల్లేవు, రికవరీ కూడా చేయలేదు. బాధిత మహిళలు మాత్రం ఏళ్లుగా ఉన్నతాధికారులు, పోలీసు స్టేషన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వారి ఖాతాలో ఎలాంటి సొమ్ము జమైనా ఇవ్వట్లేదు. ...
డ్వాక్రా సభ్యులకు యానిమేటర్లు, సీసీ బురిడీ
రూ.4.49లక్షలుపైగా స్వాహా
ఏళ్లు గడిచినా రికవరీ శూన్యం
పోలీసు స్టేషన చుట్టూ బాధితుల ప్రదక్షిణ
యాడికి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా సంఘాల సొమ్మును కాజేసి ఏళ్లవుతున్నా.. అధికారులు చోద్యం చూస్తున్నారు. నేటికీ బాధ్యులపై చర్యల్లేవు, రికవరీ కూడా చేయలేదు. బాధిత మహిళలు మాత్రం ఏళ్లుగా ఉన్నతాధికారులు, పోలీసు స్టేషన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వారి ఖాతాలో ఎలాంటి సొమ్ము జమైనా ఇవ్వట్లేదు. బ్యాంకు అధికారులు హోల్డ్‌లో పెట్టేశారు. రుణం చెల్లించేవరకు లావాదేవీలకు అవకాశం లేదని తెగేసి చెబుతున్నారు. దీంతో తాము తీసుకోని సొమ్ము ఎందుకు చెల్లించాలని వాపోతున్నారు. మండలంలోని తూట్రాళ్లపల్లికి చెందిన డ్వాక్రా మహిళలకు 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన, ఉన్నతి పథకాల కింద రూ.4.49 లక్షలు మంజూరు చేశారు. లక్ష్మి, లలిత, సరస్వతి మహిళా సంఘాల్లోని సభ్యుల పేరిట మంజూరైన నిధులను యానిమేటర్లు, సీసీలు దుర్వినియోగం చేశారు. ఈ రుణాల సొమ్మును అప్పటి యానిమేటర్లు, సీసీలు మహిళలకు ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకున్నారు. మహిళలు తాము తీసుకున్న రుణాలకు
సంబంధించి కంతుల డబ్బులను బ్యాంకుకు చెల్లించమని యానిమేటర్లు, సీసీలకు ఇస్తే వాటిని కూడా మింగేశారు. రుణాల సొమ్ము చెల్లించకపోవడంతో మహిళా సంఘాలకు తర్వాత మంజూరైన నిధులను బ్యాంకర్లు హోల్డ్‌లో పెట్టారు. దీనిపై మహిళా సంఘాల సభ్యులు వివరాలు ఆరాతీయగా.. బండారం బయటపెట్టింది. దీనిపై 2020 నుంచి ఆ సంఘాల మహిళలు వెలుగు కార్యాలయం, పోలీసు స్టేషన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. న్యాయం చేయాలని పలు దఫాలుగా రోడ్డెక్కి ఆందోళన కూడా చేశారు. అధికారులు విచారణ చేశారు. ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. నేటికీ బాధిత మహిళలకు న్యాయం జరగలేదు. ఆరునెలల క్రితం తూట్రాళ్లపల్లి పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి దృష్టికి సైతం సమస్యను డ్వాక్రా మహిళలు తీసుకెళ్లారు. సొమ్ము కాజేసిన వారిపై చర్యలు చేపట్టకుండా ఏం చేస్తున్నారని అధికారులను ఆయన మందలించారు. బాధిత మహిళలకు న్యాయం జరిగేలా తగు చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. అయినా మహిళలు.. పోలీసు స్టేషన చుట్టూ తిరుగుతున్నారే తప్ప.. నేటికీ కేసు నమోదు కాకపోవడం గమనార్హం. నాలుగురోజుల క్రితం తూట్రాళ్లపల్లికి చెందిన బాధిత మహిళలు.. పోలీసు స్టేషనకు వచ్చారు. కేసు నమోదు చేయాలని ఫిర్యాదు సైతం ఇచ్చారు. ఇంతవరకు కేసు నమోదు కాలేదు.
న్యాయం జరిగేనా..?
2016-17 సంవత్సరంలో దుర్వినియోగమైన నిధులను నేటికి రికవరీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలుగు అధికారులుగానీ, పోలీసులుగానీ దీనిపై ఎందుకు చర్యలు చేపట్టలేకపోతున్నారని డ్వాక్రా సంఘాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో కాలయాపన చేశారనీ, ఇప్పటికైనా దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని మహిళలు కోరుతున్నారు.
నిధుల దుర్వినియోగం వాస్తవమే..
గతంలో మహిళా సంఘాల నిధులు దుర్వినియోగమైన మాట వాస్తవమే. దీనిపై ఉన్నతాధికారులకు నివేదించాం. విచారణకు కమిటీ వేశారు. నిధులు దుర్వినియోగమైనట్లు కమిటీ నిగ్గుతేల్చింది. ఆ నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. బాధిత సంఘాల సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నేను కూడా స్టేషనకు పలుమార్లు వెళ్లా. ఉన్నతాధికారులు దీనిపై చర్యలు చేపట్టాల్సి ఉంది. - చంద్రశేఖర్, ఏపీఎం, యాడికి
మరిన్ని అనంతపురం వార్తల కోసం...